Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కరోనా వేళ సొమ్మసిల్లిన శాస్త్రవిజ్ఞత

twitter-iconwatsapp-iconfb-icon
కరోనా వేళ సొమ్మసిల్లిన శాస్త్రవిజ్ఞత

కొవిడ్–19 సంక్షోభంలో మీ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎలా? ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ నెలారంభంలో దేశ పౌరులకు కొన్ని సలహాలను ఇచ్చింది. ఆ భయానక అంటువ్యాధి సోకకుండా మిమ్ములను మీరు కాపాడుకోవడానికి ‘ఆయుష్’ నిపుణులు చేసిన నిర్దిష్ట సిఫారసులలో ఒకటి: ‘నువ్వులు లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యిని ఉదయమూ, సాయంకాలమూ మీ ముక్కు పుటాలలో వేసుకోండి’. ఇలా తమ నాసికారంధ్రాల్లో నూనె లేదా నెయ్యి పోసుకోవడం పట్ల విముఖత చూపేవారికి ఒక ప్రత్యామ్నాయ చికిత్సను కూడా ఆయుష్ సూచించింది. ‘ఒక స్పూన్ నువ్వుల లేదా కొబ్బరినూనెను నోటిలో పోసుకోండి. అయితే తాగవద్దు. నోటిలో రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉంచిన తరువాత ఊసేయండి. పిదప వేడినీళ్ళను పుక్కిలించండి’. మరిన్ని చికిత్సలు కావాలా? చ్యవన్‌ప్రాశ్ తినండి. హెర్బల్ తేనీరు తాగండి. ఆవిరితో ఊపిరిపీల్చండి... ఇత్యాదులు కూడా ఆయుష్‌ సూచనలే. వీటిని పాటించిన దేశభక్తులకు కొవిడ్ సోకదని స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, ఆ సంప్రదాయ వైద్యాలతో కరోనా సంక్రమించే అవకాశాలు తగ్గుతాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రచార సామగ్రి పేర్కొన్నాయి. అత్యంత భయంకర రోగమైన కొవిడ్ కట్టడికి రుజువు కాని చికిత్సలను సిఫారసు చేయడంలో అధికారపక్షం భారతీయ జనతాపార్టీ నాయకులు, ప్రచారకర్తలు ఎలాంటి జంకుగొంకు లేకుండా వ్యవహరిస్తున్నారు. మా కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ విజయ్ శంకేశ్వర్ సిఫారసు చేసిన మరో చికిత్స గురించి చెప్పనా? ఆక్సిజన్‌కు ప్రత్యామ్నాయంగా నిమ్మరసాన్ని నాసికాపుటాల ద్వారా పీల్చాలని ఆయన సూచించారు. అలా చేస్తే ఆక్సిజన్ స్థాయి 80 శాతం పెరుగుతుందని సెలవిచ్చారు. ఈ గృహవైద్యాన్ని, బంధువులు, సహచరులతో సహా రెండువందల మందితో పాటింపజేసి మంచి ఫలితాలను సాధించానని శంకేశ్వర్ తెలిపారు. అయితే ఆయన సలహాను పాటించిన అనుయాయులు పలువురు ప్రాణాలు కోల్పోయారని ఒక ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది. 


కరోనాను దూరంగా ఉంచడం కోసం ఆవిరితో ఊపిరి పీల్చాలని కర్ణాటక బీజేపీ నాయకుడు బిఎల్ సంతోష్ చెప్పారు. మరో బీజేపీపాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో సాంస్కృతిక మంత్రి ఉషా ఠాకూర్ కూడా ‘హవన్’ అనే ప్రాచీన అగ్నిక్రతువుతో కరోనాను తరిమేయవచ్చని పేర్కొన్నారు. పురాతనకాలం నుంచి మహమ్మారులను నియంత్రించేందుకు ఈ ఆచారాన్ని పాటించడం జరుగుతోందని, దీనివల్ల మానవులకు ఆరోగ్యం సమకూరడంతో పాటు పర్యావరణం కూడా పరిశుభ్రమవుతుందని ఆమె చెప్పారు. మంత్రి సూచనను విశ్వసించిన ఆమె ‘పరివార్’ సభ్యులు ఇంటింటికీ తిరిగి వేపాకులు, వంట చెఱకును ఉపయోగించి హవన్ ఆచారాన్ని ఎలా నిర్వహించాలో వివరిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం విస్తృత ప్రచారంలో ఉంది. లోక్‌సభలో భోపాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకురాలు ఒకరు (మహాత్మాగాంధీ హంతకుడు నిజమైన దేశభక్తుడని ఈమె అన్నారు) మరొక విచిత్ర విషయాన్ని వెల్లడించారు. తాను రోజూ గో మూత్రాన్ని సేవిస్తున్నందువల్లే కొవిడ్ బారిన పడలేదని ఆమె నొక్కి చెప్పారు. సుదీర్ఘకాలంగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్‌లో సాధువులు కొంత మంది తాము రోజూ ఆవుపేడను దేహానికి పూసుకోవడం వల్లే కరోనా బారినపడలేదని విశ్వసిస్తున్నామని  చెప్పినట్లు మీడియా వార్తలు వెల్లడించాయి. అధికారపక్షం బీజేపీ నాయకులు ఇంకా సూచించిన పలు చికిత్సలలో ఒకటి కరోనిల్ ఔషధం. సర్కారీ సాధు రామ్‌దేవ్ ఈ ఔషధాన్ని గత ఏడాది ఇద్దరు సీనియర్ కేంద్రమంత్రుల (వీరిలో ఒకరు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు సైన్స్, టెక్నాలజీ శాఖను కూడా నిర్వహిస్తున్నారు) సమక్షంలో విడుదల చేశారు. కరోనిల్‌తో కొవిడ్ రోగులు వారం రోజుల్లో సంపూర్ణంగా కోలుకుంటారని రామ్‌దేవ్‌కు చెందిన ‘పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ అధిపతి అనురాగ్ వర్షనే అనే వ్యక్తి ఆ సందర్భంగా భరోసా ఇచ్చాడు. 


