హతవిధీ..!

ABN , First Publish Date - 2020-02-29T07:15:05+05:30 IST

చైనాను కుదిపేస్తున్న కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ ఇతర దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతో ఈక్విటీ మార్కెట్‌వర్గాల్లో భయాందోళనలు...

హతవిధీ..!

  • కరోనాతో మార్కెట్లు కకావికలం
  • సెన్సెక్స్‌ చరిత్రలో రెండో అతిపెద్ద పతనం 
  • 1,448 పాయింట్లు క్షీణించిన సూచీ  
  • 432 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
  • రూ.5.53 లక్షల కోట్ల సంపద ఆవిరి


రూ.12,00,000 కోట్లు

శుక్రవారంతో ముగిసిన ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో తగ్గిన మార్కెట్‌ సంపద 


దశాబ్దంలో అతిపెద్ద వీక్లీ నష్టం 

ఈ వారంలో సెన్సెక్స్‌ 2,872.83 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 879.10 పాయింట్లు నష్టపోయింది. గడిచిన దశాబ్దకాలంలో సూచీలకిదే అతిపెద్ద వీక్లీ నష్టం. 


2008 తర్వాత మళ్లీ అత్యంత గడ్డు వారం

ప్రపంచ మార్కెట్లకు 2008 నాటి ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ ఇదే అత్యంత గడ్డువారం. వరుసగా ఆరు రోజుల నుంచి గ్లోబల్‌ మార్కెట్లు నష్టాల్లోనే పయనిస్తున్నాయి. 


విలయం.. విధ్వంసం.. కలవరం.. కలకలం.. కల్లోలం.. కర్కశం. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న భయోత్పాతం అంతా ఇంతా కాదు. ఈ వైరస్‌ విశ్వవ్యాప్తమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవచ్చన్న ఆందోళనలు స్టాక్‌ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. పుట్టి ముంచేస్తున్న ఈ మహమ్మారికి జడిసి ఈక్విటీ మదుపర్లు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. దాంతో స్టాక్‌ సూచీలు పేకమేడలా కూలుతున్నాయి. 


ముంబై: చైనాను కుదిపేస్తున్న కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ ఇతర దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతో ఈక్విటీ మార్కెట్‌వర్గాల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. ట్రేడర్లు అమ్మకాలు పోటెత్తించడంతో ప్రపంచ దేశాలతోపాటు భారత స్టాక్‌ సూచీలూ భారీ నష్టాలను చవిచూశాయి. శుక్రవారం బీఎస్‌ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 1,448.37 పాయింట్లు పతనమై 38,297.29 వద్దకు పడిపోయింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో సూచీకిది రెండో అతిపెద్ద పతనం. 2015, ఆగస్టు 24 సెన్సెక్స్‌ 1,624.51 పాయింట్ల క్షీణతను నమోదు చేసుకుంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ విషయానికొస్తే.. వారాంతపు ట్రేడింగ్‌లో 431.55 పాయింట్లు నష్టపోయి 11,201.75 వద్దకు జారుకుంది. బ్లూచి్‌పలతోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లలోనూ ట్రేడర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 3.5 శాతం వరకు నష్టపోయాయి. దాంతో మార్కెట్‌ వర్గాల సంపద ఒక్కరోజే రూ.5.53 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.152,40,024.08 కోట్ల నుంచి రూ.146,87,010.42 కోట్లకు జారుకుంది. 


29 నష్టాల్లోనే.. 

సెన్సెక్స్‌ సూచీలోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 29 నష్టాల్లోనే ముగిశాయి. అన్నింటికంటే అత్యధికంగా టెక్‌ మహీంద్రా 8.14 శాతం క్షీణించింది. టాటా స్టీల్‌ 7.57 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 7.50 శాతం పతనమయ్యాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 6 శాతం పైగా.. ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ 5 శాతం పైగా.. టీసీఎస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 4 శాతం పైగా నష్టపోయాయి. ఐటీసీ ఒక్కటే అతిస్వల్ప లాభంతో సరిపెట్టుకుంది. 


రంగాల సూచీల్లోనూ.. 

