సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఒకరికి కరోనా

ABN , First Publish Date - 2020-04-04T10:12:42+05:30 IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు బయటపడింది. 59 సంవత్సరాల వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఒకరికి కరోనా

రామచంద్రాపురానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ

బాధితుడికి లోకల్‌ కాంటాక్టుతోనే వైరస్‌ సోకినట్లు అనుమానం

జిల్లాలో ఏడుకు చేరిన బాధితుల సంఖ్య

ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే

కట్టడి చర్యలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 3: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు బయటపడింది. 59 సంవత్సరాల వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ చేశారు. పట్టణానికి చెందిన వ్యక్తి నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. కరోనా లక్షణాలు గుర్తించిన వైద్యులు శుక్రవారం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేల్చారు. ఆయనకు అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. బాధితుడు ఇతర ప్రాంతాల్లో పర్యటించడం కానీ, విదేశాలకు వెళ్లడం కానీ జరగకపోవడంతో లోకల్‌ కాంటాక్టుతోనే వైరస్‌ సోకినట్లు తెలుసుస్తోంది. కొద్దిరోజు క్రితం ఆయన వద్ద బోరు వేయించే క్రమంలో బోర్‌వెల్‌పై పనిచేసే ఇతర ప్రాంతాల వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినట్లు కుటుంబ సభ్యుల సమాచారం. వారి ద్వారానే వైరస్‌ సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. తాజా కేసుతో సంగారెడ్డి జిల్లాలో బాధితుల సంఖ్య 7కు పెరిగింది.


బాధితుల నివాస ప్రాంతాల్లో ఇంటింటా సర్వే

కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం శుక్రవారం 42 నిఘా బృందాలతో ఇంటింటా సర్వే నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ లక్షణాలతో గాంధీ ఆస్పత్రికి తరలించిన ఆరుగురు నివసించిన సంగారెడ్డి పట్టణం, సంగారెడ్డి మండలం అంగడిపేట, కొండాపూర్‌, జహీరాబాద్‌ మల్చెల్మ ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను నమోదు చేసుకుంటున్నారు. కలెక్టర్‌ ఎం.హన్మంతరావు, ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం కరోనా వ్యాధి సోకిన వారి ప్రాంతాలను పరిశీలించారు. కరోనా బాధితులు నివసించిన సంగారెడ్డి, అంగడిపేట, కొండాపూర్‌, జహీరాబాద్‌ మల్చెల్మ ప్రాంతాల్లో శుక్రవారం అగ్నిమాపక యంత్రాలతో సోడియం హైపోక్లోరైడ్‌ రసాయనం పిచ్‌కారి చేయించారు. సంగారెడ్డి, అంగడిపేట, కొండాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఈ పనులను పర్యవేక్షించారు. 


ఎంఎన్‌ఆర్‌ నుంచి హైదరాబాద్‌కు తరలింపు

సంగారెడ్డి రూరల్‌ : ఢిల్లీలో మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో 37 మందిని సంగారెడ్డి మండలం ఫసల్‌వాది శివారులోని ఎంఎన్‌ఆర్‌ ఆసుపత్రిలోని క్వారంటైన్‌లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే వారిలో 20 మందిని గాంధీ, చెస్ట్‌ ఆసుపత్రులకు తరలించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎంఎన్‌ఆర్‌ ఆసుపత్రిలో మరో 17 మంది ఉండగా, వీరి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.


కంది పీహెచ్‌సీ డాక్టర్‌ సస్పెన్షన్‌

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంది పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సంగమణిని సస్పెండ్‌ చేస్తూ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా కేసు గుర్తించిన సంగారెడ్డి మండలం అంగడిపేటలో నిఘా బృందానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఇంతటి కీలకమైన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన అధికారులు ఆమెను సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తున్నది.

Updated Date - 2020-04-04T10:12:42+05:30 IST