సరే, అధికారపక్షం నాయకులు తమ ‘మహా వైద్యాల’తో ప్రజలకు చేస్తున్న ‘ఉపకారం’ గురించి ఇంకా ఎంతైనా చెప్పవచ్చుగానీ ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయదలిచాను. నేను వైద్య బహుళతావాదాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తాను. మానవాళికి తెలిసిన, లోనవుతున్న అనేకానేక వ్యాధులకు ఆధునిక పాశ్చాత్య వైద్యమే ఏకైక ఉపశమన మార్గమని నేను భావించడం లేదు. ఉబ్బసం మొదలైన రోగాలను నయం చేయడంలో ఆయుర్వేద, యోగ, హోమియోపతి మొదలైన ఆధునికేతర వైద్య విధానాలు మంచి ఫలితాలనిస్తున్నాయనే సత్యాన్ని నా వ్యక్తిగత అనుభవాల ఆధారంగా చెప్పగలను. అయితే కొవిడ్–19 ఇరవై ఒకటో శతాబ్ది విలక్షణ వ్యాధి. ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి మొదలైన వైద్య వ్యవస్థలను అభివృద్ధిపరచిన మహాపురుషులకు పూర్తిగా తెలియని ఒక ఆరోగ్య ఉపద్రవం ఆ మహమ్మారి. అంతేగాక ఇది కేవలం ఒక సంవత్సరకాలంగా మాత్రమే మానవాళిని బాధిస్తోంది. వేప ఆకుల దగ్ధం, గోమూత్ర సేవనం, వనమూలికలు మింగడం, ఆవుపేడను ఒంటికి పట్టించుకోవడం, కొబ్బరినూనె లేదా నెయ్యిని ముక్కుపుటాలలో పోసుకోవడం మొదలైన ‘చికిత్స’లతో కొవిడ్-–19ని నివారించవచ్చని గానీ లేదా దాని నుంచి శీఘ్రగతిన కోలుకోవచ్చని గానీ చెప్పేందుకు ఎటువంటి రుజువులు లేవు. ఇది స్పష్టాతి స్పష్టం. 


కొవిడ్-19ని రెండు నిరోధక చర్యల ద్వారా సంపూర్ణంగా నియంత్రించవచ్చనడానికి బలమైన రుజువులు ఉన్నాయనేది ఒక తిరుగులేని సత్యం. సామాజిక దూరాన్ని పాటించడం, వాక్సిన్ వేయించుకోవడం అనేవే ఆ రెండు నిరోధక పద్ధతులు. ఈ రెండు విషయాలలోనూ మన ప్రభుత్వం ఘోరంగా విఫలమయింది. రాజకీయ సభలు, మతపరమైన కార్యక్రమాలకు అనుమతివ్వడంతో పాటు వాటికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ప్రోత్సహించడం ద్వారా మన పాలకులు తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారు. అలాగే ముందుచూపుతో దేశీయంగా వాక్సిన్ల తయారీకి అవసరమైన సహాయసహకారాలను సంపూర్ణంగా అందించడంలోనూ, కొత్త వాక్సిన్లను ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వడంలోనూ మన ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చూపింది. ఇది పూర్తిగా గర్హనీయం. 


