Abn logo
May 15 2021 @ 13:03PM

8 గంటలు పీపీఈ కిట్లలోనే పనిచేస్తే వారికిచ్చే గౌరవం ఇదేనా..!?

  • సేవకు ప్రతిఫలం చీత్కారం.. 
  • చిన్నచూపునకు గురవుతున్న పేషెంట్‌ కేర్‌ సిబ్బంది
  • కరోనా రోగులకు వారి సేవలు వెలకట్టలేనివి
  • 8 గంటలు పీపీఈ కిట్లలోనే
  • వారికి వేతనాలు, సౌకర్యాలు అంతంతమాత్రమే

కరోనా.. ఆ పేరు వింటేనే హడిలిపోతున్న ఈ రోజుల్లో వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులకు అక్కడి సిబ్బంది అందించే సేవలు వెలకట్టలేనివి. ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న సమయంలో కొందరు బెడ్స్‌పైనే వాంతులు చేసుకుంటారు. కదలలేని స్థితిలో ఉన్నవాళ్లు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేస్తుంటారు. అటువంటి సమయంలో వారికి సేవలు చేసేందుకు అయిన వాళ్లే జంకుతుంటారు. కానీ, ఐసోలేషన్‌, ఐసీయూ వార్డుల్లో విధులు నిర్వహించే శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ సిబ్బంది వారికి ధైర్యంగా సపర్యలు చేస్తుంటారు. నిత్యం 8 గంటల పాటు పీపీఈ కిట్‌లలోనే ఉండి రోగులను తల్లిదండ్రులుగా సాకుతుంటారు. అలాంటి వారికి సమాజంలో అందుతున్న గౌరవం చీదరింపులు, చీత్కారాలు.


హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : రోజూ వందల మంది కొవిడ్‌ రోగులకు సేవలందిస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌ సిబ్బందికి సమాజంలో దక్కే గౌరవం అంతంత మాత్రమే. లాక్‌డౌన్‌ కాలంలో రవాణా సదుపాయాలు లేకపోయినా నానా అవస్థలు పడుతూ ఆస్పత్రికి వచ్చి సేవలందిస్తున్నారు. ఎనిమిది గంటల పాటు పీపీఈ కిట్‌ ధరించి ఉండడం చిన్న విషయం కాదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విధులు నిర్వహిస్తూ, రవాణా సౌకర్యం లేకపోతే నాగోల్‌, ఎల్బీనగర్‌, జియాగూడ, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల వరకు కాలిబాటనే వెళ్తున్నారు. ఇంటికి వెళ్లిన వాళ్లు, ఏదైనా పని నిమిత్తం బయట తిరిగితే అందరూ వాళ్లను వ్యాధిగ్రస్తులుగా చూస్తున్నారు. కొందరైతే కొవిడ్‌ రోగుల వద్ద పనిచేసే మీరు.. ఆ రోగాన్ని మాకూ అంటిస్తారా.. అంటూ వారిపై మండిపడుతున్నారు. దీంతో పేషెంట్‌ కేర్‌ సిబ్బంది కన్నీరు పెట్టుకుంటున్నారు.

ఖాళీ కడుపుతోనే ఇంటికి.. 

కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో గైనిక్‌, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో పని చేసిన సిబ్బంది ప్రస్తుతం ఐసోలేషన్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం తమతో పాటు ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్నే రెండు పూటలా సరిపెట్టుకొని సాయంత్రానికి ఖాళీ కడుపుతో ఇంటికి చేరుతున్నారు. ఆస్పత్రి డైట్‌ సెక్షన్‌ నుంచి రోగులకు, వైద్యులకు భోజనం అందిస్తున్నారు. సిబ్బందికి మాత్రం కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. 350 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రిలో పేషెంట్‌, శానిటేషన్‌, సెక్యూరిటీ విభాగాలతో కలిపి దాదాపు 110 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. గాంధీ, టిమ్స్‌, ఉస్మానియా, నిలోఫర్‌, ఈఎన్‌టీ, మెటర్నిటీ, ఎంఎన్‌జే ఇలా అన్ని ఆస్పత్రుల్లో దాదాపు వేల మంది ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఐసోలేషన్‌, ఐసీయూ, జనరల్‌ వార్డుల్లోని కొవిడ్‌ రోగులను షిఫ్ట్‌ చేయడం, ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులోకి తేవడం, అంబులెన్స్‌లో వచ్చిన రోగులను వెంటనే వార్డుల్లోకి చేర్చడం, అనునిత్యం వార్డులను పరిశుభ్రంగా ఉంచడం వంటి సేవలను వీరు అందిస్తున్నారు.


