కరోనా కబళిస్తోంది..!

ABN , First Publish Date - 2020-03-03T07:40:07+05:30 IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన 2009 ఆర్థిక మాంద్యం గుర్తుందా..? కరోనా (కోవిడ్‌-19) వైర్‌సతో కకావికలం అవుతున్న ప్రపంచ మార్కెట్లు మళ్లీ ఆనాటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నాయని..

కరోనా కబళిస్తోంది..!

  • రూ.72 లక్షల కోట్ల గండి: ఆక్స్‌ఫర్డ్‌ 
  • మళ్లీ 2009 నాటి కనిష్ఠ స్థాయికి ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు: ఓఈసీడీ


కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మొత్తంగా 88,000 మందికి ఈ వైరస్‌ సోకింది. తాజాగా భారత్‌లోనూ రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి ఢిల్లీలో, మరొకటి తెలంగాణలో నమోదైంది. ఇప్పటికే 70కి పైగా దేశాలకు విస్తరించిన కోవిడ్‌-19.. మమ్మల్నీ కుదిపేస్తుందా..? అన్ని మిగతా దేశాలు భయపడుతున్నాయి. 

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే చాలా దేశాలు తమ సరిహద్దుల్ని మూసేసుకుంటున్నాయి. విదేశాలతో, ముఖ్యంగా కరోనా ప్రభావిత దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ పరిణామం ఆయా దేశాలతోపాటు మొత్తంగా ప్రపంచ ఆర్థిక ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ప్యారిస్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన 2009 ఆర్థిక మాంద్యం గుర్తుందా..? కరోనా (కోవిడ్‌-19) వైర్‌సతో కకావికలం అవుతున్న ప్రపంచ మార్కెట్లు మళ్లీ ఆనాటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నాయని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కరోనా దెబ్బకు ప్రస్తుత త్రైమాసికం (జనవరి-మార్చి)లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మళ్లీ 2009 నాటి కనిష్ఠ స్థాయికి జారుకోవచ్చని అంతర్జాతీయ ఏజెన్సీ ఓఈసీడీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాను 2.4 శాతానికి తగ్గించింది. గతంలో 2.9 శాతంగా అంచనా వేసింది. ఈ మహమ్మారి విశ్వవ్యాప్తమై, దీర్ఘకాలంపాటు ప్రభావం చూపితే గ్లోబల్‌ జీడీపీ వృద్ధి 1.5 శాతానికి పడిపోయే అవకాశాల్లేకపోలేవని అంటోంది. పరిస్థితి మరింత తీవ్రతరమైతే ప్రజల ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక ఉద్దీపనల విషయంలో అగ్రరాజ్యాలు పరస్పర సహకారంతో విధానపరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌) పేర్కొంది. 


ఈ ప్రపంచీకరణ యుగంలో చాలా దేశాలకు విస్తరించిన తొలి వైరస్‌ కరోనానే అని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ పేర్కొంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ కారణంగా పలు దేశాల్లో కార్మికులు, ఉద్యోగుల గైర్హాజరు పెరగవచ్చని, పారిశ్రామికోత్పత్తి భారీగా తగ్గనుందని, పర్యాటకం కుంటుపడనుందని, సరుకు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడవచ్చని, పెట్టుబడులు, ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోనున్నాయని అంటోంది. ఈ పరిణామంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లకు పైగా (రూ.72 లక్షల కోట్లకు పైమాటే) గండి పడవచ్చని అంచనా వేసింది. 


చైనా పారిశ్రామికోత్పత్తి ఆల్‌టైం కనిష్ఠం 

కరోనాతో కుదేలవుతున్న చైనాలో పారిశ్రామికోత్పత్తి పూర్తిగా పడకేసింది. గత నెలకు చైనా తయారీ రంగ పీఎంఐ (పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) 40.3కు పతనమైంది. 2004లో ఈ సర్వే సూచీ గణాంకాలను విడుదల చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే కనిష్ఠ స్థాయి. జనవరిలో పీఎంఐ సూచీ 51.1గా నమోదైంది. సాధారణంగా ఈ సూచీ 50కి ఎగువన ఉం టే వృద్ధికి, దిగువన నమోదైతే క్షీణతకు సంకేతం.


‘కరోనా’పై ఫోన్‌ పే చర్చ! 

కరోనా వైరస్‌ ప్రభావం, పరస్పర సహకారంతో చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు జీ7, యూరో జోన్‌ దేశాల ఆర్థిక మంత్రులు బుధవారం ఫోన్‌ ద్వారా చర్చించుకోనున్నారు. ఫ్రాన్స్‌ ఆర్థిక మంత్రి బ్రూనో లే మైర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక చోట సమావేశమయ్యేందుకు అన్ని దేశాల మంత్రులు ఆ ప్రాంతానికి ప్రయాణం కావాల్సి ఉంటుందని, కరోనా వైరస్‌ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రయాణాలను నివారించేందుకు ఫోన్‌ ద్వారా చర్చించాలని నిర్ణయానికొచ్చినట్లు ఆయన చెప్పారు. 


అంతర్జాతీయ ఇంధన సదస్సు రద్దు 

కరోనా కలకలంతో మరో ప్రతిష్ఠాత్మక సమావేశం రద్దయింది. ఈనెల 9 నుంచి 13 వరకు అమెరికాలోని హ్యూస్టన్‌లో జరగాల్సిన 39వ వార్షిక ఇంధన 

సదస్సును రద్దు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయా దేశాల చమరు శాఖ మంత్రులతో పాటు 

80 దేశాల పెట్రోలియం ఇండస్ట్రీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేవారని వారు వెల్లడించారు. 


