6 లక్షలకు చేరువలో..

ABN , First Publish Date - 2020-09-17T09:11:04+05:30 IST

మన రాష్ట్రంలో కరోనా కేసులు ఆరు లక్షలకు చేరవయ్యాయి. బుధవారం కొత్తగా 8,835 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 5,92,760కి చేరుకుంది.

6 లక్షలకు చేరువలో..

కొత్తగా మరో 8,835 మందికి కరోనా

64 మరణాలు.. 5105కి చేరిన మృతులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

మన రాష్ట్రంలో కరోనా కేసులు ఆరు లక్షలకు చేరవయ్యాయి. బుధవారం కొత్తగా 8,835 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 5,92,760కి చేరుకుంది. గురువారం నాటికి ఈ సంఖ్య ఆరు లక్షలు దాటే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర తర్వాత ఆ స్థాయిలో కేసులు ఏపీలోనే నమోదవుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరిలో అత్యధికంగా 1,421 కేసులు బయటపడ్డాయి. పశ్చిమగోదావరిలో 1051, ప్రకాశంలో 873, చిత్తూరు 798, అనంతపురం 725 మందికి వైరస్‌ సోకింది. మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 10,845 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 4,97,376కి చేరుకున్నాయి. రాష్ట్రంలో మరో 64 మందిని కరోనా బలి తీసుకుంది. చిత్తూరులో 9, నెల్లూరులో 7, గుంటూరు, ప్రకాశంలో ఆరుగురు చొప్పున, అనంతపురం, కడప, కృష్ణా, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిల్లో ఐదుగురేసి చొప్పున, కర్నూలు 4, తూర్పుగోదావరి 3, విశాఖపట్నం, విజయనగరంలో ఇద్దరేసి చొప్పున కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో ఈ మరణాల సంఖ్య 5105కి పెరిగింది. 


లక్ష కేసుల దిశగా ‘తూర్పు’

తూర్పుగోదావరి జిల్లా లక్ష కేసుల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. బుధవారం నమోదైన 1,421 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 81,064కి పెరిగింది. అక్టోబరు నెలాఖరు వరకు జిల్లాలో ఇదే పరిస్థితి ఉంటుందని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఈ జిల్లాలో వలస కూలీలు ఎక్కువ. వ్యాపార లావాదేవీల నిమిత్తం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి జిల్లాకు వేల మంది వస్తుంటారు. దీంతో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. స్థానికులు కూడా సరైన జాగ్రత్తలు పాటించడం లేదని, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు కూడా విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కేసుల ఉదృతి అధికంగానే ఉంది. జిల్లాలో కొత్తగా 1,051 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 44,460కి చేరుకున్నాయి. అనంతపురం జిల్లాలో మరో 725 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 50,813కి చేరింది. కడప జిల్లాలో 536 మందికి వైరస్‌ సోకగా మొత్తం కేసుల సంఖ్య 37,873కి పెరిగింది. విజయనగరం జిల్లాలో మరో 544 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 29,598కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా 495 కేసులు , కృష్ణాలో 396, విశాఖ జిల్లాలో 325, నెల్లూరు జిల్లాలో 562 , చిత్తూరు జిల్లాలో 594, గుంటూరు జిల్లాలో 685 కొత్త కేసులు నమోదయ్యాయి.


సచివాలయంలో 19 కేసులు

అమరావతి సచివాలయంలో వైరస్‌ ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. బుధవారం18 మందికి, అసెంబ్లీలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 157కి పెరిగింది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సచివాలయం మొదటి భవనంలో సీఎంఆర్‌ఎఫ్‌ విభాగంలో ప్రత్యేక కార్యదర్శి ఓఎ్‌సడీ, సెక్షన్‌ అధికారి, అటెండర్‌, రెండో బ్లాక్‌లో ప్రణాళికా విభాగం డైరెక్టర్‌ వద్ద పీఏకి, విద్యుత్‌ శాఖలో అటెండర్‌కి, పరిశ్రమలశాఖలో సెక్షన్‌ అధికారికి (ఎస్‌వో)కి వైరస్‌ సోకింది. మూడో బ్లాక్‌లోని పే అండ్‌ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి, ఆడిటర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎ్‌సవో)కి వైరస్‌ సోకినట్టు తేలింది. 

Updated Date - 2020-09-17T09:11:04+05:30 IST