బడిలో కరోనా.. భయం వద్దు!

ABN , First Publish Date - 2021-12-04T07:02:07+05:30 IST

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నెల రోజులుగా గురుకుల పాఠశాలల్లో పదుల సంఖ్యలో పాజిటివ్‌లు వస్తున్నాయి.

బడిలో కరోనా.. భయం వద్దు!

  • విద్యార్థుల్లో కొవిడ్‌ లక్షణాల తీవ్రత తక్కువే
  • ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా స్వల్పమే
  • బయటివారి నుంచే ఎక్కువ శాతం వ్యాప్తి
  • పిల్లల్లో ప్రతి నిరోధకాలు వృద్ధి చెందాయి...
  • వైరస్‌ ప్రభావం అంతంతే: వైద్య నిపుణులు
  • ప్రాణాపాయం లేదంటున్న వైద్య శాఖ


హైదరాబాద్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నెల రోజులుగా గురుకుల పాఠశాలల్లో పదుల సంఖ్యలో పాజిటివ్‌లు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులు కొవిడ్‌ బారినపడుతున్నప్పటికీ.. లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని, ఆస్పత్రుల్లో చేరేంత తీవ్రత అతి తక్కువగా ఉంటోందని వివరిస్తున్నారు. సీరియస్‌ అయ్యే కేసులు ఉండడం లేదని చెబుతున్నారు. నవంబరు 1 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా 557 విద్యా సంస్థల్లో 37,994 మంది విద్యార్ధులకు వైద్య ఆరోగ్య శాఖ కొవిడ్‌ టెస్టులు నిర్వహించింది. 141 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. వీరి కాంటాక్టుల్లో 4,659 మందికి పరీక్ష చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపింది. ఐదుకు మించి కేసులు ఏడు విద్యా సంస్థల్లో నమోదయ్యాయని, 19 పాఠశాలల్లో 5లోపు కేసులు వచ్చాయని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ 141 పాజిటివ్‌లకు అదనంగా ఇటీవల గురుకులాల్లో విద్యార్థులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. నెల వ్యవధిలోనే 300 మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. విషయం బయటపడితే ఇబ్బంది అన్న భావనతో కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో వస్తున్న కేసులపై యాజమాన్యాలు సమాచారం ఇవ్వడం లేదు.


ఔట్‌ బ్రేక్స్‌కు అనేక కారణాలు

రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, గురుకుల్లాల్లో 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్నిచోట్ల భారీగా పాజిటివ్‌లు వస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. కొన్నిచోట్ల బయటనుంచి వచ్చిన వ్యక్తులే కారణమని తేల్చారు. ఓ విద్యా సంస్థల్లో ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వంట మనిషి కారణంగా పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇంకోచోట మరో కారణంతో ఔట్‌ బ్రేక్స్‌ వచ్చినట్లు తమ పరిశీలనలో వెల్లడైందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తి నుంచి చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో కేవలం ఆరు శాతం మందే పిల్లలున్నారు. అదీ 5-14 ఏళ్ల మధ్య వారేనని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇక ప్రతి ఐదు వేల మరణాల్లో ఒక్కరే ఈ వయసు వారున్నట్లు వెల్లడించింది. అత్యధిక శాతం పిల్లలో ఎటువంటి దీర్ఘకాలిక జబ్బులు లేకపోవడం.. వయసు ప్రకారం పలు రకాల టీకాలు తీసుకుని ఉండడం.. పిల్లలకు రక్షణగా నిలుస్తోందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.



లక్షణాలివీ..

ప్రస్తుతం కొవిడ్‌ బారినపడ్డ గురుకులాల, పాఠశాల విద్యార్థులెవరికీ ఆరోగ్యం సీరియస్‌ కాలేదని వైద్యవర్గాలంటున్నాయి. చాలామందికి లక్షణాలు కూడా లేవంటున్నాయి. వాస్తవానికి కొవిడ్‌ వస్తే జలుబు, దగ్గు, జ్వరం ఉంటాయి. పెద్దవారితో పోల్చితే.. కొవిడ్‌ సోకిన పిల్లల్లో ఇవి కూడా తక్కువగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దేశంలో కరోనా మొదటి, రెండో వేవ్‌ అనంతరం పిల్లలు తెలియకుండానే కొవిడ్‌తో ప్రభావితమయ్యారు. దేశంలో 18ఏళ్లలోపు వారిలో ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి 56శాతం మందికి యాంటీబాడీస్‌ వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వారికి టీకా లేకపోయినప్పటికీ యాంటీబాడీ్‌సతో పాటు సహజ రోగ నిరోధక శక్తితో కొవిడ్‌ తీవ్రత తక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.


భయపడక్కర్లేదు

లక్షణాలు లేని పిల్లలు మూడు వారాల తర్వాత మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ బారినపడే అవకాశాలుంటాయి. తల్లిదండ్రులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వరుసగా 3 రోజుల పాటు జ్వరం, కళ్లు ఎర్రబడటం, కడుపు నొప్పి ఎంఐఎ్‌ససీ లక్షణాలు. ఇవి కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యుడికి చూపించాలి. ఎంఐఎ్‌ససీతో భయపడనవసరం లేదు.


రిసెప్టర్స్‌ తక్కువ.. తీవ్రత స్వల్పం

మన శరీరంలో కణాల ఉపరితలంపై ఏస్‌ రిసెప్టర్లు ఉంటాయి. వీటికి వైరస్‌ అతుక్కుంటుంది. పిల్లల్లో ఈ రిసెప్టర్లు చాలా తక్కువ. అందుకే వారిపై కొవిడ్‌ ప్రభావం అతి స్వల్పం. ఐదేళ్లలోపు వారికి ముప్పు ఇంకా తక్కువ. వారు వివిధ రకాల టీకాలు తీసుకొని ఉంటారు. పెద్దవారితో పోల్చితే ఐదేళ్లు పైబడినవారిలో ప్రమాదం తక్కువే.

- మాదల కిరణ్‌, క్రిటికల్‌ కేర్‌ హెచ్‌వోడీ, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి

Updated Date - 2021-12-04T07:02:07+05:30 IST