12 కరోనా స్పాట్‌లు..!

ABN , First Publish Date - 2020-04-09T21:16:39+05:30 IST

మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నా, వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

12 కరోనా స్పాట్‌లు..!

89 కేసులు అక్కడే..

కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తింపు

ఇక నుంచి పకడ్బందీ నిబంధనలు

రాకపోకలపై నిఘా.. ఇంటింటి సర్వే

అనుమానితులు ప్రభుత్వ క్వారంటైన్‌లకు..

మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారి నుంచి మరికొందరికి...

కుటుంబ సభ్యులతోపాటు ఇతరులకు కూడా..


హైదరాబాద్‌ సిటీ: మహానగరంలో  కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నా,  వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పాజిటివ్‌ కేసుల కుటుంబీకులే కాదు, వారిని కలిసిన వారి ఫ్యామిలీలకూ వైరస్‌ విస్తరిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరంలో వైరస్‌ వ్యాప్తి  చెందకుండా చర్యలు చేపడుతున్నా, క్రమేణా కేసులు అధికమవుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాంతాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 12 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించారు.


అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో 160కిపైగా (7వ తేదీ నాటికి) కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 89 కేసులు ఆ ఏరియాల్లోనే ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లుగా గుర్తించిన అధికారులు పకడ్బందీ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. అక్కడ లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేయనున్నారు. ఆ ఏరియాల ప్రజలు బయటకు రాకుండా, ఇతర ప్రాంతాల ప్రజలు అక్కడికి వెళ్లకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. 


ఏం చేస్తారు...?

ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనల అనంతరం నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో నాలుగో వంతు హైదరాబాద్‌లో ఉన్నాయి. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నగరంలో వేల సంఖ్యలో బస్తీలు, కాలనీలున్నాయి. కేసుల తీవ్రత మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. ఐదు, అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన 12 ప్రాంతాలను ఈ క్రమంలో గుర్తించారు. ఆ ఏరియాలతోపాటు పరిసర ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తికి అవకాశమున్న నేపథ్యంలో కట్టడి తీవ్రతరం చేయాలని భావిస్తున్నారు.


ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటుచేసి రాకపోకలను నియంత్రిస్తారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు పౌరులకు అనుమతి ఇవ్వరు. ప్రస్తుతం నగరంలో లాక్‌డౌన్‌ అమలవుతున్నా, చాలా చోట్ల వాహనాల రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో కఠినంగా వ్యవహరించిన పోలీసులు ప్రస్తుతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాల్లో మాత్రం నిబంధనలు కచ్చితంగా అమలు చేయనున్నారు.


కర్ఫ్యూ తరహా వాతావరణం ఉంటుందని ఓ అధికారి చెప్పారు. దాదాపు కిలోమీటర్‌ మేర ఉన్న ఇళ్లను జీహెచ్‌ఎంసీ, వైద్య, పోలీస్‌, రెవెన్యూ విభాగాల ఉద్యోగులతో  కూడిన బృందాలు నిత్యం సందర్శిస్తాయి. అనుమానితులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి పరీక్షలు నిర్వహిస్తారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి శానిటైజేషన్‌, క్రిమి సంహారక మందుల పిచికారి విస్తృతంగా చేపడతారు. నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, సైబారాబాద్‌ పోలీస్‌ అధికారులతో చర్చించిన అనంతరం 12 ప్రాంతాలను గుర్తించామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ తెలిపారు. 


మర్కజ్‌ నుంచి మరికొంత మందికి....

మర్కజ్‌ కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్లి వచ్చిన 593 మందికి పరీక్షలు నిర్వహించగా, 63 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు తేలిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ తెలిపారు. వారి ద్వారా 45 మందికి వైరస్‌ వ్యాప్తి(కాంటాక్ట్‌ కేసులు) జరిగిందని చెప్పారు. వారిలో  మెజార్టీ వారి కుటుంబ సభ్యులుండగా, కొందరు బయటి వ్యక్తులూ ఉన్నారని సమాచారం.


ప్రార్థనలు, ఇతరత్రా పనుల నిమిత్తం బయటకు వెళ్లిన క్రమంలో మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిని కలిసిన కొందరికి కరోనా సోకిందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. మర్కజ్‌కు వెళ్లిన, వారితో సన్నిహితంగా మెలిగిన వారిలో కొందరి నివేదికలు రావాల్సి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే మర్కజ్‌కు వెళ్లిన వారు 603 మంది ఉండగా, గ్రేటర్‌ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనూ కొందరు ఉన్నారు. వారిలో మెజార్టీ వ్యక్తులను గుర్తించిన అధికారులు క్వారంటైన్‌ చేశారు. వారందరికీ పరీక్షలు పూర్తయితే కానీ, ఎంత మందికి వైరస్‌ సోకింది..? వారి ద్వారా ఎవరికి వ్యాప్తి చెందింది..?


అన్నది తేలే అవకాశం లేదు. ఇప్పటి వరకు కాంటాక్ట్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయని అధికారులు చెబుతుండగా.. సమూహ వ్యాప్తి జరిగిందా..? లేదా..? అన్న దానిపై అన్ని నివేదికలు వస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. నగరంలో నమోదవుతోన్న కొన్ని కేసులకు సంబంధించి వైరస్‌ వారికి ఎలా సోకిందన్న దానిపై కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా ఏ దశ వ్యాప్తిలో ఉందన్నది ఈ వారంలో తేలుతుందని ఓ అధికారి చెప్పారు. 


ఇవీ ఆ ప్రాంతాలు...

చందానగర్‌

మయూరినగర్‌ (చందానగర్‌) 

రాంగోపాల్‌పేట

షేక్‌పేట 

రెడ్‌హిల్స్‌ 

సంతోష్‌నగర్ (మలక్‌పేట)

చాంద్రాయణగుట్ట

అల్వాల్‌ 

మూసాపేట

కూకట్‌పల్లి 

గాజుల రామారం (కుత్బుల్లాపూర్‌)

యూసు్‌ఫగూడ

Updated Date - 2020-04-09T21:16:39+05:30 IST