229 మంది విద్యార్థులకు కరోనా

ABN , First Publish Date - 2021-02-26T09:31:43+05:30 IST

మహారాష్ట్రలోని విద్యాసంస్థల్లో విద్యార్థులు పెద్దఎత్తున కరోనా బారినపడుతున్నారు. తాజాగా వాషింలోని ఓ పాఠశాల వసతి గృహంలో 229 మంది విద్యార్థులు, నలుగురు

229 మంది విద్యార్థులకు  కరోనా

మహారాష్ట్ర వాషిం జిల్లా హాస్టల్‌లో ఘటన

దేశంలో 16,738 కొత్త కేసులు; 138 మరణాలు

తాజా పాజిటివ్‌లలో సగానికిపైగా మహారాష్ట్రవే

రాష్ట్రంలో వైరస్‌తో ఒక్క రోజే 80 మంది మృతి


వాషిం, ముంబై, ఫిబ్రవరి 25: మహారాష్ట్రలోని విద్యాసంస్థల్లో విద్యార్థులు పెద్దఎత్తున కరోనా బారినపడుతున్నారు. తాజాగా వాషింలోని ఓ పాఠశాల వసతి గృహంలో 229 మంది విద్యార్థులు, నలుగురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఈ ప్రాంతాన్ని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. భావన పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన ఈ హాస్టల్‌లో విదర్భలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 327 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా ఈ నెల 14న హాస్టల్‌లో చేరారు. కొద్ది రోజుల్లోనే 21 మందికి వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో మొత్తం విద్యార్థులకు పరీక్షలు చేశారు. బాధితుల సంఖ్య పెరిగింది. కాగా, మూడు రోజుల క్రితం లాతూర్‌ జిల్లాలోని ఓ హాస్టల్‌లో 39 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బందికి వైర్‌సకు గురైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో బుధవారం ఏకంగా 8,807 మందికి కరోనా నిర్ధారణ అయింది. 80 మంది చనిపోయారు. అక్టోబరు 21 (81,42) తర్వాత ఆ రాష్ట్రంలో ఇవే అత్యధిక కేసులు. మరోవైపు నిన్నమొన్నటివరకు 30 లోపు ఉన్న మరణాలు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  


కట్టడి లేకుంటే.. ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి

విదర్భ కేంద్రంగా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్కడినుంచి పుణె, ముంబైలకు పాకుతోందని భావిస్తున్నారు. అదుపు చేయలేకపోతే కచ్చితంగా మిగతా రాష్ట్రాలకూ వ్యాపించే ప్రమాదం ఉందని కొవిడ్‌-19పై మహారాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక కమిటీ సలహాదారు డాక్టర్‌ సుభాష్‌ సాలుంకే స్పష్టం చేశారు. దీనిని కరోనా రెండో దశగా మాత్రం చెప్పలేమని తెలిపారు. వైరస్‌ స్వభావంలో మార్పు, ఉత్పరివర్తనం, వ్యాప్తి సామర్థ్యం, కరోనా సోకిన వ్యక్తి ద్వారా ఇతరులకు సోకడం, వాతావరణ మార్పులే తాజా కేసుల పెరుగుదలకు కారణమని సాలుంకే పేర్కొన్నారు. అమరావతి, యావత్మల్‌ జిల్లాల్లో కనిపించిన మ్యుటేషన్లు ప్రస్తుత పరిస్థితికి కారణం కాకపోవచ్చన్న ఐసీఎంఆర్‌ ప్రకటనను సాలుంకే ప్రస్తావించారు. కొత్తగా మరేదైనా మ్యుటేషన్‌ ఉందా? లేదా? అన్నది కూడా ఐసీఎంఆర్‌ తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల నుంచి పుణె ఎన్‌ఐవీ, ఢిల్లీలోని ఎన్సీడీసీ, ఇతర ల్యాబ్‌లకు పంపామని.. వాటి విశ్లేషణ సమాచారం నెలాఖరుకు అందుతుందని సాలుంకే ప్రకటించారు.


నెల తర్వాత దేశంలో 15 వేల కేసులు

దేశంలో బుధవారం 16,738 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. దాదాపు నెల తర్వాత కొత్త కేసులు 15 వేలు దాటాయి. వైర్‌సతో తాజాగా 138 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ మృతులు 130 పైగా ఈ నెలలో ఇదే ప్రథమం. కాగా, కొత్త పాజిటివ్‌లు, మరణాల్లో మహారాష్ట్ర (8,807-80) వాటానే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల రీత్యా.. వైరస్‌ నిరోధానికి చర్యలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఉపాధి కోల్పోయి యూఏఈ నుంచి తిరిగొస్తున్న తమకు విమానాశ్రయాల్లో సొంత ఖర్చుతో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవడం ఆర్థికంగా భారమని, దీనినుంచి మినహాయింపు లేదా ప్రభుత్వమే భరించాలని ప్రవాసులు కోరుతున్నారు. యూఏఈలో బయల్దేరేటప్పుడే 12 ఏళ్లలోపు పిల్లలకు పరీక్షలు చేస్తున్నందున.. వారికి మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి విన్నవిస్తున్నారు.

Updated Date - 2021-02-26T09:31:43+05:30 IST