ఉచిత పరీక్షలు

ABN , First Publish Date - 2020-04-11T06:05:53+05:30 IST

కరోనా నిర్థారణ పరీక్షలన్నీ ఉచితంగా చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాన్ని అత్యధికులు స్వాగతించారు. అసలే కష్టంలో ఉన్న ప్రజల నెత్తిన వ్యాధి నిర్థారణ భారం...

ఉచిత పరీక్షలు

కరోనా నిర్థారణ పరీక్షలన్నీ ఉచితంగా చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాన్ని అత్యధికులు స్వాగతించారు. అసలే కష్టంలో ఉన్న ప్రజల నెత్తిన వ్యాధి నిర్థారణ భారం పడకుండా ఈ ఆదేశం ఆపుతుందని సంతోషించారు. కొవిడ్‌ పరీక్షలన్నీ ఉచితంగా జరగాల్సిందేనన్న సుప్రీం మాట ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేకుండా వర్తిస్తుంది. గవర్నమెంటు పరీక్షలు ఎలాగూ ఉచితమే. ప్రభుత్వం ఇప్పటికే విధించిన నిబంధనలకు లోబడి, ప్రైవేటులో కూడా నాలుగున్నరవేల రూపాయలకు ఈ పరీక్ష అందుబాటులో ఉంది. ‘ఈ సంక్షోభకాలంలో పరీక్ష ప్రజలందరికీ ఉచితంగా అందాలన్నదే మా కోరిక’ అంటూనే, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎమ్‌ఆర్‌) మార్చి 21న ప్రైవేటు ల్యాబరేటరీలకు ఈ మొత్తాన్ని గరిష్ఠంగా నిర్ణయించింది. ఇకపై ఉచితంగా పరీక్షలు జరిపే ప్రైవేటు సంస్థలకు సదరు మొత్తాన్ని భవిష్యత్తులో భర్తీ చేయగలిగేదీ లేనిదీ చెప్పమంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి రెండువారాలు సమయం ఇచ్చింది. దేశంలో కొవిడ్‌ నిర్థారణ పరీక్షల అవసరం అతి వేగంగా హెచ్చుతున్న నేపథ్యంలో, సుప్రీం తీర్పుకూ, ప్రభుత్వం చెప్పబోయే సమాధానానికీ ఎంతో ప్రాధాన్యం ఉన్నది.


దేశంలో ప్రస్తుతానికి 139 ప్రభుత్వ, 69 ప్రైవేటు ల్యాబరేటరీలు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం వారం క్రితం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రైవేటు ఆస్పత్రులకు, పరీక్షలకు కూడా విస్తరింపచేసి సదరు పథకం కింద అర్హులైనవారికి కరోనా పరీక్షలు, చికిత్స ఉచితంగా అందేట్టు చూసింది కూడా. ప్రైవేటు కేంద్రాల్లో పరీక్షల అవసరం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, అవీ ఉచితమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం వాస్తవికంగా ప్రజలకు మేలు చేస్తుందా? అన్నది ప్రశ్న. ఈ సంక్షోభకాలంలో ప్రభుత్వాల నిర్ణయాలను అవి తూచ తప్పకుండా పాటించాల్సిందే. ప్రైవేటు సంస్థలన్నీ ఐసీఎమ్‌ఆర్‌ విధించిన ధరకు లోబడటమే కాక, వాటిలో కొన్ని తాము మరింత తక్కువ ధరకు పరీక్షలు అందిస్తున్నట్టు కూడా చెబుతున్నాయి. దేశంలో కనీసం పదిశాతం జనాభా ఈ ఖర్చును భరించగలిగే స్థితిలో ఉంటూ, ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం తమ వద్ద పరీక్షలు కూడా చేయించుకుంటున్న స్థితిలో, సుప్రీం ఆదేశం తమ బోటి సంస్థలు ఆర్థికంగా దెబ్బతినడానికీ, అంతిమంగా పరీక్షల సంఖ్య తగ్గిపోవడానికీ కారణమవుతుందని వాటి వాదన. ఒకపక్క ప్రైవేటు కూడా బలంగా ఉంటేనే, ప్రభుత్వపరంగా జరిగే ఉచిత పరీక్షలు పేదలకు సంపూర్ణంగా అందచేయడం సాధ్యపడుతుందని అంటున్నాయి. పీపీఈ కిట్లు, గ్లౌజులతో పాటు నిర్థారణ పరీక్షలకు అవసరమయ్యే మొత్తం సామగ్రిని ప్రభుత్వమే ఇచ్చి ఉచితంగా పరీక్షలు జరపమన్నా అభ్యంతరం లేదని కొన్ని సంస్థలు అంటున్నాయి. కనీసం రెండున్నరవేల రూపాయలు భర్తీచేసినా సరిపోతుందని మరికొన్ని అంటున్నాయి. కరోనా ముందుకాలం నాటి వ్యాపారం పూర్తిగా కోల్పోయి, కేవలం కొవిడ్‌ పరీక్షలు మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో పూర్తి ఉచితాన్ని ప్రైవేటు ల్యాబరేటరీలు భరించగల స్థితిలో లేవనీ, అదే జరిగితే అవి అంతిమంగా బాధ్యతనుంచి తప్పించుకోవడమో, మూసుకోవడమో జరుగుతుందన్నది ఈ వాదనల సారాంశం.


సుప్రీం తీర్పు నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా ఉభయతారకంగా ఉండే మార్గాన్ని ఎంచుకోక తప్పదు. ప్రైవేటు సంస్థలకు లాభం మాట అటుంచి, పరీక్ష, నిర్వహణ వ్యయాల్లో కొంతైనా కలిసిరాకపోతే అవి సిద్ధపడవు. పరీక్షల సంఖ్య విపరీతంగా పెంచాలని ప్రభుత్వాలన్నీ అనుకుంటున్న దశలో పరిమిత మొత్తాన్ని చెల్లించడం ద్వారా అవి మనుగడలో ఉండేట్టు చూడవచ్చు. ఇక, సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన మరునాడే, కరోనా కష్టాలు వీడేవరకూ దేశంలోని ప్రైవేటు వైద్య వ్యవస్థనంతా జాతీయం చేయాలంటూ ఓ పిటిషన్‌ దాఖలైంది. అతి తక్కువ బడ్జెట్‌ కేటాయింపులతో కునారిల్లిపోయిన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు కరోనాకు ఎదురొడ్డలేవనీ, ఇంతకాలమూ దేశ ప్రజల ఆరోగ్య అవసరాలనుంచి బాగా లబ్ధిపొంది, ఎంతగానో బలపడ్డ ప్రైవేటు రంగాన్ని ప్రభుత్వం అధీనంలోకి తెచ్చుకోవడం ద్వారానే ప్రజలను రక్షించుకోగలుగుతామని పిటిషనర్‌ ద్వివేదీ అంటున్నారు. ప్రైవేటును పాక్షికంగా తమ అధీనంలోకి తెచ్చుకున్న కొన్ని దేశాలను, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా జాతీయం చేసిన స్పెయిన్‌ను ఆయన ఇందుకు నిదర్శనంగా చూపించారు. వైద్యరంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళించి, ప్రజావైద్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలకు ఇంతకు మించిన తరుణం దొరకదు.

Updated Date - 2020-04-11T06:05:53+05:30 IST