కొవిడ్‌ 90 వేలు

ABN , First Publish Date - 2020-09-24T07:34:49+05:30 IST

జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రతీరోజూ పాజిటివ్‌ కేసులు వెయ్యికి తగ్గడం లేదు

కొవిడ్‌ 90 వేలు

(కాకినాడ/అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రతీరోజూ పాజిటివ్‌ కేసులు వెయ్యికి తగ్గడం లేదు. బాధితుల సంఖ్య 90వేలకు చేరుకుంది. తాజాగా ఒక్కరోజులో 1,112 మంది వైరస్‌ బారిన పడ్డారు.  చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య  497కు చేరింది. యాక్టివ్‌గా 11,818 మంది నమోదు కాగా 77,732 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. తాజాగా ట్రూనాట్‌తో చేసిన పరీక్షల్లో 333 మంది, ర్యాపిడ్‌ కిట్‌ లతో చేసిన పరీక్షల్లో 779 మంది వైరస్‌ బారిన పడినట్టు తేలింది. వైరస్‌ అంటించుకుంటున్నారా, అంటు కుంటోందా అనేది స్పష్టం కాక వైద్యులు గగ్గోలు పెడుతున్నారు. వృద్ధులు వ్యాధి బారిన పడుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెంటిలేటర్‌ పై చికిత్స అందించాల్సి వస్తోంది. ఇటీవల కొత్తపేట మండ లం అవిడి గ్రామానికి చెందిన ఒక ప్రముఖ పాస్టర్‌ అకస్మాత్తుగా ఆక్సిజన్‌ లెవెల్స్‌ కోల్పోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆయన్ను హుటాహుటిన కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే దారిలోనే మృతి చెందాడు.


కోనసీమలో వైరస్‌ విజృంభణ

కోనసీమలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పదహారు మండలాల్లో 15వేలకు పైనే కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా మాత్రం అంతకంటే ఎక్కువే ఉంది. ఎందుచేతంటే అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులు ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఎక్సరే, స్కానింగ్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా పరీక్షలు చేయించు కుంటున్నారు. అలాంటి వారి సంఖ్య భారీగానే ఉంది. ప్రభుత్వం కూడా పరిమిత సంఖ్యలోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ మినహా ఆర్టీపీసీఆర్‌ ద్వారా పరీక్షలు చేయడం, వాటి ఫలితాలు వారానికి గానీ వెలువడకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లోను అత్యధికులు కొవిడ్‌ పరీక్షలు చేయించు కునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఒక్కో పరీక్షకు రూ.1200 నుంచి రూ.3వేలు పైనే వసూలు చేయడం ద్వారా బాధితులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు.


ఇప్పటివరకు కోనసీమవ్యాప్తంగా 16 మండలాల పరిధిలో 15వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరణాలు 235 అని అధికారులు ధ్రువీకరిస్తున్నప్పటికీ అనధికారికంగా హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య రెట్టింపే ఉంటుంది. రెండు నెలలుగా కొవిడ్‌ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ సిబ్బంది పట్టీపట్టనట్టు వ్యవహరించడంతో పాటు ఫలితాల వెల్లడిలో వహిస్తున్న జాప్యం ప్రైవేటు ల్యాబ్‌లకు వరంగా మారింది. అమలాపురంలో కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రితో పాటు ఏరియా ఆసుపత్రి, శ్రీనిధి ఆసుపత్రిలలో కొవిడ్‌ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక కొవిడ్‌ పరీక్షల్లో లక్షణాలు తక్కువ ఉన్న 45 ఏళ్లలోపు వ్యక్తులను బోడసకుర్రులోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలిస్తున్నారు. అయితే అక్కడ కేవలం మెడిసిన్‌ మాత్రమే అందించి అప్పుడ ప్పుడూ బాధితుల లక్షణాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరీ సీరియస్‌ అయితే కిమ్స్‌ కొవిడ్‌కు తరలిస్తున్నారు. 

Updated Date - 2020-09-24T07:34:49+05:30 IST