ఐఏఎస్‌లకు కరోనా

ABN , First Publish Date - 2021-05-07T05:29:36+05:30 IST

. జిల్లాలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కలెక్టర్‌ వినయ్‌చంద్‌ రెండు రోజులుగా కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు.

ఐఏఎస్‌లకు కరోనా

బాధితుల జాబితాలో జిల్లా కలెక్టర్‌, ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లు, జీవీఎంసీ కమిషనర్‌, వీఎంఆర్‌డీఏ సెక్రటరీ, జిల్లా రెవెన్యూ అధికారి, విశాఖపట్నం ఆర్‌డీఓ 

మంత్రి ముత్తంశెట్టి ఇంట్లో ముగ్గురికి

అంతా ఇంటి నుంచే పాలన

కొత్తగా 1,927 కేసులు..11 మంది మృతి

మొత్తం కేసులు 91,732

ఆస్పత్రుల్లో ఉన్నది 15,873


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


కరోనా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ చుట్టేస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా...ఎక్కడో జరిగిన చిన్న పొరపాటు కారణంగా వైరస్‌ సోకుతోంది. జిల్లాలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కలెక్టర్‌ వినయ్‌చంద్‌ రెండు రోజులుగా కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. గురువారం పాజిటివ్‌ అని తేలింది. జాయింట్‌ కలెక్టర్లు వేణుగోపాల్‌రెడ్డి, అరుణ్‌బాబు, గోవిందరావులు కొద్దిరోజుల తేడాతో కరోనా బారినపడ్డారు. అంతా ఇంటి దగ్గరే వుంటూ చికిత్స తీసుకుంటూ, అక్కడి నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్‌ సృజనకు కూడా మూడు రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. ఆమె కూడా బంగ్లా నుంచే అన్నీ చూసుకుంటున్నారు. ఇటీవలె ఐఏఎస్‌ హోదా పొందిన వీఎంఆర్‌డీఏ సెక్రటరీ గణేశ్‌కుమార్‌ కరోనాతో సెలవులో వెళ్లారు. జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్‌, విశాఖపట్నం ఆర్‌డీఓ పెంచల కిశోర్‌ కూడా బాధితులే. జిల్లాలో కీలకమైన అధికారులంతా కరోనా కబంధ హస్తాల్లో ఇరుక్కున్నారు. హోమ్‌ ఐసోలేషన్‌లో వుంటూ చికిత్స పొందుతున్నారు. 


ఇక వీఎంఆర్‌డీఏ విషయానికి వస్తే...రెవెన్యూ విభాగంలో ఆర్‌ఐ నాగేశ్వరరావు కరోనాతో రెండు రోజుల క్రితమే చనిపోయారు. వీఎంఆర్‌డీఏలో మరో 20 మంది కరోనాతో బాధ పడుతున్నారు. ఎస్టేట్‌, ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, కమిషనర్‌ పేషీ, అకౌంట్స్‌, పీసీపీఐఆర్‌ ఇలా అన్ని విభాగాల్లోను బాధితులు ఉన్నారు. ఉద్యోగుల్లో చాలామంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. బీచ్‌రోడ్డులోని కురుసుర సబ్‌మెరైన్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కరోనాతో మృతిచెందారు. 


మంత్రి ముత్తంశెట్టి ఇంట్లో...


పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సతీమణి జ్ఞానేశ్వరి, ఆయన సోదరుడు, భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మహేశ్‌, పీఏకి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరంతా కొద్దిరోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాసరావు కూడా ఇంటికే పరిమితమై...అక్కడి నుంచే వ్యవహారాలు చూసుకుంటున్నారు. జిల్లా, నియోజకవర్గ ప్రజలకు ఏదైనా అవసరం వుంటే తన సహాయకులు కృష్ణంనాయుడు (9000980146), రామారావు (9966950171), చంద్రశేఖర్‌ (8008000268)లను సంప్రతించాలని సూచించారు. 


కొత్తగా 1,927 కేసులు.. 11 మంది మృతి


జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అదే సంఖ్యలో రోగులు కోలుకొని ఇళ్లకు వెళుతున్నారు. విమ్స్‌, కేజీహెచ్‌ కొవిడ్‌ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు కూడా బాధితులకు అవసరమైన వైద్యం అందిస్తుండడంతో చాలామంది ఆరోగ్యం మెరుగై సంతోషంగా ఇంటి ముఖం పడుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించినా తగిన వైద్యం, జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినవారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వున్నవారు ప్రాణాలు కోల్పోతున్నారు. గురువారం కొత్తగా 1,927 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,732కి చేరింది. కరోనాతో మరో 11 మంది మరణించారు. వీటితో కలిపి మృతుల సంఖ్య 666కి చేరింది. కాగా, ఒక్క గురువారమే 1,246 మంది డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లారు. ఇది ఒక రికార్డు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 15,873 మంది చికిత్స పొందుతున్నారు. 


కర్ఫ్యూ పాస్‌లు జారీ


ప్రభుత్వ శాఖలకు ఆరు వేలు

పరిశ్రమలకు  27,000


విశాఖపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి): కర్ఫ్యూ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పాస్‌లు జారీచేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ బాధ్యతను జిల్లా పంచాయతీ అధికారి వి.కృష్ణకుమారికి అప్పగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ఆరు వేల పాస్‌లు కేటాయించారు. వీటి ని నగరంతో పాటు డివిజన్‌, మండల కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇవ్వనున్నారు. అయితే సంబంధిత కార్యాలయ అధికారి నేరుగా జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని సంప్రతించి పాస్‌లు పొందాలని డీపీవో కృష్ణకుమారి తెలిపారు. ఇక పరిశ్రమలు, వాటి అనుబంధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల కోసం మరో 27 వేల పాస్‌లను జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌కు ఇచ్చారు. ఆయన వాటిని ఆయా పరిశ్రమలకు పంపిణీ చేస్తున్నారు. పరిశ్రమల్లో ముఖ్యంగా ఫార్మా, ఇతర అత్యవసర పరిశ్రమలకు ప్రాఽధాన్యం ఇవ్వనున్నారు. వాహనాలకు సంబంధించి పాస్‌ల జారీని ఇప్పటివరకు ప్రారంభించలేదు.

Updated Date - 2021-05-07T05:29:36+05:30 IST