వైరస్ ‘సైరన్’

ABN , First Publish Date - 2020-03-29T14:16:16+05:30 IST

కరోనా మహమ్మారి జిల్లాలో మరో ఇద్దరికి..

వైరస్ ‘సైరన్’

గుంటూరు జిల్లాలో మరో ఇద్దరికి కరోనా వైరస్‌

నాలుగుకు చేరిన పాజిటివ్‌ కేసులు

తాజా కేసుల్లో బాధితులిద్దరూ సహచర ప్రయాణీకులే..

జిల్లావాసుల్లో ఆందోళన!


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి జిల్లాలో మరో ఇద్దరికి వ్యాపించింది. ఇప్పటికే పొగాకు వ్యాపారి, అతడి భార్యకు పాజిటివ్‌ రిపోర్టు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య నాలుగుకు చేరింది.  మరికొందరి నమూనాల ఫలితాలు రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు గుంటూరుకు చెందిన ప్రజా ప్రతినిధి కుటుంబంలోని 20 మంది సభ్యులకు  నమూనాలు సేకరించారు. వీరి కోసం కాటూరి మెడికల్‌ కళాశాలలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును కేటాయించి దానిలో 15 మందిని ఉంచారు. ఐదుగురు సభ్యులను విజయవాడలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపి అక్కడ రక్త నమూనాలు సేకరించారు. వీరి నమూనాల ఫలితాలు ఆదివారం సాయంత్రానికి వెలువడుతాయని భావిస్తున్నారు. 


కరోనా మహమ్మారి  జిల్లాలో మరో ఇద్దరికి వ్యాపించింది. దీంతో మొత్తం జిల్లాలో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. తొలిగా సోకిన ఇద్దరు భార్యాభర్తలు కాగా తాజాగా నిర్ధారణ అయిన కరోనా పాజిటివ్‌ కేసు పల్నాడు ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు. వీరిరువురు కూడా ఢిల్లీలోని సమావేశానికి పొగాకు వ్యాపారితో పాటు కలిసి ప్రయాణించిన వారే..!  మరికొందరి పరీక్షా ఫలితాలు రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతనితోపాటు ప్రయాణించి వచ్చిన వారిలో 9 మందిని జీజీహెచ్‌లో ఉంచి పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. వీరి నమూనాల ఫలితాలు కూడా ఇంతవరకు రాలేదు. 


పరిశీలనలో కరోనా అనుమానితులు 

కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి, గోరంట్లలోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు రోగుల నుంచి శనివారం రక్త నమూనాలు సేకరించి శనివారం నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో నమూనాలు పంపిన కరోనా అనుమానిత రోగుల సంఖ్య 42కి చేరింది. ప్రస్తుతం జ్వరాల ఆసుపత్రి, వైద్య బోధన ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో 9 మంది చికిత్సలు పొందుతున్నారు. 33 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. ఇప్పటివరకు విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 2062 మంది గృహ నిర్బంధంలో ఉన్నారు. శుక్రవారం నాటికి జిల్లాలో 15 ప్రైవేటు క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం మరో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 19 క్వారంటైన్‌ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్వారంటైన్‌ కేంద్రాల్లో శనివారం నాటికి 118 మంది విదేశీ ప్రయాణీకులను వైద్య పరిశీలనలో ఉంచారు.


ఢిల్లీకి ఎంతమంది వెళ్లి వచ్చారు?

ఇప్పటివరకు ఢిల్లీలోని ఓ ప్రాంతంలో జరిగిన సమావేశానికి ఓ పొగాకు వ్యాపారి, అతని సన్నిహితులే వెళ్లి వచ్చారని తెలిసింది. కాగా.. శనివారం ఉదయం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి ఆరుగురు వ్యక్తుల బృందం వచ్చి తమకు కరోనా పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లను కోరారు. తాము ఇటీవల ఢిల్లీలో ఓ కీలక ప్రాంతంలో జరిగిన ఓ ముఖ్య సమావేశానికి వెళ్ళి వచ్చామని, అయితే కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి బృందంలో సభ్యులం కాదని తెలిపారు. తాము ఆరుగురం ప్రత్యేకంగా వెళ్లి వచ్చామని, తమకు కూడా అనుమానం వస్తుందని వైద్యులకు తెలిపారు. అయితే వారి వద్ద లక్షణాలు లేకపోవడంతో ఇంటివద్ద జాగ్రత్తగా ఉండాలని కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. ఇదిలా ఉంటే మండల రెవెన్యూ కార్యాలయానికి శుక్రవారం రాత్రి మరో బృందం సంప్రదించింది. తాము కూడా ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చామని తెలిపారు. దీంతో అసలు ఢిల్లీకి ఎంత మంది వెళ్లారు అనే దానిపై చర్చ జరుగుతోంది.


ఫేస్‌బుక్‌లపై విచారణ

ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు, అనంతరం.. ఓ ముఖ్య కార్యక్రమంలో పాల్గొన్నామని.. వారి వారి వ్యక్తిగత ఫేస్‌బుక్‌ ఖాతాల్లో ఫొటోలు అప్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే విషయం బయటకు వచ్చేసరికి అందరూ ఆ ఫొటోలను డిలీట్‌ చేశారు. ఇవన్నీ బయటకు వస్తే కానీ అసలు ఢిల్లీ ఎంత మంది వెళ్లారనే దానిపై స్పష్టత వస్తుందని తెలుస్తుంది. గుంటూరు వ్యాపారి ఇచ్చిన విందు భోజనానికి సత్తెనపల్లి పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు కూడా హాజరైనట్లు శనివారం రాత్రి పట్టణ పోలీసులకు సమాచారం అందింది. ఈమేరకు సీఐ విజయచంద్ర తమ సిబ్బందితో ఆవ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. 


ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు పరీక్షలు 

గుంటూరుకు చెందిన ప్రజాప్రతినిధి కుటుంబంలోని 20 మంది సభ్యులకు శనివారం నమూనాలు సేకరించారు. వీరి కోసం కాటూరి మెడికల్‌ కళాశాలలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును కేటాయించి దానిలో 15 మందిని ఉంచారు. ఐదుగురు సభ్యులను విజయవాడలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపి అక్కడ రక్తనమూనాలు సేకరించారు. వీరి నమూనాల ఫలితాలు ఆదివారం సాయంత్రానికి వెలువడుతాయని భావిస్తున్నారు. 


ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండాలి

ఢిల్లీతో పాటు ఇతర ముఖ్య నగరాల నుంచి వచ్చిన వారిని కూడా కుటుంబ సభ్యులు కలవకుండా గృహ నిర్బంధంలో 28 రోజులు ఉంచాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్న వైద్య అధికారులు, ఏఎన్‌ ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్‌ వాడీలు, పంచాయ తీరాజ్‌, రెవెన్యూ, మునిసిపల్‌, ప్రజా రోగ్య, పోలీసు శాఖల అధికారులకు పూర్తిగా ప్రజలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రులలో పనిచేస్తోన్న సిబ్బందిని ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Updated Date - 2020-03-29T14:16:16+05:30 IST