Abn logo
Apr 17 2021 @ 13:52PM

గాలి ద్వారా కరోనా

వ్యాప్తిపై బలమైన, స్థిరమైన ఆధారాలున్నాయి

లక్షణాలు లేనివారి వల్లే ఎక్కువ వ్యాప్తి

డ్రాప్‌లెట్స్‌ కంటే సూక్ష్మతుంపర్లలోనే అధిక వైరస్‌

బహిరంగ ప్రదేశాల్లో కంటే ఇండోర్స్‌లోనే వైరస్‌ ముప్పు ఎక్కువ

గాలిలో 3 గంటల పాటు ఉంటున్న వైరస్‌

పది ఆధారాలతో వెల్లడించిన నిపుణులు

లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక


కొలరాడో, ఏప్రిల్‌ 16: కరోనా.. గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి బలమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం అధ్యయనంలో వెల్లడైంది. ఇది డ్రాప్‌లెట్‌ వైరస్‌.. అంటే వైరస్‌ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుం పర్లు దగ్గర్లో ఉన్న వస్తువులపై పడి, వాటి ద్వారా ఇతరలకు సోకే వైరస్‌ అని పలువురు శాస్త్రజ్ఞులు తొలి నుంచీ చెబుతున్నారు. అయితే.. ఇది ఎయిర్‌బోర్న్‌ వైరస్‌ (అంటే గాలి ద్వారా వ్యాపించేది) అని గత ఏడాది జూలైలో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన 200 మంది శాస్త్రజ్ఞులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న డబ్ల్యూహెచ్‌వో.. గాలి ద్వారా ‘కూడా’ ఈ వైరస్‌ వ్యాపిస్తుందని, అయితే నిర్ణీత పరిస్థితుల్లో మాత్రమే అలా జరగుతుందని తర్వాత ఒక ప్రకటనలో తెలిపింది. మన హైదరాబాద్‌లోని సీసీఎంబీ కూడా ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి ఆధారాలున్నట్టు గతంలో వెల్లడించింది. వీటన్నింటికీ బలం చేకూర్చేలా అమెరికా, కెనడా, యూకే దేశాలకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయన ఫలితం ప్రముఖ వైద్య జర్నల్‌ లాన్సెట్‌లో తాజాగా ప్రచురితమైంది. కరోనా వైర్‌సపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాలను పరిశీలించి, విశ్లేషించి.. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి పది బలమైన ఆధారాలను ప్రతిపాదించారు. అవేంటంటే..


గత ఏడాది అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో 122 మంది ఉన్న గాయక బృందంలో.. వైరస్‌ సోకిన ఒక వ్యక్తి వల్ల 53 మంది ఒకేసారి కరోనా బారి న పడ్డారు. వైరస్‌ సోకిన వ్యక్తిని తాకకుండా, సన్నిహితంగా మెలగకుండా నే వారందరికీ సోకింది. దీనికి కారణం వైరస్‌ గాలి ద్వారా వ్యాపించడమే.

పక్క పక్క గదుల్లో ఉండి, ఒకరి సమక్షంలో మరొకరు రాని సందర్భాల్లో కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి జరిగింది. దీన్ని దీర్ఘ శ్రేణి వ్యాప్తి అంటారు. క్వారంటైన్‌ హోటళ్లలో ఇలా జరగడాన్ని గమనించారు.

లక్షణాలు అసలే కనిపించనివారు. వైరస్‌ సోకినాక.. లక్షణాలు కనిపించడానికి ముందు దశలో ఉన్నవారి ద్వారా వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ఇలా దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు లేనివారివల్ల వైరస్‌ వ్యాపించే అవకాశం 33ు నుంచి 59ు దాకా ఉంటోంది. వైరస్‌ ప్రపంచం మొత్తానికీ పాకడానికి ప్రధాన కారణం ఇదే. ఎలాంటి లక్షణాలూ లేకపోవడంతో వారుగానీ, వారికి దగ్గరుండేవారుగానీ జాగ్రత్తలు తీసుకోరు. కానీ.. వారు మాట్లాడేటప్పుడు వారి నోటి నుంచి వేలాది సూక్ష్మ తుంపర్లు వెలువడతాయి. అవి మరింత మంది వైరస్‌ బారిన పడడానికి కారణమవుతాయి. 

