కరోనా వార్డుల వద్ద కానిస్టేబుళ్లు

ABN , First Publish Date - 2020-04-03T07:01:19+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై కొవిడ్‌-19 వ్యాధిగ్రస్తుల దాడి తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ తరహా దాడుల భయంతో పనిచేయలేమని డాక్టర్లు తేల్చిచ్పెడంతో పోలీసు...

కరోనా వార్డుల వద్ద కానిస్టేబుళ్లు

గాంధీ ఆస్పత్రి వద్ద భారీ భద్రత

మరోమారు దాడి జరిగితే పనిచేయం

జూనియర్‌ డాక్టర్ల ఆగ్రహం

భరోసానిచ్చిన మంత్రి తలసాని


హైదరాబాద్‌ సిటీ, అడ్డగుట్ట, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై కొవిడ్‌-19 వ్యాధిగ్రస్తుల దాడి తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ తరహా దాడుల భయంతో పనిచేయలేమని డాక్టర్లు తేల్చిచ్పెడంతో పోలీసు అధికారులు కరోనా ప్రత్యేక వార్డుల వద్ద ఇద్దరేసి కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పాట్లు చేశారు. వారికి ప్రొటెక్టివ్‌ దుస్తులను అందజేశారు. వీరితోపాటు మరికొందరు పోలీసులు 7, 8 అంతస్తుల్లో గస్తీ తిరుగుతున్నారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ఆదేశాల మేరకు ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్‌ నేతృత్వంలో గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా వార్డులు, క్వారంటైన్లు, ఐసోలేషన్లు ఉన్న ఇతర ఆస్పత్రుల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం వైద్యులపై దాడికి పాల్పడ్డ నలుగురు కొవిడ్‌-19 రోగులను కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా కరోనా వార్డుల వద్ద కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం నాటి ఘటనతో గాంధీ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత భద్రత పరికరాలు లేకున్నా.. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని, భయభ్రాంతులకు గురిచేస్తే పనిచేయలేమని తేల్చిచెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆస్పత్రి ప్రవేశ ద్వారాలు, అన్ని అంతస్తుల్లో సీఆర్పీఎఫ్‌ భద్రత కల్పించాలని, కరోనా వార్డుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రొటెక్టివ్‌ దుస్తులను అందజేయాలని డిమాండ్‌ చేశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై కరోనా రోగులు జరిపిన దాడిని మంత్రి తలసాని ఖండించారు. గురువారం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించి, వైద్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-04-03T07:01:19+05:30 IST