ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా

ABN , First Publish Date - 2022-07-03T08:17:26+05:30 IST

ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా

ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా

ఐసొలేషన్‌లో వంశీ, సుచరిత, ఆళ్ల  

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి), గుంటూరు (మెడికల్‌): రాష్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. గన్నవరం నుంచి టీడీపీ టికెట్‌పై నెగ్గిన వల్లభనేని వంశీమోహన్‌ ఇటీవల పంజాబ్‌లోని మహోలీలో కరోనాతో అస్వస్థతకు గురై ఆక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. అలాగే, వైసీపీకి చెందిన మాజీ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కరోనా సోకింది. దీంతో వీరు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కరోనా బారిన పడటం ఇది మూడోసారి తన ను కలసి వారు పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కాగా, ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీకి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో వైసీపీ ప్లీనరీని నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సుచరిత, ఆళ్లకు కరోనా సోకడంతో పాలకపక్షంలో కొంత అలజడి మొదలైంది. 


గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కేసులు

కొద్ది రోజులుగా గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం జిల్లాలో 18 కరోనా కేసులు, శుక్రవారం 27 కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్కల కంటే కనీసం పది రెట్లు అధికంగా జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా జిల్లా కేంద్రం గుంటూరులో పలువురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మెడికల్‌, పారా మెడికల్‌ సిబ్బంది కరోనాకు గురై హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కల పరిధిలోకి రావడం లేదు. వ్యాధి లక్ష ణాల్లో అంత తీవ్రత లేకపోవడం ఊరట కలిగిస్తోంది. ఏపీలో కొవిడ్‌-19 కేసులు క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా గతంలో ఇచ్చిన విధంగా రాష్ట్రస్ధాయి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తే వ్యాధి తీవ్రత ప్రజలందరికీ తెలుస్తుందని, తద్వారా వారు తగిన జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-07-03T08:17:26+05:30 IST