ఉపాధి ఉఫ్‌..

ABN , First Publish Date - 2020-04-08T07:53:06+05:30 IST

ఉపాధి ఉఫ్‌..

ఉపాధి ఉఫ్‌..

125 కోట్ల మంది కార్మికులకు ముప్పు

భారత్‌లో 40 కోట్ల మంది  మరింత పేదరికంలోకి..  

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభం  

కరోనా కష్టాలపై ఐఎల్‌ఓ నివేదిక


న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల మంది కార్మికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభమని పేర్కొంది. కరోనా కాటుకు భారత్‌లోని అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే 40 కోట్ల మంది కార్మికులు మరింత పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని ఐఎల్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ తదితర కఠిన చర్యలు వారి ఉద్యోగాలు, ఆర్జనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తాజా నివేదికలో పేర్కొంది. అంతేకాదు, వారు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతున్నారని అంటోంది. రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు.. 


ఈ ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రపంచవ్యాప్తంగా 6.7 శాతం పని గంటలు తుడిచిపెట్టుకుపోవచ్చు. ఇది 19.5 కోట్ల ఫుల్‌టైం కార్మికులు చేసే పనికి సమానం. 


పని గంటల తరుగుదల అరబ్‌ దేశాల్లో (8.1 శాతం లేదా 50 లక్షల ఫుల్‌టైం జాబ్స్‌) అత్యధికంగా నమోదు కావచ్చు. యూర్‌పలో 7.8 శాతం లేదా 1.2 కోట్ల ఫుల్‌టైం జాబ్స్‌, ఆసియా, ఆసియా పసిఫిక్‌లో 7.2 శాతం లేదా 12.5 కోట్ల ఫుల్‌ టైం జాబ్స్‌గా నమోదు కావచ్చు. 


ఆయా ఆదాయ వర్గాల వారు భారీ నష్టపోవచ్చు. ఎగువ మధ్య తరగతి వారు అత్యధికంగా 7 శాతం మేర నష్టపోవచ్చు. ఇది 2008-09 ఆర్థిక సంక్షోభ ప్రభావం కంటే అధికం. 


హోటళ్లు, ఆహార సేవలు, వస్తు తయారీ, రిటైల్‌, బిజినెస్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రంగాలు అధికంగా ప్రభావితం కానున్నాయి. 


ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్త నిరుద్యోగులను తొలుత 2.5 కోట్లుగా అంచనా వేశాం.కరోనా సంక్షోభం నేపథ్యంలో సంఖ్య అంతకంటే ఎక్కువగానే నమోదు కావచ్చు. 


5 కోట్ల కొలువులు హాంఫట్‌

 కరోనా (కోవిడ్‌-19) మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌తో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ‘ఉజ్జాయింపుగా చూసినా, లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తొలి రెండు వారాల్లోనే 5 కోట్ల ఉద్యోగాలు పోయి ఉంటాయి’ అని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన గణాంకవేత్త ప్రణబ్‌ సేన్‌ చెప్పారు. జనవరిలో 7.16 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు మార్చి 15 నాటికి 23.4 శాతానికి చేరిందని సీఎంఐఈ అనే సంస్థ తెలిపింది. దేశంలో నిరుద్యోగ రేటు గత 43 నెలల్లో ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. 

Updated Date - 2020-04-08T07:53:06+05:30 IST