కేజీహెచ్‌ ఉద్యోగినికి కరోనా

ABN , First Publish Date - 2020-06-04T09:08:44+05:30 IST

ఉత్తరాంధ్ర వైద్యదాయని, రోగులపాలిట కల్పవల్లిగా భావించే నగరంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిలో ఓ మహిళా ఉద్యోగి కరోనా ..

కేజీహెచ్‌ ఉద్యోగినికి కరోనా

 ట్రామాకేర్‌ సెంటర్‌లో గత కొన్నాళ్లుగా విధులు

ఐదు రోజుల నుంచి జ్వరంతోనే రోగులకు సేవలు

తాజాగా పాజిటివ్‌ అని తేలడంతో ఉద్యోగుల్లో ఆందోళన

హుటాహుటిన క్వారంటైన్‌కు తరలించిన అధికారులు

ఆ విభాగం రోగులు నలుగురు ఐసోలేషన్‌ వార్డుకు

ఆమెతో కాంటాక్ట్‌ ఉన్నవారు 34 మంది గుర్తింపు


మహారాణిపేట, జూన్‌ 3:ఉత్తరాంధ్ర వైద్యదాయని, రోగులపాలిట కల్పవల్లిగా భావించే నగరంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిలో ఓ మహిళా ఉద్యోగి కరోనా బారినపడ్డారన్న వార్త కలకలం రేపుతోంది. ఆస్పత్రి అత్యవసర విభాగాల్లో ఒకటైన ట్రామాకేర్‌ సెంటర్‌లో కొన్నాళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఈమె వైరస్‌ బారిన పడ్డారన్న సమాచారంతోపాటు, జ్వరంతోనే ఐదు రోజులు పనిచేశారని తెలియడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలయ్యింది. వివరాల్లోకి వెళితే...జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన నలభై ఏళ్ల ఈ మహిళ ఎఫ్‌ఎంఎన్‌ఓ (ఆయా)గా పనిచేస్తోంది. రోస్టర్‌ ప్రకారం ట్రామాకేర్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తోంది. ఇంట్లో ఉన్న ఆమె భర్త కొన్నాళ్లుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనిది సాధారణ జ్వరంగానే ఆమె భావించింది. కానీ ఐదురోజుల క్రితం ఆమెకు కూడా జ్వరం సోకింది.


అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతూనే విధులు నిర్వహిస్తోంది. దీన్ని గుర్తించిన తోటి ఉద్యోగులు పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించడంతో టెస్ట్‌ చేయించుకుంది. మంగళవారం సాయంత్రం అందిన నివేదికలో ‘పాజిటివ్‌’ అని తేలడం ఒక్కసారిగా కలకలం మొదలయ్యింది. వెంటనే మెను కోవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె విధుల్లో ఉన్నప్పుడు ఎవరెవరు ఆమెతో కలిసి పనిచేశారని ఆరాతీయడం మొదలు పెట్టారు. మొత్తం 34 మందిగా లెక్క తేలడంతో వీరందరికీ బుధవారం కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. అలాగే, ట్రామాకేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న నలుగురు రోగులను కూడా ఐసోలేషన్‌ వార్డుకు తరలించి కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరంతోనే ఐదురోజులపాటు ఈమె విధులు నిర్వహించడంతో ఇంకెంత మందికి వైరస్‌ సోకిందో అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆమెతో పనిచేసిన స్వీపర్‌లో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తుండడంతో మిగిలిన వారి విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు.  

Updated Date - 2020-06-04T09:08:44+05:30 IST