కరోనా కలకలం.. గుండె కలవరం..!

ABN , First Publish Date - 2020-07-14T07:46:53+05:30 IST

ఇది ఈ ఇద్దరి సమస్యే కాదు. కరోనా కలకలం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యమిది. కరోనా వైరస్‌ విలయం..

కరోనా కలకలం.. గుండె కలవరం..!

  • పెరుగుతున్న బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌
  • హృద్రోగుల్లో 10-16 శాతం ఈ కేసులే
  • కరోనాతో మానసిక ఆందోళన తీవ్రం

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రానికి చెందిన వ్యక్తికి కరోనా సోకింది. విషయం తెలిసి అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురైంది. భర్తను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు ఏమౌతుందోనని ఆమె ఆందోళన చెందింది. ఆర్థిక సమస్యల భయం ఆమెను మానసికంగా కుంగదీసింది. భర్తను ఆస్పత్రికి తరలించిన రెండు గంటల్లోనే ఆమె హఠాత్తుగా గుండె ఆగి చనిపోయింది. 


గుంటూరులో ఒక కుటుంబంలో కరోనా సోకింది. కొందరు ఆస్పత్రుల పాలయ్యారు. తమ వారికి ఏమౌతుందోననే బెంగతో ఆ కుటుంబానికి చెందిన మహిళ గుండె పోటుకు గురైంది. ఆస్పత్రిలో చేర్చిన రెండు రోజుల్లోనే తుది శ్వాస విడిచింది.


గుంటూరు (మెడికల్‌): ఇది ఈ ఇద్దరి సమస్యే కాదు. కరోనా కలకలం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యమిది. కరోనా వైరస్‌ విలయం.. రోజూ వందల్లో కేసులు.. అనధికార లాక్‌డౌన్‌తో సామాన్యులకు ఉపాధి కరువు.. చుట్టుముడుతున్న ఆర్థిక సమస్యలు.. దీంతో భవిష్యత్తుపై బెంగ.. తీవ్ర మానసిక ఆందోళన... ఆ ఒత్తిడితో గుండె పగులుతోంది! ఫలితంగా అనేకమంది గుండె జబ్బులకు గురై ఆకస్మికంగా మృతి చెందుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కొవిడ్‌-19 పరిస్థితుల వల్లే మానసిక ఆందోళనకు గురై ‘సడన్‌ కార్డియాక్‌ అరె్‌స్ట’తో మృతి చెందుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి స్థాయి పతాక స్థాయికి చేరడంతో తాత్కాలికంగా గుండె కండరాలు బలహీనమై గుండెపోటుకు గురవుతున్నట్టు కార్డియాలజిస్టులు చెబుతున్నారు. దీన్ని ‘బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌’గా పేర్కొంటున్నారు. వైద్యపరిభాషలో దీన్ని ఎక్యూట్‌ ఎపీనియల్‌ బెలూనింగ్‌ సిండ్రోమ్‌గా పిలుస్తారు. పలు ఆసియా దేశాల్లో ఈ జబ్బును ఠకా సుబో కార్డియోమయోపతి/స్ట్రెస్‌ కార్డియోమయోపతిగా పిలుస్తుంటారు. 


మహమ్మారి ప్రారంభమైన తర్వాత...

రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ విధించిన తర్వాత నుంచి క్రమేపీ బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రులకు వస్తున్న హృద్రోగుల్లో 10-15 శాతం మంది ఇదే తరహా రోగులని వారు పేర్కొంటున్నారు. ఈ రోగుల్లో ఛాతి నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఈసీజీ పరీక్ష చేస్తే నార్మల్‌గానే ఉంటుంది. యాంజియోగ్రామ్‌ తీసినా గుండె రక్తనాళాల్లో అడ్డంకులు కనిపించవు. ‘ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభించడంతో కొన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర మానసిక ఒత్తిడి నెలకొంది. దీని వల్ల వారిలో స్ర్టెస్‌ హార్మోన్‌ కెటకొలామైన్స్‌ అధికంగా విడుదలవుతుంది. ఈ కారణంగా గుండె కండరాలు తాత్కాలికంగా బలహీనమవుతాయి. ఫలితంగా బాధితుల్లో గుండెపోటు లక్షణాలు కనిపిస్తాయి’ అని గుంటూరుకు చెందిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ కనుమూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తెచ్చి రెండు రోజులు వైద్యపర్యవేక్షణలో ఉంచితే తేలిగ్గా కోలుకుంటారని ఆయన చెప్పారు. 


జపాన్‌లో తొలిసారి గుర్తింపు..

బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ను తొలిసారిగా జపాన్‌లో గుర్తించారు. జపాన్‌లో సునామీ అనంతరం పెద్ద సంఖ్యలో హృద్రోగ మరణాలు నమోదయ్యాయి. సునామీలో కుటుంబ సభ్యులు కొట్టుకుపోవడం, గృహాలు పూర్తిగా దెబ్బతినడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. ఇది వారిలో తీవ్ర మానసిక ఆందోళనకు కారణమైంది. ఈ ఒత్తిడి వల్ల కొందరిలో గుండె ఆకారం.. చేపలు పట్టే ఠకా సుబో అనే వల రూపంలో మారినట్లు వారు గమనించారు. ఈ కారణంగా ఠకా సుబో కార్డియోమయోపతిగా ఆ జబ్బుకు నామకరణం చేశారు.


Updated Date - 2020-07-14T07:46:53+05:30 IST