అదుపు తప్పింది!

ABN , First Publish Date - 2020-08-12T08:47:19+05:30 IST

‘కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ అదుపు తప్పింది. ఏపీ ఔటాఫ్‌ కంట్రోల్‌’... ఇది కొవిడ్‌ఇండియా.ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌ వెల్లడించిన విషయం! జాతీయంగా, అంతర్జాతీయంగా కరోనా పరిస్థితులను విశ్లేషించి,

అదుపు తప్పింది!

  • ఏపీలో కరోనా.. ‘ఔటాఫ్‌ కంట్రోల్‌’
  • కొవిడ్‌ఇండియా వెబ్‌సైట్‌ హెచ్చరిక
  • ఐదు వేల కేసులు 15 రోజుల్లోనే
  • ‘రెట్టింపు’ జిల్లాలు దేశంలో 22
  • అందులో 13 మన రాష్ట్రంలోనివే
  • దేశంలో 23 రోజుల్లో రెట్టింపు
  • ఏపీలో 15 రోజుల్లోనే డబుల్‌
  • ఈ నెలాఖరుకు 4 లక్షలు!?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ అదుపు తప్పింది. ఏపీ ఔటాఫ్‌ కంట్రోల్‌’... ఇది కొవిడ్‌ఇండియా.ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌ వెల్లడించిన విషయం! జాతీయంగా, అంతర్జాతీయంగా కరోనా పరిస్థితులను విశ్లేషించి, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న ఈ వెబ్‌సైట్‌... ఏపీలో పరిస్థితులపై  తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ‘ప్రపంచంలోనే అత్యంత  ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ఒకటి’ అని ‘ఇండియా టుడే’ సంస్థ ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయని  ఇప్పుడు కొవిడ్‌ఇండియా వెబ్‌సైట్‌ పేర్కొంది. ఐదు వేలకుపైగా కరోనా కేసులు నమోదైన 15 రోజుల్లోపే కేసులు రెట్టింపవుతున్న జిల్లాలు దేశంలో 22 మాత్రమే ఉన్నాయి. అందులో 9 మినహా అన్నీ మ న రాష్ట్రంలోనివే. అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిస్థితి ‘ఔట్‌ ఆఫ్‌ కం ట్రోల్‌’ అని తేలింది. దేశవ్యాప్తంగా అహ్మద్‌నగర్‌, మైసూర్‌, నాగపూర్‌, కొల్హాపూర్‌, బళ్లారి, కాన్పూర్‌నగర్‌, లఖ్‌నవూ, పట్నా, థానే జిల్లాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. ఏపీలో... అనంతపురం, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాలు 20 వేల కేసుల మార్కును దాటేశాయి.


విశాఖ, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలు కూడా 20వేలకు దగ్గర్లో ఉన్నాయి. 6 జిల్లాల పరిధిలో 7 నుంచి 15 రోజుల వ్యవధిలోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. జాతీయస్థాయిలో 23 రోజుల్లో కేసులు రెట్టింపవుతుండగా.. ఏపీలో 15 రోజుల్లోపే డబుల్‌ అవుతున్నాయని ‘కొవిడ్‌ఇండియా’ వెబ్‌సైట్‌ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే 2లక్షలపైగా కేసులు నమోదయ్యాయని.. ఇలాగే కొనసాగితే, ఈ నెలాఖరు నాటికి మరో 2 లక్షల కేసులు రావొచ్చని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ గ ణాంకాల ప్రకారం యాక్టివ్‌ కేసుల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. కేసుల్లో జాతీయ సగటు 1721 ఉంటే, ఆంధ్రలో అందుకు 3 రెట్లు ఎక్కువగా 4683 కేసులున్నాయి. జాతీయ సగటులో 6,400 కేసులతో ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. ఏపీ ఈనెలాఖరు నాటికి తొలిస్థానానికి రావొచ్చని నిపుణులు అప్రమత్తం చేశారు. నిజానికి రాష్ట్రంలో జూలై మూడోవారం నుంచే పరిస్థితులు అదుపుతప్పాయి. ‘‘మేం దేశంలో అందరికంటే ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం. కాబట్టి ఎక్కువ కేసులు ఉంటున్నాయి’’ అనేవాదన హేతుబద్ధంగా లేదంటున్నారు. 


ఏమిటీ ‘కొవిడ్‌ఇండియా’?: దేశంలో కరోనా తీవ్రత ప్రారంభమైన వెంటనే కేసుల వ్యాప్తిని తెలియజేసేందుకు, కొవిడ్‌కు సంబంధించిన అంతర్జాతీయ సమాచారం అందించేందుకు జాతీయ స్థాయిలో 2 ప్రముఖ వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయి. అందులో ఒకటి కొవిడ్‌ఇండియా.ఓఆర్‌జీ, మరొకటి కొవిడ్‌19ఇండియా.ఓఆర్‌జీ. ఈ సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సమాచారాన్ని అందిస్తూ, విశ్లేషణలు చేస్తూ ఓపెన్‌సోర్సుగా పనిచేస్తున్నా యి. కొవిడ్‌ఇండియా సర్వేలకు ‘నౌకరీ డాట్‌ కామ్‌’ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. పూర్తిగా నిర్ధారించుకున్న సమాచారం ఇవ్వడమే కాదు.. కొవిడ్‌పై పోరాటంలో ప్రత్యక్షంగానూ పాల్గొంటున్నట్లు ‘కొవిడ్‌ఇండియా’ పేర్కొంది.  

Updated Date - 2020-08-12T08:47:19+05:30 IST