కరోనా కమ్మేస్తోంది!

ABN , First Publish Date - 2022-01-20T06:48:59+05:30 IST

కొవిడ్‌ మళ్లీ జిల్లాను చుట్టేస్తోంది. మూడో వేవ్‌లో ఈనెల 13న తొలిగా జిల్లాలో 100 దాటి 107 కేసులు నమోదు కాగా బుధవారం ఒక్కరోజే 716 వెలుగుచూశాయి.

కరోనా కమ్మేస్తోంది!
పరీక్షల కోసం ఒంగోలు రిమ్స్‌లోని పీపీ యూనిట్‌ వద్ద బారులు తీరిన అనుమానితులు

బుధవారం పరీక్షలు 2,202

పాజిటివ్‌లు 716

వారంలో 1933 కేసులు

పండుగ తర్వాత భారీగా పెరుగుదల

పరీక్షలు పెంచితే మరిన్ని నమోదయ్యే అవకాశం

కార్యాలయాలు, స్కూళ్లు , వైద్యశాలల్లోనూ కలకలం

తీవ్రత తక్కువతో ఊరట

ఇళ్ల వద్ద చికిత్సకే ఎక్కువ మంది  ప్రాధాన్యం

స్వీయ నియంత్రణతోనే పరిస్థితి మెరుగు

జిల్లాను కరోనా కమ్మేస్తోంది. సంక్రాంతి తర్వాత భారీగా కేసులు నమోదవుతున్నాయి. వారం నుంచి క్రమంగా పాజిటివ్‌లు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి మంగళ, బుధ వారాల్లో అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం ఈ రెండురోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చివరకు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసే సిబ్బంది కూడా కరోనా బాధితులుగా మారారు. గత నెల నుంచి మూడో వేవ్‌ కొవిడ్‌ వచ్చినట్లు గుర్తించినప్పటికీ ఈనెల 10వతేదీ వరకు పెద్దగా కేసులు నమోదు కాకపోవడంతో కొంత ఊరట కలిగింది. అయితే గత వారంరోజులుగా క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. పెద్దగా లక్షణాలు లేనప్పటికీ వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఒంగోలు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ మళ్లీ జిల్లాను చుట్టేస్తోంది. మూడో వేవ్‌లో ఈనెల 13న తొలిగా జిల్లాలో 100 దాటి 107 కేసులు నమోదు కాగా బుధవారం ఒక్కరోజే 716 వెలుగుచూశాయి. గత వారం రోజుల్లో జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1,933 పాజిటివ్‌లు నిర్ధారణ కాగా, చివరి రెండు రోజుల్లోనే ఏకంగా 1,140 కేసులు వచ్చాయి. ఇందుకు పండుగ ఎఫెక్ట్‌ కారణంగా కనిపి స్తోంది. సంక్రాంతి సమయంలో జిల్లాకు వేలా ది కుటుంబాల వారు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లారు. అలాగే పట్టణం, పల్లె తేడా లేకుండా పండుగ వేళ క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతరత్రా సామూహిక జనం కలిసే అనేక కార్యక్రమాలు జరిగాయి. పెద్దఎత్తున ప్రజలు దుకాణాలు, మాల్స్‌, థియేటర్లు ఇతరత్రా సందర్శించారు. అలా సందడిగా సంక్రాంతి జరగ్గా ఆ పరిస్థితి కరోనా వ్యాప్తికి కారణమైంది. పండుగ అనంతరం జిల్లాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ వంద కన్నా అధికంగా ఈనెల 13నుంచి నమోదవుతూ 17వ తేదీ వరకు 793 నమోదయ్యాయి. 18వ తేదీ ఆ సంఖ్య 424కు చేరింది. ఇక బుధవారం ఏకంగా 716 కేసులు వచ్చాయి. అందులో ఒక్క ఒంగోలు నగరం, రూరల్‌ మండలంలోని గ్రామాల్లో ఈ రెండు రోజుల్లో ఏకంగా 508 పాజిటివ్‌లు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. కందుకూరు మద్దిపాడు, ఇంకొల్లు, సింగరాయకొండ, కనిగిరి, చీరాల తదితర ప్రాంతాల్లో పదులు, వందల సంఖ్యలో  కేసులు వస్తున్నాయి. అదే సమయంలో కొన్నిచోట్ల టెస్టులు చేసిన సంఖ్య, అందులో వచ్చిన పాజిటివ్‌లు నిష్పత్తి (పాజిటివిటీ రేటు) చాలా ఎక్కువగా ఉంటోంది.

 