ఈసారి వృద్ధి 4.9 శాతమే: ఫిచ్‌

అంతర్జాతీయ ఏజెన్సీ ఫిచ్‌ సొల్యూషన్స్‌.. భారత ఆర్థిక వృద్ధి అంచనాలకు కోత పెట్టింది. ఈ నెల 31తో ముగియనున్న 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 4.9 శాతానికి పరిమితం కావచ్చని అంటోంది. గతంలో 5.1 శాతంగా అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సైతం వృద్ధి అంచనాను 5.9 శాతం నుంచి 5.4 శాతానికి కుదించింది. వినియోగ డిమాండ్‌ బలహీనంగా ఉండటంతో తయారీ రంగంపై ఒత్తిడి పెరగనుందని, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశీయ కంపెనీలకు సరఫరా అడ్డంకులు ఎదురుకావచ్చని తాజా నివేదికలో పేర్కొంది. కాగా, కరోనా ప్రభావంతో జనవరి-మార్చి త్రైమాసిక వృద్ధికి 0.2 శాతం మేర గండిపడవచ్చని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) భారత జీడీపీ వృద్ధి అంచనాను 5.1 శాతానికి కుదిస్తున్నట్లు ఓఈసీడీ ప్రకటించింది. గతంలో 6.2 శాతంగా అంచనా వేసింది.


ఔషధ ముడి సరుకుల ఎయిర్‌ లిఫ్టింగ్‌

కరోనా వైరస్‌ ప్రభావంతో దేశీయ ఔషధ సంస్థలు ముడి సరుకుల కొరత ముప్పును ఎదుర్కొంటున్నాయి. దేశంలోని బల్క్‌డ్రగ్‌ కంపెనీలు ముడి సరుకుల కోసం ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతుండటం ఇందుకు కారణం. మనం దాదాపు 70 శాతం ఔషధ ముడి సరుకుల్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు చైనా నుంచి ముడి సరుకులను వాయుమార్గంలో దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలేమో తైవాన్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌ వంటి దేశాల నుంచి సేకరించే యోచనలో ఉన్నాయి. 


విమాన సంస్థలు విలవిల

ఉన్నతోద్యోగుల జీతాల్లో కోత.. వేతనం లేని సెలవులపై సిబ్బంది

కరోనా వైరస్‌ వ్యాప్తితో పర్యాటక రంగం వెలవెల బోతున్నది. చైనాతోపాటు కరోనా ప్రభావిత దేశాలకు విమానాల సేవల రద్దుతో ఎయిర్‌లైన్స్‌ విలవిల లాడుతున్నాయి. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులును ఎదుర్కొంటున్నామని ఇండస్ట్రీ ప్రతినిధులు వాపోతున్నారు. కరోనా నష్టాన్ని వీలైనంతగా తగ్గించుకునేందుకు ఎమిరేట్స్‌, లుఫ్తాన్సా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు భారీ చర్యలు చేపట్టాయి.


ఉన్నతోద్యోగుల జీతాల్లో కోత పెట్టడంతోపాటు సిబ్బందిలో చాలా మందిని వేతనం లేని సెలవులపై సాగనంపిస్తున్నాయి. మరికొన్ని ఎయిర్‌లైన్స్‌ పార్ట్‌టైం వర్క్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. ఖర్చులను సైతం భారీగా కుదించుకుంటున్నాయి. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌తో పోలిస్తే భారత విమాన సంస్థలపై ప్రభావం తక్కువే. మన ఎయిర్‌లైన్స్‌కు ఆదాయంలో మెజారిటీ వాటా దేశీయ మార్గాల్లో అందించే సేవలపైనే సమకూరుతుండటం కొంత ఊరట కల్గించే విషయం. అయితే, దేశీయ ఎయిర్‌లైన్స్‌ సైతం చైనాతోపాటు కరోనా ప్రభావిత దేశాలన్నింటికీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. 


స్లాట్ల నిబంధనలు సడలించాలి: ఐఏటీఏ 

ఎయిర్‌పోర్టుల వద్ద విమాన సంస్థలకు కేటాయించే స్లాట్ల నిబంధనలను తక్షణం సడలించాలని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) కోరింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం మంది ప్రయాణికులు 200 విమానాశ్రయాల నుంచే ప్రయాణిస్తున్నారని ఐఏటీఏ అంటోంది. నిబంధనల ప్రకారం.. ఎయిర్‌లైన్స్‌ తమకు కేటాయించిన స్లాట్లలో కనీసం 80 శాతం వినియోగించుకోవాల్సి ఉంటుందని, లేకపోతే స్లాట్లను కోల్పోవాల్సి ఉంటుంది.


నివారణ చర్యలు పెంచాలి: ఫిక్కీ 

దేశంలో తాజాగా రెండు కేసులు నమోదైన నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఫిక్కీ అభిప్రాయపడింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలతోపాటు ఎయిర్‌పోర్టుల వద్ద స్ర్కీనింగ్‌ను మరింత పెంచాలని, ఆసుపత్రుల్లో ఈ వైరస్‌ చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి కోరారు.

Updated Date - 2020-03-03T07:40:07+05:30 IST