బడిలో కరోనా..!

ABN , First Publish Date - 2021-04-17T06:04:07+05:30 IST

విద్యార్థులు, టీచర్ల ప్రాణాలను ఫణంగా పెట్టి, విద్యాశాఖ చెలగాటం ఆడుతోంది. జిల్లాలో భారీగా కేసులు పెరుగుతున్నాయి.

బడిలో కరోనా..!

పక్షం రోజుల్లో భారీగా కొవిడ్‌-19 బాధితులు

రొద్దంలో ఐదుగురు, బుక్కపట్నంలో ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్‌

కేజీబీవీల్లో 2841 మందికి పరీక్షలు

మోడల్‌ స్కూళ్లలో శూన్యం

బాధితుల్లో విద్యార్థులు, టీచర్లు

నివారణ చర్యలకు చిల్లిగవ్వ ఇవ్వని ప్రభుత్వం

ఇతర రాషా్ట్రల్లో స్కూళ్లు బంద్‌

ఏపీ ప్రభుత్వ తీరుపైటీచర్లలో అసహనం

ప్రాణాలు ఫణంగా పెడుతున్నారంటూ ఆగ్రహం

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 16: విద్యార్థులు, టీచర్ల ప్రాణాలను ఫణంగా పెట్టి, విద్యాశాఖ చెలగాటం ఆడుతోంది. జిల్లాలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. వందల్లో కేసులు వస్తుంటే.. పదుల సంఖ్య లో బాధితులున్నట్లు అధికారులు గణాంకాల గారడీ చేస్తున్నారు. స్కూళ్లలో మాస్కులు లేవు. భౌతిక దూరం అసలే పాటించట్లేదు. ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో కొవిడ్‌-19 నిబంధనలు అటకెక్కించారు. గతనెల 26 నుంచి ఈనెల 12వ తేదీ వరకూ ఇటు డీఈఓ, సమగ్రశిక్ష శాఖల అధికారులు 9 మంది టీచర్లు, సిబ్బంది, 25 మంది విద్యార్థులకు మాత్రమే కరోనా పాజిటివ్‌ వస్తున్నట్లు కాకి లెక్కలు చెబుతున్నా రు. క్షేత్రస్థాయిలో నిత్యం పాజిటివ్‌ బాధితులు బయటపడుతున్నారు. మాస్కులు, శానిటైజేషన్‌, ఇతర కొవిడ్‌ నియంత్రణ చర్యలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాషా్ట్రల్లో ఇప్పటికే స్కూళ్లు బంద్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం మొం డిగా ముందుకెళ్తుండటంపై ఉపాధ్యాయ సం ఘాల నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.


స్కూళ్లలో భారీగా బాధితులు

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో భారీగా విద్యార్థులు, టీచర్లు కొవిడ్‌ బారినపడుతున్నారు. విద్యాశాఖ గణాంకాల మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద 5128 పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో  6,08,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మార్చి మూడో వారంలో కుందుర్పి మండలం నిజవల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతన్న ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. కందుకూరు హైస్కూల్‌లో మార్చి 24వ తేదీన మహిళా టీచర్‌కు కొవిడ్‌ సోకింది. గార్లదిన్నె మండలం కోటంక జడ్పీ హై స్కూల్‌లో మార్చి 28న 10వ తరగతి విద్యార్థికి పాజిటివ్‌ అని తేలింది. గురువారం బుక్కప ట్నం బాలికోన్నత పాఠశాలలో ఆరుగురు పదో తరగవి విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వారిని హోం ఐసోలేషన్‌కు పంపారు.


కేజీబీవీల్లో 2841 మందికి పరీక్షలు

కేజీబీవీల విద్యార్థులకు దారుణమైన పరిస్థితు లు ఎదురవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 62 కేజీబీవీలున్నాయి. కేజీబీవీల్లో గతనెల 26 నుంచి ఈనెల 14వ తేదీ వరకూ 2382 మంది విద్యార్థులకు, 459 మంది సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. కేవలం ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, సిబ్బందికి వైరస్‌ సోకినట్లు స మగ్రశిక్ష ప్రాజెక్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గుడిబండ కేజీబీవీలో ఈనెల 4వ తేదీన 7, 8 తరగతుల విద్యార్థినులు ఇద్దరు, తాడిపత్రిలో ఒకరు, శెట్టూరులో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 14వ తేదీన రొద్దంలో ముగ్గురు ఏడో తరగతి విద్యార్థినులు, పదో తరగతి చదువుతున్న ఒకరు, మరో ఇంటర్‌ మొ దటి ఏడాది విద్యార్థినులకు కరోనా అని తేలింది. విద్యార్థులు స్థానికంగా అక్కడే ఉండటంతో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే.. ఇతర విద్యార్థులపైనా ఆ ప్రభావం పడుతోంది. కేజీబీవీల్లో భారీగా కేసులు వస్తున్నా.. దాచిపెట్టి, పిల్లలను ఇళ్లకు పంపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


