జూలైలో జూలు విదిల్చింది..

ABN , First Publish Date - 2020-08-01T07:32:01+05:30 IST

రాష్ట్రంలో జూలై నెలలో కరోనా విజృంభించింది. 30 రోజుల్లోనే ఏకంగా 46 వేల కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 1,533 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 259 మంది చనిపోయారు. అంటే రోజుకు సగటున 8 మంది మృతి చెందారు.(జూలై 25వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ కరోనా

జూలైలో జూలు విదిల్చింది..

హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జూలై నెలలో కరోనా విజృంభించింది. 30 రోజుల్లోనే ఏకంగా 46 వేల కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 1,533 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 259 మంది చనిపోయారు. అంటే రోజుకు సగటున 8 మంది మృతి చెందారు.(జూలై 25వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్‌ విడుదల చేయలేదు). రాష్ట్రంలో జూన్‌, జూలై నెలల్లోనే 59,641 కేసులు రావడం గమనార్హం. తాజాగా రాష్ట్రంలో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల మధ్య 1,986 మంది వైరస్‌ బారినపడ్డారు. జూలై 8వ తేదీన 1,924 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 62,703కు చేరాయి. మరో 14 మంది మృతితో మరణాలు 519 అయ్యాయి. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 586, మేడ్చల్‌లో 207, రంగారెడ్డిలో 205, వరంగల్‌ అర్బన్‌ లో 123, కరీంనగర్‌లో 116, సంగారెడ్డిలో 108 పాజిటివ్‌లు వచ్చాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో జూలై నెలలో 26,082 మందికి కరోనా సోకింది. కాగా, రాష్ట్రంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో 21,380 టెస్టులు నిర్వహించారు. వీటితో పరీక్షల సంఖ్య 4,37,582కు చేరింది. వైరస్‌ నుంచి మరో 816 మంది కోలుకున్నారు.  


అల్వాల్‌ టీఎ్‌సఎ్‌సపీలో 30 మందికి కరోనా

హైదరాబాద్‌ అల్వాల్‌లోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పటాలం (టీఎ్‌సఎ్‌సపీ)కు చెందిన 30 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చింది. ఈ ప్రత్యేక దళం సిబ్బంది ముఖ్యమంత్రి భద్రతతో పాటు పలుచోట్ల బందోబస్తులో పాల్గొంటుంటారు. అల్వాల్‌ స్టేషన్‌ సమీపాన ఉన్న ప్రత్యేక క్వార్టర్స్‌లో ఈ పటాలం సిబ్బంది ఉంటారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి తహసీల్దార్‌ కరోనా బారినపడ్డారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి ఎక్సైజ్‌ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చింది. మరోవైపు జనగామ సబ్‌ జైలులో నలుగురు రిమాండ్‌ ఖైదీలకు కరోనా నిర్ధారన అయింది.


బ్లాక్‌లో కరోనా పరీక్ష టోకెన్లు

సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఇచ్చే టోకెన్లను కొందరు కిందిస్థాయి సిబ్బంది బ్లాక్‌ చేసి అమ్ముకుంటున్నారు. ఆస్పత్రిలో రోజుకు సుమారు 300 శాంపిళ్లు తీసుకుంటున్నారు. ఉదయం 5 గంటల నుంచే అనుమానిత లక్షణాలు ఉన్నవారు క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. సెక్యూరిటీ విభాగానికి చెందిన కిందిస్థాయి సిబ్బంది 50 టోకెన్లు ఇచ్చి చేతులెత్తేస్తున్నారు. మిగిలిన వాటిని ఇవ్వడానికి రూ.300 నుంచి రూ.700 వసూలు చేస్తున్నారు. రెగ్యులర్‌ సిబ్బంది లేకపోవడంతో ఔట్‌సోర్సింగ్‌ సెక్యూరిటీ సిబ్బంది బ్లాక్‌ మార్కెట్‌కు తెరతీశారు. ఈ విషయమై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డిని అడగగా.. తన దృష్టికి కూడా వచ్చిందని, విచారణ జరుపుతున్నామని, బాధ్యులుగా తేలిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అన్నారు.


ఇతర వ్యాధులున్న వారి మరణాల శాతం మార్చకుండానే బులెటిన్‌

రాష్ట్రంలో గురువారం రాత్రి వరకు కరోనాతో 519 మంది మరణించినట్లు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇందులో 46.13 శాతం మందికి ఎలాంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు లేవని, కేవలం కరోనా వల్లే చనిపోయారని.. 53.87 శాతం మంది వైరస్‌తో మృతి చెందారని వెల్లడించారు. అయితే, జూలై 28వ తేదీ నాటి బులెటిన్‌లోనూ ఇదే శాతాలను ప్రకటించారు. నాడు 480 మంది మరణించారని పేర్కొన్నారు. కాగా, తర్వాతి నాలుగు రోజుల్లో రాష్ట్రంలో 39 మంది కరోనాతో చనిపోయారు. అయినా, ఆ శాతాల్లో ఏ మాత్రం మార్పు లేకపోవడం గమనార్హం.

Updated Date - 2020-08-01T07:32:01+05:30 IST