బీఎ్‌సఈలోని అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మెటల్‌, ఐటీ, టెక్నాలజీ, బేసిక్‌ మెటీరియల్స్‌, ఇండస్ట్రియల్స్‌, ఎనర్జీ, ఫైనాన్స్‌, ఆటో, బ్యాంకెక్స్‌ సూచీలు 7.01 శాతం వరకు పడిపోయాయి. ముఖ్యంగా మెటల్‌, ఐటీ, టెక్నాలజీ రంగ షేర్లు అధిక అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.


63 పైసలు తగ్గిన రూపాయి

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయు విలువ దాదాపు ఆరు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.  శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం రేటు ఒక దశలో 72.29కి బలహీనపడింది. చివరికి 63 పైసల నష్టంతో 72.24 వద్ద స్థిరపడింది. గత ఏడాది సెప్టెంబరు 13 తర్వాత రూపాయికి దే అతిపెద్ద ఒక్క రోజు నష్టం. అలాగే, 2019 సెప్టెంబరు 3 తర్వాత మళ్లీ ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు. భారత ఈక్విటీ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఉపసంహరించుకోవడం ఇందుకు కారణమైంది. 


50 డాలర్లకు ముడిచమురు

కరోనా దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పతనమయ్యాయి. బ్రెంట్‌ రకం క్రూడ్‌ ధర మరో 4 శాతం మేర క్షీణించి 50 డాలర్ల స్థాయికి జారుకుంది. గడిచిన నాలుగు ఏళ్లకు పైగా కాలంలో క్రూడాయిల్‌ ధరల్లో అతిపెద్ద వీక్లీ పతనమిది. 


 అంబానీ ఆస్తికి కరోనా కాటు 

ఆసియాలో  అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీపైనా కరోనా  గట్టిగానే ప్రభావం చూపింది. కరోనా వ్యాప్తి భయాలతో స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. దాంతో అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు సైతం పెద్ద మొత్తంలో నష్టపోయాయి. తత్ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంబానీ ఆస్తి 500 కోట్ల డాలర్ల మేర తరిగిపోయింది. బ్లూంబర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార మంగళం బిర్లా సంపద 88.4 కోట్ల డాలర్లు తగ్గగా, విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ ఆస్తి 86.9 కోట్ల డాలర్లు,  అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ నికర విలువ 49.6 కోట్ల డాలర్ల మేర కరిగిపోయింది.


ఆటో, ఎయిర్‌లైన్స్‌ షేర్లు ఢమాల్‌

కరోనా వైరస్‌ కారణంగా వాహన కంపెనీలకు చైనా నుంచి విడిభాగాల సరఫరా నిలిచిపోవచ్చన్న భయాలతో ఆటో షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎ్‌సఈలో ఆటో సూచీ 3.78 శాతం క్షీణించింది. టాటా మోటార్స్‌ 11.03 శాతం, అశోక్‌ లేలాండ్‌ 8.15 శాతం, ఎం అండ్‌ ఎం 7.50 శాతం, బజాజ్‌ ఆటో 1.60 శాతం తగ్గాయి. మారుతీ సుజుకీతోపాటు టీవీఎస్‌ మోటార్‌, హీరో మోటోకార్ప్‌, ఐషర్‌ మోటార్స్‌ నష్టాల్లోనే ముగిశాయి. టైర్ల తయారీలోని ఎంఆర్‌ఎఫ్‌, అపోలో టైర్స్‌ సైతం నేలచూపులు చూశాయి.  పర్యాటక రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుందన్న అంచనాలతో విమానయాన కంపెనీల షేర్లూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు 4.80 శాతం, స్పైస్‌జెట్‌ 6.06 శాతం, మూతపడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 4.84 శాతం నష్టపోయాయి.


ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలు, కమోడిటీలు.. ఇలా అన్ని పెట్టుబడి సాధనాలకు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి భారత్‌కు సైతం మినహాయింపు లేదు. 

- మార్క్‌ ఫాబర్‌, ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌



Updated Date - 2020-02-29T07:15:05+05:30 IST