నేను వైజ్ఞానికుల కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు, తాతగారు శాస్త్రవేత్తలు. వారి నోటి వెంట నేను విన్న నిందలు ‘అర్థం పర్థం లేని మతాచార కర్మకాండ’, ‘మూఢవిశ్వాసాలు’ అనేవి మాత్రమే. నిజం చెప్పాలంటే నకిలీ ఔషధాలు, చిట్కావైద్యాలను ప్రోత్సహించడం, అర్థం లేని మత కర్మకాండ నిర్వహించడం, మూఢ విశ్వాసాలను కలిగి ఉండడం ఎవరో ఒక కేంద్ర లేదా రాష్ట్ర మంత్రికే పరిమితం కాదు. సంఘ్ పరివార్ సభ్యులు అందరూ, మరీ ముఖ్యంగా సర్వోన్నత సంఘీ అయిన ప్రధానమంత్రి అటువంటి భావావరణంలోని వారేనని చెప్పవచ్చు. గత ఏడాది మార్చిలో కొవిడ్ అందరి అనుభవంలోకి వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి ఏమి ఆదేశించారో గుర్తుచేసుకోండి. సాయంత్రం ఐదు గంటలకు ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టాలని ఆదేశించలేదూ? ఆ మరుసటి నెలలో ఆ విపత్తు మరింత తీవ్రమయినప్పుడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుద్దీపాలు ఆర్పివేసి కొవ్వొత్తులు వెలిగించాలని నిర్దేశించలేదూ? ఈ చర్యలు కరోనా వైరస్‌ను ఎలా నియంత్రిస్తాయో ప్రధానమంత్రి జ్యోతిష్కుడు లేదా సంఖ్యా శాస్త్రవేత్త మాత్రమే చెప్పాలి. హేతుబద్ధమైన ఆలోచనా విధానం, శాస్త్ర విజ్ఞానం కంటే విశ్వాసం, మత దురభిమానానికే సంఘ్ పరివార్ అగ్రప్రాధాన్యమివ్వడం కద్దు. కరోనా కట్టడికి నరేంద్ర మోదీ జారీ చేసిన విచిత్ర ఆదేశాలు ఆయన సొంత భావజాల సంకుచిత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.


హిందూత్వ అహేతుక ధోరణికి ఒక గొప్ప ఉదాహరణ కుంభమేళా నిర్వహణ. జ్యోతిష్కుల సలహా పై ఆ మహోత్సవాన్ని ఒక సంవత్సరం ముందుగా నిర్వహించారు. ఆరెస్సెస్, బీజేపీ సామాజిక, రాజకీయ ప్రయోజనాల కోసం మహమ్మారి పెచ్చరిల్లిపోయిన సమయంలోనే ఆ మత వేడుకను నిర్వహించేందుకు అనుమతి నిచ్చారు. కరోనా వైరస్ ఉత్తర భారతావని గ్రామసీమలకు వ్యాపించింది. కుంభమేళాకు కేంద్రం సహా బీజేపీపాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మద్దతుకు, గంగానదిలో అసంఖ్యాక మృతదేహాలు కొట్టుకుపోతుండడానికీ మధ్య సంబంధం లేదని చెప్పగలమా? ప్రధానమంత్రి, ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మొదలైన ప్రముఖులు తలుచుకుంటే ఈ విషాదాన్ని నివారించగలిగేవారు. అయితే వారు ఆ విషయమై శ్రద్ధ చూపలేదు. ఎందుకంటే హేతుబద్ధమైన ఆలోచనా విధానం, శాస్త్ర విజ్ఞానం కంటే విశ్వాసం, మత దురభిమానానికి మాత్రమే వారు అగ్ర ప్రాధాన్యమివ్వడం పరిపాటి. 


2019 ఏప్రిల్‌లో ఇదేకాలమ్‌లో నేను శాస్త్ర విజ్ఞానం పట్ల మోదీ ప్రభుత్వ ఏవగింపు వైఖరి గురించి, మన ఉత్కృష్ట వైజ్ఞానిక పరిశోధనా సంస్థలను రాజకీయీకరణ చేయడం గురించి రాశాను. ‘జ్ఞాన సృష్టికి, నవకల్పనలకు విశేషంగా దోహదం చేస్తున్న పరిశోధనా సంస్థలను బలహీనపరచడం ద్వారా మోదీ ప్రభుత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తోంది. మేధస్సుపై ఈ అనాగరిక, అవిశ్రాంత యుద్ధం వల్ల వర్తమాన భారతీయులతో పాటు ఇంకా పుట్టని భావితరాల భారతీయులు కూడా భారీమూల్యం చెల్లించవలసి వస్తుంది’ అని నేను ఆనాడే రాశాను. అప్పటికి కొవిడ్-19 గురించి ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ తెలియనే తెలియదు. ఇప్పుడు అది మనలను అతలాకుతలం చేస్తోంది. మేధస్సుపై మోదీ ప్రభుత్వ అనాగరిక, అవిరామ పోరు కొనసాగుతూనే ఉంది. రెండేళ్ళ క్రితం నేను ఊహించిన భవిష్యత్తు, వాస్తవానికి మరింత వ్యాకులపరిచే విధంగా ఉంటుందని అంతకంతకూ స్పష్టమవుతోంది. హేతువు, శాస్త్ర విజ్ఞానం పట్ల కేంద్రప్రభుత్వం, అధికారపక్షం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరితో కొవిడ్‌ విపత్తు జాతికి ఆత్మవినాశకంగా పరిణమించింది. అసంఖ్యాక భారతీయులు కనీవినీ ఎరుగని విలయంలో విలవిలలాడుతున్నారు.

కరోనా వేళ సొమ్మసిల్లిన శాస్త్రవిజ్ఞత

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.