మరో మహిళా ఐఏఎస్‌‌కు కరోనా.. సచివాలయం విలవిల

ABN , First Publish Date - 2020-06-09T16:03:48+05:30 IST

ఇప్పటికే సచివాలయంలో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి సహా 31 మంది పాజిటివ్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

మరో మహిళా ఐఏఎస్‌‌కు కరోనా.. సచివాలయం విలవిల

చెన్నై : రాష్ట్ర సచివా లయంలో పనిచేస్తున్న మరో ఐఏఎస్‌ అధికారిణికి కరోనా సోకింది. ఇప్పటికే సచివాలయంలో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి సహా 31 మంది పాజిటివ్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులలో 40 మందికి పాజిటివ్‌ లక్షణాలు నిర్ధారణ అయ్యింది.


నామక్కల్‌ మాళిగైలో...

సచివాలయ ప్రాంగణంలోని పది అంతస్థులు కలిగిన నామక్కల్‌ కవింజర్‌ మాళిగై (భవనసము దాయం)లో సమాచార సాంకేతిక శాఖకు చెందిన ఓ కార్యాలయంలో ఐదుగురికి కరోనా సోకటంతో ఆ బ్లాక్‌లో ఉన్న కార్యాలయాలన్నింటిని మూసివేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పేషీలోని ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు దీంతో సీఎం పేషీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కరోనా వైద్యపరీక్షలు జరిపారు. ఇక ముఖ్యమంత్రి పళనిస్వామి గత కొద్ది రోజులుగా సచివాలయానికి రావడం మాను కున్నారు. గ్రీన్‌వేస్‌ రోడ్డులో తన క్యాంపు కార్యాలయంలోనే ఎడ ప్పాడి తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.


ఇక సచివాలయంలో గత వారం కరోనా సోకిన ఐఏఎస్‌ అధికారిణి ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మరో మహిళా ఐఏఎస్‌ అధికారికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఇంతకు ముందు కరోనాకు గురైన మహిళా ఐఏఎస్‌ అధికారితో ఈమె రోజూ మధ్యాహ్నం ఒకే టేబుల్‌ వద్ద కూర్చుని కలిసి భోజనం చేసేవారని తెలిసింది.


లిఫ్టులో వెళ్ళడమే కారణమా?

పది అంతస్థులు కలిగిన నామక్కల్‌ కవింజర్‌ మాళిగై భవనసముదాయాల్లో రోజూ 3300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా పై అంతస్థులలో ఉన్న తమ కార్యాలయాలకు లిఫ్టులోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకేసారి లిఫ్టులో  పదిమందిదాకా పై అంతస్థులకు వెళుతుంటారని, ఆ కారణంగానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మునుపటి లాగే 33 శాతం ఉద్యోగులను మాత్రమే పనిచేయడానికి అనుమతించాలని సచివాలయ ఉద్యోగులు సంఘం నాయకులు ముఖ్యమంత్రిుకి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ఇప్పటిదాకా కరోనా తాకిడికి గురైన ఉద్యోగుల సంఖ్య 40కి పెరిగిందని అధికారికంగా ప్రకటించారు. వీరితోపాటు మరో యాభైమందికి కరోనా పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షా ఫలితాలు వెలువడితే కరోనా బాధితుల సంఖ్య 40 నుండి 80 దాకా పెరుగుతుందని ఉద్యోగుల సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-06-09T16:03:48+05:30 IST