నాలుగైదు రోజులు!

ABN , First Publish Date - 2020-04-04T10:01:10+05:30 IST

కరోనా నిర్ధారిత రిపోర్టులు రావడంలో ఆలస్యమవుతోంది. వాటి కోసం నాలుగైదు రోజులు వేచి చూడాల్సి వస్తోంది.

నాలుగైదు రోజులు!

అనంతపురం ల్యాబ్‌ నుంచి ఆలస్యంగా..

జిల్లాలో 450 మందికి పైగా శాంపిల్స్‌ సేకరణ

ఇంకా రావాల్సిన రిపోర్టులు 350..


కర్నూలు, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): కరోనా నిర్ధారిత రిపోర్టులు రావడంలో ఆలస్యమవుతోంది. వాటి కోసం నాలుగైదు రోజులు వేచి చూడాల్సి వస్తోంది. కర్నూలులో వైరాలజీ ల్యాబ్‌ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అనంతపురం, కడప, గుంటూరు జిల్లాకు వైరాలజీ ల్యాబ్‌లను అందించిన ప్రభుత్వం.. కర్నూలు జిల్లాను మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, గద్వాల, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారు. ఇలాంటి చోట వైరాలజీ ల్యాబ్‌ లేక అనంతపురానికి క్వారంటైన్లో ఉన్న వారి నమూనాలను పంపి రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. గత వారం వరకు జీరోగా ఉన్న పాజిటివ్‌ కేసులు నాలుగు రోజుల క్రితం తొలి కేసు నమోదు కాగా.. మరో మూడు ప్రిజెంప్టివ్‌ పాజిటివ్‌లు వచ్చాయని కలెక్టర్‌ వీరపాండియన్‌ రెండ్రోజుల క్రితం ప్రకటించారు.


జిల్లాలోని 16 క్వారంటైన్‌ సెంటర్లలో అడ్మిట్‌ అయిన, కాంటాక్ట్‌ ఉన్న 450 మంది నుంచి నమూనాలను సేకరించిన  వైద్యులు.. ఇప్పటికే అనంతపురంలోని వైరాలజీ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపారు. ఇందులో 350 పైగా రిపోర్టులు అందాల్సి ఉంది. ఏడాది క్రితమే కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. రూ.50 లక్షలతో ప్రతిపాదనలు పంపిన జిల్లా యంత్రాంగం.. పరికరాలు అందుబాటులో లేవని, అవి వస్తే వెంటనే ల్యాబ్‌ ఏర్పాట్లు మొదలుపెట్టొచ్చని చెబుతోంది. అయితే జిల్లాకు అందుబాటులో లేని పరికరాలు.. కడప, గుంటూరు జిల్లాలకు ఎలా ఇచ్చారన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. 


ఇలా జరిగింది.. 

కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఇటీవలే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతని నుంచి నమూనాలను సేకరించిన వైద్యులు తొలుత పరీక్షల నిమిత్తం అనంతపురానికి పంపారు. కొద్దిపాటి ఆలస్యంతో నివేదికలు రాగా.. మరో నిర్ధారణ మంచిదని చిత్తూరులోని ల్యాబ్‌కూ నమూనాలు పంపారు. అక్కడ కూడా పాజిటివ్‌ అని వచ్చిన రెండో రోజున ఆ కేసు వివరాలను అధికారికంగా ప్రకటించారు. బనగానపల్లె, అవుకు, కర్నూల్లోని రోజా వీధి నుంచి క్వారంటైన్‌కు తరలించిన వ్యక్తులకు పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు. దీంతో ఆ ముగ్గురినీ ప్రిజెంప్టివ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. ఇలా 4-5 కేసుల్లోనే ఇంత తాత్సారం జరుగుతుండగా వందలాది పెండింగ్‌ రిపోర్టులపై ఎప్పటికి స్పష్టత వస్తుందో తెలియని పరిస్థితి.


అనంతపురం నుంచి రిపోర్టులు సకాలంలో రావడంలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి నమూనాలు సేకరించిన నాలుగు రోజులకు గానీ ఒక వ్యక్తి రిపోర్టును ప్రకటించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఢిల్లీ కాంటాక్ట్‌ లిస్టింగ్‌ వ్యక్తుల రిపోర్టులు ఇదే తరహాలో ఆలస్యంగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న జిల్లాలో వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటుచేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. పీసీఆర్‌ మిషన్‌ యంత్రంతో పాటు పరీక్షల కిట్లు, టెక్నీషియన్లు, ఒక ప్రత్యేక మెడికల్‌ ఆఫీసర్‌ ఈ కరోనా ల్యాబ్‌కు కావాలి. ఇందుకోసం రూ.50 లక్షలతో ప్రతిపాదనలు పంపినా నేటికీ దిక్కులేదు. పీసీఆర్‌ లేని అందుబాటులో లేక పోవడం వల్లే ల్యాబ్‌ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. 


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

అనంతపురం జిల్లాలో కరోనా పరీక్షల నిమిత్తం కరోనా ల్యాబ్‌ను ఇటీవలే ఏర్పాటుచేశారు. కర్నూలు జిల్లా నుంచి వెళ్లే నమూనాలు అక్కడే పరీక్షిస్తున్నారు. అయితే రెండు జిల్లాలతో పాటు ఒక్కోసారి ఒంగోలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నమూనాలకూ అక్కడే పరీక్షలు చేస్తుండడంతో రిపోర్టులు ఆలస్యం అవుతున్నాయి. ఒక్కో పరీక్షకు 4 గంటల సమయం పడుతుంది. దీంతో అనంతపురంలో రోజుకు 60 పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. దీంతో కర్నూలు, అనంతపురం కలిపి రోజుకు 60 నమూనాలను మాత్రమే చేస్తుండగా అనంతపురంలో 55ు, కర్నూలు జిల్లా నమూనాలు 45ు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు త్వరగా పూర్తి చేయించడంలో భాగంగా ఏఆర్‌ఎమ్‌వో(అసిస్టెంట్‌ రెసిడిన్షియల్‌ మెడికల్‌ ఆఫీసర్‌)ను అనంతపురంలోని ల్యాబ్‌కు కర్నూలు జిల్లా నుంచి ప్రతినిధిగా శుక్రవారం పంపారు. 

Updated Date - 2020-04-04T10:01:10+05:30 IST