Abn logo
Nov 22 2020 @ 10:35AM

కరోనాకు ఆ గ్రామాల్లో ‘నో ఎంట్రీ’

కరోనా మహమ్మారి ఒకవైపు అమెరికా వంటి అగ్ర దేశాన్నేగాక యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ... మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఆ నాలుగు పల్లెల్లోకి మాత్రం ఇప్పటికీ అడుగు పెట్టలేకపోయింది. గడిచిన 8 నెలల్లో ఈ పల్లెల్లో ఒక్కటంటే ఒక్క కొవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదని స్వచ్ఛంద సంస్థలు లెక్కలు తేల్చాయి. మాస్కులు, శానిటైజర్లు ఎలా ఉంటాయో కూడా తెలియని ఈ మారుమూల పల్లెలు కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కొంటున్నాయి?


ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నుంచి 160 కిలోమీటర్లు వెళ్తే, తూర్పు కనుమల్లో... ఆకుపచ్చని కొండల మధ్య... గువ్వలా ఒదిగున్న గిరిజన గ్రామాలైన సంతోషపురం, మోరంగూడ, రాయగడ జమ్ము, పల్లం బరిడి కనిపిస్తాయి. ఈ గ్రామాల్లో చాలా ఇళ్ల ముందు వెదురుతో కట్టిన దడిలు, ఇంటి వెనుక జీలుగ చెట్లు, ఆరుబయట అరుగుల ముందు పెద్ద రాతి రుబ్బురోళ్లు, తిరగళ్లు, పచ్చళ్లు నూరే రాళ్లు దర్శనమిస్తాయి. గ్రామస్థుల ముఖాలకు ఎలాంటి మాస్కులు ఉండవు. పలుగు, పారలు పట్టుకుని పొలాలకు వెళ్తూ సాధారణ జీవనాన్ని గుర్తుకుతెస్తారు. ఇక్కడ వరి, పసుపు, రాగులు, సజ్జలు, జీడిమామిడి, జామ, పనస ప్రధాన పంటలు. ప్రతీ ఇంటి పెరట్లో కూరగాయలు పండిస్తారు. గ్రామం గోడల మీద ఎక్కడా రసాయన ఎరువుల ప్రకటనలు కనిపించవు. 


ఒకప్పుడు ఈ ప్రాంతంలో రైతులు రసాయన ఎరువులతో పంటలు పండించేవారు. రాను రాను పెట్టుబడి వ్యయం పెరిగి చాలామంది అప్పుల పాలయ్యారు. నేలంతా రసాయనాలతో నిండిపోవడంతో ‘జట్టు స్వచ్ఛంద సంస్థ’ ఇచ్చిన నినాదం... ఈ గ్రామాలను బయో గ్రామాలుగా మార్చింది. వాలంటీర్ల సాయంతో ‘ఆరోగ్యవంతమైన పంట కోసం... తిరిగి మూలాల్లోకి వెళదాం’ నినాదంతో ఇక్కడి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చారు. సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయడం నేర్పించారు. ‘‘పశువుల పేడ, మూత్రాన్ని సేకరించి, వారానికోసారి పొలాల్లో చల్లుతాం. వర్మీ కంపోస్ట్‌ వల్ల భూమిలో సారం పెరుగుతుంది. దీంతో పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి లభిస్తుంది. మేము పండించిన ఆహారమూ మాకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తోంది’’ అని అంటున్నారు రాయగడ జమ్ము గ్రామానికి చెందిన రైతు లచ్చన్న.


జీవనశైలి ప్రధానం...

