ముగ్గురు బాక్సర్లకు కరోనా

ABN , First Publish Date - 2020-03-27T10:01:16+05:30 IST

కరోనా వైరస్‌ బాక్సింగ్‌ను కలవరపెడుతోంది. ఈ నెలారంభంలో ‘ద బాక్సింగ్‌ రోడ్‌ టు టోక్యో’ ఒలింపిక్స్‌ యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ముగ్గురు ...

ముగ్గురు బాక్సర్లకు కరోనా

ఐవోసీ టాస్క్‌ఫోర్స్‌పై విమర్శలు

లండన్‌: కరోనా వైరస్‌ బాక్సింగ్‌ను కలవరపెడుతోంది. ఈ నెలారంభంలో ‘ద బాక్సింగ్‌ రోడ్‌ టు టోక్యో’ ఒలింపిక్స్‌ యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ముగ్గురు టర్కీ బాక్సర్లతోపాటు కోచ్‌కు కూడా కరోనా పాటిజివ్‌గా తేలింది. ఈ టోర్నీలో పాల్గొన్న తర్వాత బాక్సర్‌ షెర్హాత్‌ గూలర్‌, ట్రెయినర్‌ సైఫుల్లా దమ్లుపినార్‌తోపాటు మరో ఇద్దరికి కరోనా సోకిందని టర్కిష్‌ బాక్సింగ్‌ సమాఖ్య ప్రకటించింది. ఈ ఘటనతో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) టాస్క్‌ఫోర్స్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి టోర్నీని జరపడాన్ని టర్కీ బాక్సింగ్‌ సమాఖ్య తప్పుబట్టింది. లండన్‌లో జరిగిన ఈ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన 350 మంది పురుష, మహిళా బాక్సర్లు పాల్గొన్నారు. గత శనివారం మొదలైన పోటీలను మంగళవారం వరకూ అంటే మూడు రోజులపాటు తలుపులు మూసి కొనసాగించారు. కానీ, ఎమర్జెన్సీ నేపథ్యంలో అర్ధంతరంగా వాయిదా వేశారు. కాగా, కరోనా విజృంభణను నిర్వాహకులు తేలిగ్గా తీసుకున్నారని టర్కీ బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు ఇప్‌ గొజెక్‌ మండిపడ్డారు. వైరస్‌ వ్యాప్తిని గుర్తించి టోర్నీని వాయిదా వేసి ఉండాల్సిందన్నారు. ‘ప్రపంచమంతా హైఅలర్ట్‌ ప్రకటిస్తే.. టోర్నీని ఎందుకు నిర్వహించారు. మేం బస చేసిన హోటళ్లలో ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలూ తీసుకోలేదు. పరిశుభ్రతను పాటించలేద’ని గొజెక్‌ ఆరోపించారు. తనతో సహా దేశ బాక్సర్లు క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-03-27T10:01:16+05:30 IST