Abn logo
Mar 20 2020 @ 01:06AM

4 రోజులు.. రూ.19 లక్షల కోట్లు

కరోనా భయాలతో ఇన్వెస్టర్ల సంపద మాయం

వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు


న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్లు కరోనా భయాలతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ షేర్లను అందినకాడికి అమ్ముకుంటున్నారు. ఫలితంగా మార్కెట్లలో వరుస పతనాలు నమోదు అవుతున్నాయి. గురువారంనాటి పతనంతో వరుసగా నాలుగు రోజులు దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.19,49,461.82 కోట్లు కోల్పోయారు. ఇప్పుడు బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1,09,76,781 కోట్లకు దిగజారిపోయింది. నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ 5,815.25 పాయింట్లు నష్టపోయింది. 


రోలర్‌ కోస్టర్‌ రైడ్‌...

ఇన్వెస్టర్లలో నెలకొన్న బలహీన సెంటిమెంట్‌తో గురువారం ప్రారంభంలోనే బీఎ్‌సఈ సెన్సె క్స్‌ భారీగా నష్టపోయింది. ఇంట్రాడేలో 2,155.05 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. మధ్యా హ్నం రెండు గంటల సమయంలో సెన్సెక్స్‌ లాభాల బాట పట్టింది. ఇది ఒక అరగంట పాటు సాగింది. తర్వాత మళ్లీ నష్టాలు మొదలయ్యాయి. చివరకు సెన్సెక్స్‌ 581.28 పాయింట్ల నష్టంతో 28,288.23 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 205.35 పాయింట్లు కోల్పోయి 8,263.45 పాయింట్ల వద్ద క్లోజైంది. 


‘‘ప్రపంచ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా ఉంటుందన్న భయాలతో మార్కెట్లలో అధిక హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి’’ అని ఆనంద్‌ రాఠీ షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ (ఫండమెంటల్‌) నరేంద్ర సోలంకి తెలిపారు. 

‘‘గురువారం నాటి ట్రేడింగ్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలకు రోలర్‌ కోస్టర్‌ రైడ్‌గా మారింది. భారీ స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూసిన సూచీలు చివరకు 2 శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా బలహీన సెంటిమెంట్‌ ఆవహించి ఉండటం, విదేశీ నిధులు తరలిపోవడం వంటివి మార్కెట్లను ప్రభావితం చేశాయి’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌  రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. వీటితో పాటు దేశీయంగా కరోనా కేసులు పెరగడం మార్కెట్లలో నిరాశావాదం పెరిగిపోవడానికి కారణమైనట్టు తెలిపారు. 


సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 22 షేర్లు నష్టాలతో ముగిశాయి. 


బజాజ్‌ ఫైనాన్స్‌ (10.24 శాతం), మారుతీ సుజుకీ ఇండియా (9.85 శాతం), యాక్సిస్‌ బ్యాంక్‌ (9.50 శాతం), ఎం అండ్‌ ఎం (9.28 శాతం),  టెక్‌ మహీంద్రా (8.43 శాతం), ఓఎన్‌జీసీ షేర్లు (7.35 శాతం) నష్టపోయాయి. 


ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్రా, హీరో మోటోకార్ప్‌ షేర్లు 7.50 శాతం వరకు పెరిగాయి. 


యెస్‌ బ్యాంక్‌ షేరు 11.35 శాతం తగ్గి రూ.53.90 వద్ద ముగిసింది.

 

బీఎ్‌సఈ మెటల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో, ఎనర్జీ, ఇండస్ర్టియల్స్‌ సూచీలు 7.17 శాతం వరకు తగ్గాయి. టెలికాం సూచీ మాత్రం పెరిగింది. 


బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 3.70 శాతం, 4.53 శాతం క్షీణించాయి. 


బీఎ్‌సఈలో 1,828 షేర్లు నష్టాలతో, 574 షేర్లు లాభాలతో, 146 షేర్లు యథాతథంగా ముగిశాయి. 


1,200కు పైగా కంపెనీల షేరు ఏడాది కనిష్ఠ స్థాయిని తాకాయి. 


ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ సూచీ 8 శాతం క్షీణించింది. హాంగ్‌సెంగ్‌, నిక్కీ, షాంఘై కంపోజిటివ్‌ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) ఆశ్చర్యకరంగా 75,000 కోట్ల యూరోల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడంతో యూరప్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 


86 పైసలు తగ్గిన రూపాయి

రూపాయి విలువ మరింతగా క్షీణించింది. గురువారం డాలర్‌ మారకంలో రూపాయి 86 పైసలు తగ్గి సరికొత్త రికార్డు కనిష్ఠ స్థాయి 75.12కు  చేరుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తితో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రూపాయి విలువ క్షీణిస్తోంది. దేశీయ ఈక్విటీ, డెట్‌ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు తరలిపోవడం కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నట్టు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు 1,000 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.


ఆర్‌ఐఎల్‌ షేర్లలో కొనసాగిన పతనం 

రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ ఈ షేరు నష్టాన్నే నమోదు చేసుకుంది. గురువారం బీఎ్‌సఈలో ఆర్‌ఐఎల్‌ షేరు 5.34 శాతం క్షీణించి రూ.917.10 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 8 శాతం నష్టంతో రూ.891 (52 వారాల కనిష్ఠం) స్థాయికి చేరింది. ఎన్‌ఎ్‌సఈలో 5.24 శాతం తగ్గి రూ.917.70 వద్ద క్లోజైంది. నాలు గు రోజుల్లో ఈ షేరు 17.14 శాతం క్షీణించింది. దీంతో మార్కెట్‌ విలువ రూ.1,20,311.78 కోట్లు తగ్గిపోయింది. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.5,81,374.22 కోట్లుగా ఉంది. గత నవంబరులో ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్ల స్థాయికి ఎగబాకింది. కొన్ని నెలల్లో ఇది భారీగా క్షీణించింది. 

Advertisement
Advertisement
Advertisement