కరోనా వైరస్‌ బహిరంగ ప్రదేశాల్లో వ్యాపించే వేగం కన్నా.. ఇండోర్‌లో (అంటే ఇల్లు, ఆఫీసులు వంటి ప్రదేశాలు) వ్యాపించే వేగం ఎక్కువగా ఉం ది. అదే గాలి, వెలుతురు వచ్చే ఇళ్లల్లో వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గుతోంది. కరోనా గాలిద్వారా వ్యాపించే వైరస్‌ అనడానికి ఇది ప్రబల ఆధారం.

కొవిడ్‌ కేంద్రాల్లో పనిచేసేవారు నాసోకోమియల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డారు. నాసోకోమియల్‌ ఇన్ఫెక్షన్లంటే.. ఆస్పత్రుల్లో సోకే ఇన్ఫెక్షన్లు. వైరస్‌ బారిన పడినవారిని తాకకుండా, వారి నోరు, ముక్కు నుంచి వెలువడే తుంపర్లు శరీరానికి అంటకుండా, పీపీఈలు ధరించి పనిచేసే వైద్య, ఆరోగ్య సిబ్బందికి వైరస్‌ సోకిందంటే.. కారణం వైరస్‌ గాలి ద్వారా వ్యాపించేది కావడమే.

ఇతరులకు ఇన్ఫెక్షన్‌ కలిగించే సార్స్‌-కొవ్‌-2(కరోనా) వైర్‌సను శాస్త్రజ్ఞులు కొవిడ్‌ పేషెంట్లు ఉన్న గదుల్లోని గాలిలో గుర్తించారు. అలాగే... ఇన్ఫెక్ట్‌ అయిన వ్యక్తుల కార్లలో సేకరించిన గాలి నమూనాల్లోనూ గుర్తించారు. ఇన్ఫెక్షన్‌ కలిగించే స్థాయి వైరస్‌ గాలిలో 3 గంటలు ఉందని వారి ప్రయోగాల్లో తేలింది. అలాగే సగం జీవంతో వైరస్‌ గాలిలో మరో గంటా పదినిమిషాలు ఉంటున్నట్టు గుర్తించారు. గాలి ద్వారా వ్యాప్తి చెందే వైర్‌సలను పట్టుకోవడం కష్టం. ఉదాహరణకు.. తట్టు, క్షయ కారక వైర్‌సలు గాలి ద్వారా వ్యాపిస్తాయి. వాటిని ఇంతవరకూ గది వాతావరణంలోని గాలినుంచి సేకరించలేకపోయారు.

సార్స్‌-కొవ్‌-2 వైర్‌సను కొవిడ్‌ పేషెంట్లున్న ఆస్పత్రుల్లోని ఎయిర్‌ఫిల్టర్లలో, పైపుల్లో గుర్తించారు. ఏరోసాల్స్‌(సూక్ష్మ తుంపర్ల) ద్వారా మాత్రమే అవి అక్కడికి చేరే అవకాశం ఉంది.

జంతు ప్రదర్శనశాలల్ల్లో వైరస్‌ బారిన పడిన జంతువులు, పడని జంతువులను వేర్వేరు బోన్లలో ఉంచారు. అయినా వైరస్‌ వ్యాపించింది. ఆ బోన్లను కలిపే ఎయిర్‌ డక్ట్‌ ద్వారా వ్యాపించడమే ఇందుకు కారణం. వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తోందని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం.

కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందనే ప్రతిపాదనను తిరస్కరించే బలమైన, స్థిరమైన ఆధారమేదీ ఇంతవరకూ లేదు. ఇన్ఫెక్షన్‌ సోకినవారితో ఇండోర్‌లో ఉన్నా.. కొందరికి వైరస్‌ సోకకపోవడానికి కారణం వారు ఉన్న చోట గాలి, వెలుతురు బాగా ఎక్కువగా ఉండడమే. తట్టుతో పోలిస్తే కరోనా ఆర్‌నాట్‌ (రీప్రొడక్షన్‌ నంబర్‌- అంటే వైరస్‌ బారిన పడిన ఒకరి నుంచి ఎంత మందికి వ్యాపించే అవకాశం ఉందో తెలిపే సంఖ్య) చాలా తక్కువనే వాదన ఉంది. తట్టు బారిన పడిన ఒక వ్యక్తి నుంచి 15 మందికి వ్యాపించే అవకాశం ఉంది. అంటే ఆర్‌15. కరోనా విషయంలో ఆ సంఖ్య 2.5 లోపే ఉంది కాబట్టి ఇది గాలి ద్వారా వ్యాపించదన్నది అలా వాదించే వారి ఉద్దేశం. అయితే.. కరోనా విషయంలో అతి కొద్దిమందిలో మాత్రమే వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉంటోంది. అందుకే ఆర్‌నాట్‌ తక్కువగా ఉంటోంది.

డ్రాప్‌లెట్స్‌ (నోరు, ముక్కు నుండి వెలువడే పెద్ద తుంపర్లు) ద్వారా, వైరస్‌ సోకినవారు వాడిన వస్తువులు, దుస్తులు, పాత్రల ద్వారా వైరస్‌ సోకుతుందనడానికి పరిమితమైన ఆధారాలు మాత్రమే ఉన్నాయి. గతంలో క్షయ, తట్టు విషయంలో కూడా.. అవి డ్రాప్‌లెట్‌ వైర్‌సలనే వాదనే చేశారు. కానీ, చివరికి వాటిని గాలి ద్వారా వ్యాపించే వైర్‌సలుగా గుర్తించారు. వాస్తవానికి రోగకారక వైర్‌సలు పెద్ద తుంపర్ల(డ్రాప్‌లెట్స్‌)తో పోలిస్తే సూక్ష్మతుంపర్ల(ఏరోసాల్స్‌)లోనే ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

..ఈ కారణాల నేపథ్యంలో కరోనాను గాలి ద్వారా వ్యాపించే వైర్‌సగా భావిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. డ్రాప్‌లెట్స్‌, వైరస్‌ సోకినవారు వాడిన వస్తువులను వాడడం వంటివాటి ద్వారా కూడా వైరస్‌ వ్యాపిసున్నా, గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు విశ్లేషించారు. కాబట్టి.. ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు దీనికి తగినట్టుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కరోనాను డ్రాప్‌లెట్‌ వైర్‌సగా భావించి, దాన్ని అడ్డుకోవడానికి తగినట్టుగా జారీ చేసిన మార్గదర్శకాలనే పాటిస్తూ వస్తున్నాం. గాలి ద్వారా వ్యాపించే వైర్‌సల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..


వైరస్‌ ఏదైనా సరే.. అది సోకినవారికి సన్నిహితంగా మెలగకూడదు.

గాలి, వెలుతురు బాగా వచ్చేలా తలుపులు, కిటికీలను తెరిచిపెట్టాలి.

వైరస్‌ బారిన పడినవారు ఇంట్లోనే ఉండాలి. గాలి, వెలుతురు ఎక్కువగా వచ్చే గదుల్లో ఉండాలి. బయటకు వెళ్లకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో గదిలోంచి బయటకు రావాల్సి వస్తే మాస్క్‌ ధరించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు మూతిని, ము క్కును ఏదైన వస్త్రంతో/టిష్యూతో మూసుకోవాలి. లేకుం టే మోచేతిని మడిచి ఆ ప్రాంతంలో తుమ్మాలి. మీరు చేతిని అడ్డుపెట్టుకుని తుమ్మినా, దగ్గినా, ఆ వైరస్‌ చేతిపైకి వచ్చి ఇతరులకు సోకే ప్రమాదముంది. ఒకవేళ అలా తుమ్మినా, దగ్గినా  చేతులను 20 సెకన్లపాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

వైరస్‌ బారిన పడినవారు ఇంట్లో ఉంటే.. మిగతావారు నాణ్యమైన మాస్కులు ధరించాలి.

ఆస్పత్రుల్లో సిబ్బంది విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి.

వెంటిలేషన్‌ తక్కువ ఉండే ఇల్లు, కార్యాలయం వంటి చోట్ల ఎక్కువ మంది ఉండకూడదు.

ఇండోర్‌లో ఎక్కువసేపు ఉండకూడదు.