ఇప్పటిదాకా కరోనా కాలు పెట్టని ఈ నాలుగు గ్రామాలు పార్వతీపురం మన్యంలో ఉన్నాయి. ఇక్కడ భగత, కొండదొర, వాల్మీకి, కొటియ, నూకదొర, గదబ, కోందు తెగల గిరిజనులు ఉంటారు. వారు పండించే పంటలను బట్టి పండగలు జరుపుకుంటారు. సాగుకు ప్రతీకగా కొర్రకొత్త, జొడ్ల, విటింగ్‌, నంది, బారిజం వంటి పండగలు వీరికి ప్రత్యేకం. ప్రకృతికి, మనిషికి, చుట్టూ ఉన్న ఇతర జీవాలకు ఉన్న సంబంధాన్ని వీరి పండగలు చాటిచెబుతాయి. పండిన పంటను తినే ముందు పండగ చేసుకోవడం వీరి ఆనవాయితీ. ఈ సంబరాన్ని ‘కొత్తలు’గా పిలుస్తారు. పుప్పు, ధాన్యాలకు పప్పు కొత్తలు, తిండిగింజలు పండితే సామ కొత్తలు, కొర్ర కొత్తలు... ఇలా ఏ పంట పండినా కొత్తలు జరుపుకుని, ఆయా వృక్షజాతులకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు. గ్రామంలో కొంత ప్రాంతాన్ని దేవతావనానికి కేటాయిస్తారు. ఈ వనాల్లో చెట్లు నరకడం, మొక్కలు పీకడం నిషిద్ధం.  


అందరిలా పాలిష్‌ బియ్యం కాకుండా దంపుడు బియ్యాన్నే తింటారు. ఏదైనా పని చేసిన తర్వాత వేపాకులు నలిపి చేతులను శుభ్రం చేసుకుంటారు. అదే వారికి శానిటైజర్‌. కొందరు జీలుగ కల్లుతో కూడా చేతులు కడుక్కుంటారు. ఈ మారుమూల గ్రామాల్లో రవాణా వ్యవస్థ అంతగా విస్తరించకపోవడం వల్ల కాలినడకే వీరికి శరణ్యం. దీనివల్ల శరీర పటుత్వంతో పాటు, రోగనిరోధక శక్తి కూడా పెరిగి ఎలాంటి వైరస్‌లనైనా తట్టుకునే స్వభావం వీరికి వచ్చింది. ఈ గ్రామాల్లో ఎవరిని పలకరించినా ‘డాప్‌ ఉరియా ఎర్భిన్లభి అగన్‌ నూర్‌ అగాలభిన్‌ అసన్‌ కరోనా జబ్బు అయి ఈరైతి’ అని సవర భాషలో చెబుతుంటారు. అంటే... ‘రసాయన ఎరువులు లేని పంటలు పండించి, వాటిని తినడం వల్ల మాకు కరోనా వ్యాధి రాలేదు’ అని అర్థం. ఈ నాలుగు గ్రామాల్లోని గిరిజనులు వారికి తెలియకుండానే భౌతిక దూరం పాటిస్తూ, ఆరోగ్యకరమైన తిండి తినడం వల్ల సహజంగానే రోగనిరోధక శక్తి పెరిగి, వైరస్‌ వారి గ్రామ పొలిమేరల్లోకి కూడా అడుగు పెట్టలేకపోయిందని వేరే చెప్పాలా!. 


బీపీ, షుగర్లు కూడా తక్కువే

‘‘పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో తరచూ చూస్తూనే ఉన్నాం. ప్రజారోగ్యానికి ప్రకృతి వ్యవసాయం ఎంతగా మేలు చేస్తుందో మన్యం జనానికి చెప్పడానికి మేము అనేక అవగాహనా తరగతులు నిర్వహించాం. గత మూడేళ్లలో 8,557 గిరిజన కుటుంబాలను ప్రకృతి సాగువైపు కదిలేలా చేశాం. ఇప్పటికే 48 గిరిజన గ్రామాలు బయో విలేజెస్‌గా మారాయి. అంటే ఆ గ్రామాల్లో ఎలాంటి రసాయనాలు లేకుండానే రైతులు సాగు చేస్తున్నారన్నమాట. స్వచ్ఛమైన ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తినడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరిగింది. ఈ గ్రామాల్లో బీపీ, షుగర్లు కూడా తక్కువ.’’

- డి.పారినాయుడు, ‘జట్టు ట్రస్ట్‌’ వ్యవస్థాపకులు. 

- శ్యాంమోహన్‌, 94405 95858

Advertisement
Advertisement
Advertisement