కన్న తల్లిని గుర్తు చేసేలా..

ఐసోలేషన్‌, ఐసీయూ వార్డుల్లో చికిత్సలు పొంతున్న కొవిడ్‌ రోగులకు అక్కడి మహిళా సిబ్బందే తల్లి, తండ్రి. యుక్త వయసు వారి నుంచి వృద్ధుల వరకు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న రోగులు బెడ్స్‌పై వాంతులు, విరోచనాలు చేసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌  సిబ్బందే వారిని శుభ్రపరుస్తారు. కరోనా కాలంలో అనేక సేవలందిస్తున్న వారికి కనీస గౌరవం దక్కడం లేదు. వేతనం కూడా నెలకు రూ. 8,400 మాత్రమే. కనీసం ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం ఇన్సెంటివ్స్‌ కూడా రావడం లేదు. తమ పట్ల ఉన్నతాధికారులు, ప్రభుత్వం కాస్త దయ చూపాలని వేడుకుంటున్నారు.

అంటు వ్యాధి సోకినట్లు చూస్తున్నారు..

ఐదేళ్లుగా కింగ్‌కోఠిలో విధులు నిర్వహిస్తున్నాను. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. కరోనా మొదలైన నాటి నుంచి ప్రతి ఒక్కరూ మమ్మల్ని అంటు వ్యాధి సోకినట్లు చూస్తున్నారు. ఈ నెల 12న లాక్‌డౌన్‌ కారణంగా బస్సు లేకపోవడంతో మధ్యాహ్నం 2 నుంచి కింగ్‌కోఠి ఆస్పత్రి ప్రధాన రోడ్డు మొదలు కొని నాగోల్‌ వరకు కనిపించిన ప్రతి ఒక్కరినీ లిఫ్ట్‌ అడిగాను. కింగ్‌కోఠిలో పనిచేస్తున్నట్లు తెలియడంతో ఏ ఒక్కరూ వాహనం ఎక్కించుకోలేదు. పేషెంట్లకు ఇంతలా సేవలందిస్తున్న మమ్మల్ని మనుషులుగా కూడా చూడడం లేదు. - సైదమ్య (కింగ్‌కోఠి పారిశుధ్య కార్మికురాలు)

ఆ భోజనంతోనే రెండు పూటలా.. 

కింగ్‌కోఠి ఐసోలేషన్‌ వార్డుల్లో 8 గంటల పాటు పీపీఈ కిట్‌ వేసుకొని డ్యూటీ చేయాలి. ఉదయం ఇంటి నుంచి తెచ్చుకున్న సద్ది(భోజనం)తోనే రెండు పూటలు కడుపు నింపుకోవాలి. మా సార్‌ వాళ్లు మాత్రమే మంచి నీళ్లు అందజేస్తున్నారు. ఆస్పత్రిలో తినమని అడిగే వారే ఉండరు. భోజనం చేసేందుకు పీపీఈ కిట్లు తీసినప్పుడు ఒంటిపై ఉన్న దుస్తులు తడిసి ముద్దయి ఉంటాయి. అయినప్పటికీ ఇటువంటి సమయంలో రోగులకు సేవలందిస్తున్నామనే సంతోషం ఉంది. - జ్యోతి, పురానాపూల్‌.

Advertisement