మోడల్‌ స్కూళ్లలో పరీక్షలు శూన్యం

జిల్లాలోని మోడల్‌ స్కూళ్లలో దారుణాతిదారుణమైన పరిస్థితులున్నాయి. జిల్లాలో 25 మోడల్‌ స్కూళ్లున్నాయి. గతనెల 28న పామిడి మోడల్‌ స్కూల్‌లో ఓ టీచర్‌కు పాజిటివ్‌ అని తేలింది. రెండ్రోజుల క్రితం మరో టీచర్‌ భర్తకు రావడంతో ఆమె సైతం హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. పుట్టపర్తి మోడల్‌ స్కూల్‌లో మరో టీచర్‌కు గతవారం పాజిటివ్‌ వచ్చింది. 25 మోడల్‌ స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు ఇతర సిబ్బందికి కనీసం పరీక్షలు కూడా చేయడం లేదు. ఎవరికైనా పాజిటివ్‌ అని తేలితే వైద్యశాఖ వర్గాలను వేడుకుంటే తప్పా.. మోడల్‌ స్కూళ్లలో కొవిడ్‌ పరీక్షలు చేయడంలేదు.


పాజిటివ్‌లపై కాకి లెక్కలు..

జిల్లాలో ప్రభుత్వ రంగ స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్ల లో పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులు, టీచర్లు ఇతర సిబ్బంది వివరాలపై కాకిలెక్కలు చెబుతున్నారు. గతనెల 30వ తేదీ నుంచి సెలవులు మినహా ఇతర తేదీల్లో జిల్లా విద్యాశాఖాధికారులు.. ఎంఈఓల నుంచి పాజిటివ్‌ బాధితుల వివరాలు సేకరించారు. ఏప్రిల్‌ 2 (హాలిడే), 4న (ఆదివారం), 5న (హాలిడే), 11న (ఆదివారం), 13, 14 తేదీల్లో హాలిడేస్‌ కారణంగా ఎంఈఓల నుంచి రిపోర్టు తీసుకోలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన తేదీల్లో వారి నుంచి సేకరించిన లెక్కల ప్రకారం 919 మంది టీచర్లకు పరీక్షలు చేయగా.. 7 మందికి, విద్యార్థుల్లో 1334 మందికి పరీక్షలు చేయగా 18 మందికి వచ్చినట్లు చెబుతున్నారు. మండలాల్లోని ఎంఈఓల ఆధారంగా వివరాలు సేకరిస్తే.. ఇందులో కేజీబీవీలు కూడా ఉంటాయి. వాటి పరిధిలోనే 2382 మంది విద్యార్తినులు, 459 మంది సిబ్బందికి పరీక్షలు చేశామని సమగ్రశిక్ష అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కలపై జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రా జెక్టు అధికారులు పొంతనలేని సమాధానం చెబుతున్నారు.


ముందస్తు జాగ్రత్తలేవీ...!

నిబంధనలు, ఆదేశాల అమలు అన్నీ పేపర్లకు పరిమితం చే శారు. రోజురోజుకీ కేసులు పెరుతున్నాయి. ఈ విద్యా సంవత్స రం ప్రారంభమైనపుడు కొవిడ్‌-19 ప్రొటోకల్‌ మేరకు స్కూల్‌ గ్రాంటు నుంచి వాడుకోండి అంటూ ఆదేశాలిచ్చారు. చేతి నుంచి ఖర్చు చేస్తే... భవిష్యత్తులో ఇస్తారట. ఇదీ ప్రభుత్వం వాదన. విద్యార్థులకు మాస్కులు సైతం అందించిన దాఖలాలు లేవు. ఆరంభంలో విద్యార్థికి 2, 3 ఇస్తామన్నారు. ఎక్క డా పూర్తిస్థాయిలో ఇచ్చిన దాఖలాల్లేవు. దీంతో పిల్లలు మా స్కులు సైతం లేకుండా స్కూళ్లకు రావాల్సిన దుస్థితి నెలకొం ది. దీనికితోడు తోడు భౌతికదూరం పాటించకపోవడం, సరిగా శానిటైజేషన్‌ నిర్వహించకపోవడం వల్ల జిల్లాలో భారీగా విద్యార్థులు, టీచర్లు పాజిటివ్‌ బారిన పడుతున్నారు.


ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి

స్కూళ్లలో పెద్దఎత్తున విద్యార్థులు, టీచర్లు  కొవిడ్‌ బారిన పడుతున్నారు. రెసిడెన్షియల్‌ మోడల్‌ స్కూళ్లలో పరిస్థితి మరింత దారుణం గా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, చర్యలు తీసుకోవాలి.

- చంద్రశేఖర్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి


తరచూ పరీక్షలు చేయిస్తున్నాం

మాస్కులు లేకుండా ఎవరినీ పాఠశాలల్లోకి అనుమతించట్లేదు. శానిటైజేషన్‌కూడా తరచూ చేయిస్తున్నాం. జిల్లా వైద్యాధికారితో మాట్లా డాం. రెండు వారాలకు పరీక్షలు చేయిస్తున్నాం. ఎల్లుండి కేజీబీవీ ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించి, మరింత సమర్థవంతంగా కొవిడ్‌-19 నిబంధనలు అమలు చేయడానికి కృషి చేస్తున్నాం.

- తిలక్‌ విద్యాసాగర్‌, ఏపీసీ, సమగ్రశిక్ష





Updated Date - 2021-04-17T06:04:07+05:30 IST