Abn logo
Jun 16 2021 @ 12:30PM

కుంభ‌మేళాలో క‌రోనా ప‌రీక్ష‌ల కుంభ‌కోణం.... వెలుగు చూస్తున్న వాస్తవాలు!

హ‌రిద్వార్‌: ఉత్త‌రాఖండ్‌లోని హరిద్వార్‌లో ఇటీవ‌ల జ‌రిగిన‌ కుంభమేళాలో  కోవిడ్ టెస్టుల పేరిట భారీ అవినీతి కుంభ‌కోణం చోటుచేసుకున్న‌ద‌ని తెలుస్తోంది. ఒక్కో క‌రోనా టెస్టుకు ప్ర‌భుత్వం ఆయా ఏజెన్సీల‌కురూ. 350 చ‌ప్పున చెల్లించింది. ప్ర‌భుత్వం ఎంపిక చేసిన ఈ మెడిక‌ల్ ఏజెన్సీలు నాలుగు ల‌క్ష‌ల క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా, వాటిలో ల‌క్ష‌కు పైగా టెస్టులు న‌కిలీవ‌ని తెలుస్తోంది. 50 వేలకు పైగా టెస్టులకు ఒకే మొబైల్ నంబర్‌ ఉండ‌టం అనుమానాల‌కు తావిస్తోంది. అలాగే హ‌రిద్వార్‌కు వెళ్ల‌ని వారి డేటా రిపోర్టులో ఉండ‌టం విశేషం. 

ఈ టెస్టుల జాబితాలో రాజస్థాన్‌కు చెందిన విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లున్నాయి. కాగా హరిద్వార్‌లో క‌రోనా టెస్టు న‌మూనాల‌ను సేకరించే బాధ్యతను చేప‌ట్టిన‌ ఉద్యోగి కూడా రాజ‌స్థాన్‌లోని హనుమన్‌గఢ్‌కు చెందిన వ్య‌క్తి. ఇత‌ను నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమంలో పేరు న‌మోదు చేసుకున్నాడు. తాను కుంభ‌మేళాకు ఎప్పుడూ వెళ్ళలేదని, తనకు డేటా ఇచ్చి, శిక్ష‌ణ‌లో బాగంగా అప్‌లోడ్ చేయాని కోరార‌ని తెలిపాడు. కాగా ఈ ఉదంతంలో భారీ అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని అధికారుల ద‌ర్యాప్తులో వెల్ల‌డ‌య్యింది. క‌రోనా టెస్టుల నివేదిక‌లో ఉన్న‌చిరునామాలు త‌ప్ప‌డువ‌ని, రాజ‌స్థాన్‌కు చెందిన చిరునామాలు అధికంగా ఉన్నాయ‌ని తేలింది. ఒకే చిరునామాతో వందలాది మంది పేర్లు ఉన్నాయి. కాగా రోజుకు 50 వేల క‌రోనా టెస్టులు చేయాల‌ని హైకోర్టు ఆదేశించడంతో ప్ర‌భుత్వం ఈ ప‌నిని ఎనిమిది ఏజెన్సీలకు అప్పగించింది. ఈ నేప‌ధ్యంలో అవినీతి చోటుచేసుకున్న‌ద‌ని తెలుస్తోంది.