పెరుగుతున్న పాజిటివిటీ రేటు

జిల్లా మొత్తంగా ఈనెల 17న 8.60శాతం పాజిటివిటీ ఉండగా మంగళవారం 19.29 శాతానికి పెరిగింది. అదే బుధవారానికి 32.50కు చేరింది. అధికారులు ప్రకటించిన దాని ప్రకారం మొత్తం 2,202 పరీక్షలు చేయగా ఏకంగా 32.5శాతం నమోదైంది. గరిష్ఠంగా ఒంగోలులోని మూడు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో వరుసగా 68.1, 66.7, 58.5 శాతం పాజిటివిటీ వచ్చింది. మాచవరం పీహెచ్‌సీలో 51.8శాతం, శింగరాయకొండలో 52.9శాతంగా ఉంది.  అలాగే మిగతా పీహెచ్‌సీల పరిధిలో 25 నుంచి 50శాతం వరకూ నమోదైంది. అలాగే తాజాగా వైరస్‌ బారినపడుతున్న వారిలో అన్ని వర్గాలు, వృత్తుల వారు ఉండగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చివరకు ఆస్పత్రుల్లోనూ కేసులు వస్తూ అలజడి రేగుతోంది. కొన్ని కార్యాలయాల్లో సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో పనులకు వచ్చే ప్రజలను నియంత్రించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాఠశాలల్లో కేసులు రావడం అటు ఉపాధ్యా యులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. కాగా థర్డ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి అధికమైనప్పటికీ తీవ్రత తక్కు వగా ఉండటంతో బాధితులు కొంత ఊరట చెందుతున్నారు. జలుబు, దగ్గు, కొద్దిపాటి జ్వరానికే పరిమితం అవుతుండ టంతో రెండో వేవ్‌ సమయంలో వలే ఆస్పత్రు లకు, ఆక్సిజన్‌ బెడ్ల కోసం పరుగెత్తాల్సిన అవసరం ఇప్పటివరకు రాలేదు. దీంతో ఎక్కు వమంది బాధితులు ఇళ్ల వద్దే ఉండి చికిత్స పొందేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

 

పరీక్షలు పెంచితే భారీగా కేసులు బయటకు

ప్రస్తుతం జిల్లాలో 2,074 యాక్టివ్‌ కేసు లు ఉండగా 2వేల మంది హోంఐసోలేష న్‌లో ఉండే చికిత్స పొందుతున్నారు. కాగా ప్రస్తుతం అధికారులు చూపుతున్న గణాంకాలకు వాస్తవంగా బాధితులకు చాలా తేడా ఉందని సమాచారం. వేలల్లోనే కేసులు ఉన్నట్లు అనధికారిక అంచనా. ప్రభుత్వపరంగా కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రస్తుతం రెండున్నర వేలకు అటు ఇటుగా ఉంటున్నాయి. వాటిని కనీసం ఐదు వేలకు పెంచితే రోజువారీ కేసులు వెయ్యికిపైగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా జిల్లాలో కరోనా వ్యాప్తి వేగవంతంగా ఉండటం, కేసులు భారీగా పెరుగుతుండటం తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సంబంధిత అధికారులతో బుధవారం ప్రత్యేక సమీక్ష చేశారు. తగు చర్యలకు ఆదేశించారు. మరోవైపు కరోనా కట్టడి పేరుతో ప్రభుత్వం ప్రకటించిన రాత్రి కర్ఫ్యూ జిల్లాలో అమల్లోకి వచ్చింది. మంగళవారం రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు అధికారులు ఆంక్షలను అమలుచేశారు. అలాగే పట్టణాల్లో మాస్కులు లేకుండా తిరిగే వారిని నియంత్రించే చర్యలు ప్రారంభించారు. 


భారీగా పెరిగిన పాజిటివ్‌లు

జిల్లాలో కొవిడ్‌ కన్నెర్ర చేస్తోంది. వారం వ్యవధిలోనే బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం కొత్తగా 716 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒంగోలు నగరంలో అత్యధికంగా 319 ఉన్నాయి. కందుకూరులో 46,మద్దిపాడులో 29,ఇంకొల్లులో 28,శింగరాయకొండలో 27, ఎన్జీపాడులో 26, మార్టూరులో 25, కొత్తపట్నంలో 22 నిర్ధారణ అయ్యాయి. పర్చూరులో 19, ఉలవపాడులో 17, కారంచేడులో 17, మార్కాపురంలో 15, కంభంలో 14, కొరిశపాడులో 12, టంగుటూరులో 11, వైపాలెంలో 10 కేసులు వచ్చాయి. మరికొన్ని మండలాల్లోనూ పాజిటివ్‌లు వెలుగుచూశాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం 170 కేంద్రాల్లో  17,817 మందికి టీకాలు వేశారు. 


బడుల్లోనూ కలవరం

29మంది టీచర్లు,  విద్యార్థులకు కరోనా 

ఒంగోలు విద్య : ఉపాధ్యాయులు, విద్యార్థులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. మంగళవారం 15 మంది ఉపాధ్యాయులు, ఇరువురు ఉపాధ్యాయేతర సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బుధవారం ఏకంగా 24 మంది టీచర్లు వైరస్‌ బారిన పడ్డారు. ఐదుగురు విద్యార్థులకు కూడా కొవిడ్‌ సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క అమ్మనబ్రోలు హైస్కూల్‌లోనే బుధవారం ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకగా, వారిలో ఒకరు పదోతరగతి చదువుతున్నారు. ఈ విద్యార్థి వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కొవిడ్‌ సోకింది. 

 

ముందు జాగ్రత్తలు తీసుకోవాలి : డీఈవో

కరోనా వ్యాప్తి చెందకుండా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డీఈవో విజయభాస్కర్‌ ఆదేశించారు. విద్యార్థులు సంఖ్యను బట్టి పాఠశాలలకు రూ.12,500 నుంచి రూ.లక్ష వరకు స్కూలు గ్రాంటు విడుదలైందన్నారు. ఆ నిధులతో పాఠశాలలో శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు అందరూ మాస్కు ధరించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో ఇప్పటివరకు ఎవరికీ కరోనా సోకలేదని, ఎవరికైనా వచ్చినా బయటే సోకి ఉండవచ్చని ఆయన చెప్పారు. 


Updated Date - 2022-01-20T06:48:59+05:30 IST