టౌన్‌షిప్‌లో పది మందికి కరోనా

ABN , First Publish Date - 2021-12-05T09:02:18+05:30 IST

హైదరాబాద్‌ శివారు గండిపేట మండలం బండ్లగూడ కార్పొరేషన్‌ పరిధిలోని ఓ టౌన్‌షి్‌పలో రెండు కుటుంబాలకు చెందిన పదిమందికి కరోనా సోకింది.

టౌన్‌షిప్‌లో పది మందికి కరోనా

  • ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తికి తొలుత పాజిటివ్‌.. ఇంట్లోని ఐదుగురికి.. 
  • మరో ఇంట్లోని నలుగురికీ.. పాజిటివ్‌ల్లో 15 ఏళ్లలోపు పిల్లలు 
  • ముత్తంగి గురుకులంలో మరో 18 మంది విద్యార్థినులకు కొవిడ్‌
  • తూప్రాన్‌, మధిరల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైరస్‌
  • సిబ్బంది టీకా పొందేలా డీఈవోలు చూడాలి
  • పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలి ఆదేశం


హైదరాబాద్‌, నార్సింగ్‌ , డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివారు గండిపేట మండలం బండ్లగూడ కార్పొరేషన్‌ పరిధిలోని ఓ టౌన్‌షి్‌పలో రెండు కుటుంబాలకు చెందిన పదిమందికి కరోనా సోకింది. ఈ టౌన్‌షి్‌పలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చాడు. అనంతరం లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా వైరస్‌ నిర్ధారణ అయింది. ఈయన ఇంట్లోని నలుగురు పిల్లలు సహా మరో వ్యక్తికీ పాజిటివ్‌ వచ్చింది. మరోవైపు వీరి బ్లాక్‌లోని మరో ఇంట్లో ఉండే నలుగురు కూడా కొవిడ్‌ బారినపడ్డారు. మొత్తం 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మరో పద్దెనిమిది మంది విద్యార్థినులకు కరోనా  నిర్ధారణ అయింది. గత నెల 29వ తేదీన 47 మంది విద్యార్థినులు, ఉపాధ్యాయురాలికి కరోనా వచ్చింది. దీంతో శుక్రవారం రాత్రి, శనివారం 426 మంది విద్యార్థినులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు. ఈ పాఠశాలలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 66కు పెరిగింది. మెదక్‌ జిల్లా హవేళీ ఘణపూర్‌ గురుకుల బాలికల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. తూప్రాన్‌ హైదర్‌గూడ పాఠశాల ఉపాధ్యాయురాలు, ఆమె ఇద్దరు కుమారులకు కరోనా నిర్ధారణ అయింది. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులోని ప్రభుత్వ హైస్కూల్‌, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ దంపతులు, ఓ విద్యార్థినికి కొవిడ్‌ సోకింది.

 

పాఠశాల సిబ్బంది రెండో డోసు తీసుకోవాలి: డీఎస్‌ఈ

గురుకులాలు, పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది కరోనా టీకా రెండో డోసు తప్పనిసరిగా తీసుకోవాలని విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవిసేన శనివారం ప్రకటన విడుదల చేశారు. ఇంకా తొలి డోసు కూడా పొందనివారు వెంటనే తీసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలల సిబ్బంది అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా జిల్లా విద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.


కరోనా భయంతో వసతి గృహం ఖాళీ

తోటి విద్యార్థుల్లో ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) ఆదర్శ పాఠశాల వసతి గృహ విద్యార్థులు మొత్తం 76 మందిని వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. దీంతో హాస్టల్‌ ఖాళీ అయింది. శుక్రవారం ఇద్దరు విద్యార్థులు, వంట మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో వసతి గృహ, పాఠశాల విద్యార్థులకు టెస్టులు చేసేందుకు శనివారం వైద్య సిబ్బందిని పిలిపించారు. 546 మందికి గాను 374 మంది పాఠశాలకు రాలేదు. 172 మంది విద్యార్థుల్లో అనుమానం ఉన్న 20 మందికి పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలింది. 


2 నెలల తర్వాత 200 దాటిన కేసులు

రాష్ట్రంలో 2 నెలల తర్వాత కరోనా కేసుల సంఖ్య 200 దాటింది. శనివారం 39,495 మందికి టెస్టులు చేయగా 213 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. అక్టోబరు 5వ తేదీ (218) తర్వాత ఇవే అత్యధికం. గత నెల 29 నుంచి రాష్ట్రంలో పాజిటివ్‌లు పెరుగుతున్నాయి. తాజాగా వైర్‌సతో ఒకరు చనిపోయారు. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 72, కరీంనగర్‌లో 13, రంగారెడ్డి జిల్లాలో 21, సంగారెడ్డిలో 20, సూర్యాపేటలో 10  వచ్చాయి. శనివారం కొవిడ్‌ టీకా తొలి డోసు 1.58 లక్షల మంది, రెండో డోసు 1.55 లక్షల మంది తీసుకున్నారు.

Updated Date - 2021-12-05T09:02:18+05:30 IST