వణికిస్తున్న వైరస్‌

ABN , First Publish Date - 2020-06-06T11:05:28+05:30 IST

గ్రేటర్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైద్యులు, పోలీసులు వైరస్‌ బారిన పడుతున్నారు. దీంతో ఆయా వర్గాల్లో

వణికిస్తున్న వైరస్‌

వైద్యులు, పోలీసులకు కరోనా 

ఆందోళనలో ఆయా వర్గాలు 

మలక్‌పేటలో ఏడుగురికి పాజిటివ్‌


లంగర్‌హౌస్‌/నార్సింగ్‌/ఎర్రగడ్డ/బర్కత్‌పుర/ బంజారాహిల్స్‌/మదీన/చార్మినార్‌/రామంతాపూర్‌/ బోయిన్‌పల్లి/రాంనగర్‌/ముషీరాబాద్‌/చిక్కడపల్లి/ చాదర్‌ఘాట్‌/రాజేంద్రనగర్‌/మారేడ్‌పల్లి/మంగళ్‌ట్‌/బోడుప్పల్‌/కుత్బుల్లాపూర్‌/ఎల్‌బీనగర్‌/ వనస్థలి పురం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైద్యులు, పోలీసులు వైరస్‌ బారిన పడుతున్నారు. దీంతో ఆయా వర్గాల్లో ఆందోళన నెలకొంది. మలక్‌పేటలో వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది.


నిమ్స్‌ ఉద్యోగికి కరోనా..

నిమ్స్‌లో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. లంగర్‌హౌస్‌ అంబేడ్కర్‌నగర్‌లో నివసిస్తున్న ఆయన రెండు రోజుల నుంచి దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం ఉండడంతో స్థానికంగా గల ఓ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా లక్షణాలు ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. వైద్య సిబ్బంది అతడు నివసిస్తున్న ప్రాంతంలో ఇంటింటి సర్వే చేపట్టారు. 


కార్పొరేటర్‌ భర్తకు.. 

బండ్లగూడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓ కార్పొరేటర్‌ భర్తకు కరోనా సోకింది. తీవ్రమైన జ్వరం రావడంతో నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన ఇంట్లో సైబరాబాద్‌లో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐ ఉంటున్నట్లు సమాచారం. రెండురోజుల క్రితం కార్పొరేటర్‌ ఇంట్లో సహపంక్తి భోజనానికి పదిమంది కార్పొరేటర్లు వచ్చారని హైదర్షాకోట్‌ ప్రజలు అంటున్నారు. కార్పొరేటర్‌ భర్తతో కలిసి తిరిగిన వారు భయపడుతున్నారు. 


ఆయుర్వేద ఆస్పత్రిలో ఆరుగురికి.. 

ఆయుర్వేద ఆస్పత్రిలో శుక్రవారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 65 పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు. ఛాతీ ఆస్పత్రిలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైందని, ప్రస్తుతం మూడు కేసులకు చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు.  


రేడియో అంకాలజిస్టుకు... 

బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో రేడియో అంకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్‌(55)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన కాచిగూడలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. కృష్ణానగర్‌లో నివసిస్తున్న ఓ మహిళ(57) కరోనాతో మృతి చెందింది.  ఆమె భర్త, ఇద్దరు పిల్లలను హోం క్వారంటైన్‌లో ఉంచారు. నెహ్రూనగర్‌లో ఉంటున్న మహిళ(54), లింగంపల్లిలో ఉంటున్న వ్యక్తి(35)కి కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రికి తరలించామని ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ హేమలత తెలిపారు. 


కేన్సర్‌ రోగికి.. 

కేన్సర్‌ చికిత్స కోసం నగరానికి వచ్చిన ఏపీకి చెందిన వృద్ధుడికి కరోనా సోకింది. విశాఖపట్నానికి చెందిన అతడు కేన్సర్‌తో బాధపడుతున్నాడు. మూడు నెలల క్రితం నగరానికి వచ్చి ఓ లాడ్జిలో ఉంటూ బంజారాహిల్స్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత నెల 29న శస్త్ర చికిత్స నిర్వహించారు. మూడు రోజుల అనంతరం ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. పరీక్షలు చేయగా కరోనా అని తేలింది. ప్రస్తుతం అతడు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వృద్ధుడి భార్య, ఇద్దరు బంధువులు, శస్త్రచికిత్స చేసిన ఇద్దరు వై ద్యులతోపాటు నలుగురు నర్సులను క్వారంటైన్‌ చేశారు. 


యువకుడికి.. 

బంజారాహిల్స్‌ రేషన్‌బాగ్‌లో నివసిస్తున్న ఓ యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


బ్యాంక్‌ తనిఖీకి వెళ్లిన అధికారికి..

విఽధి నిర్వహణలో భాగంగా బ్యాంక్‌ తనిఖీకి వెళ్లిన ఉన్నతాధికారికి కరోనా సోకింది. మూసాబౌలిలోగల ఎస్‌బీఐ హుస్సేనీఆలం బ్రాంచ్‌కి గతనెల 30న ఓ ఉన్నతాధికారి తనిఖీ కోసం వెళ్లారు. ఆయనకు ఈనెల 3వ తేదీన పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బ్యాంక్‌లో పనిచేస్తున్న పదిమంది ఉద్యోగులకు హోం క్వారంటైన్‌ విధించారు. వీరిలో ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అధికారి అదేరోజు మరో మూడు బ్రాంచ్‌లకు తనిఖీ కోసం వెళ్లినట్లు సమాచారం. 


కిషన్‌బాగ్‌లో ఇద్దరికి..

కిషన్‌బాగ్‌లో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ఎంఓ కాలనీకి చెందిన ఓ వ్యక్తి(49) తోపుడు బండిపై కూరగాయలు విక్రయిస్తుంటాడు. కొద్ది రోజుల నుంచి అస్వస్థతకు గురవడంతో అధికారులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొండారెడ్డిగూడకు చెందిన మరో వ్యక్తి(35) కూరగాయల హోల్‌సేల్‌ వ్యాపారి. ఇతడికి గురువారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  


చార్మినార్‌ పీఎ్‌సలో కానిస్టేబుల్‌కు 

జంగమ్మెట్‌లో నివసిస్తున్న ఓ కానిస్టేబుల్‌ చార్మినార్‌ పోలీ్‌సస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడు ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  


8 మంది డాక్టర్లు, ఇద్దరు పీజీ విద్యార్థులకు

పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శుక్రవారం 8 మంది వైద్యులు, ఇద్దరు పీజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకేసారి పదిమందికి కరోనా సోకడంతో ఆస్పత్రి వర్గాలు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నాయి. వైద్యులు, సిబ్బందికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులు కరోనా బారిన పడడంతో ఆస్పత్రికి రావడానికి పేషెంట్లు భయపడుతున్నారు.


కానిస్టేబుల్‌కు.. 

రామంతాపూర్‌ శ్రీనివాసపురంలో నివసిస్తూ యాదగిరిగుట్టలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతున్న అతడికి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేసి ఆ ప్రాంతాన్ని కట్టడి చేశారు. 


సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు.. 

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కరోనా బారిన పడ్డాడు. బోయిన్‌పల్లి చిన్నతోకట్ట హనుమాన్‌నగర్‌లో నివసిస్తున్న అతడు నాలుగు రోజుల క్రితం అనారోగ్యం బారిన పడడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులకు అనుమానం రావడంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లమని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


శ్రీరాంనగర్‌లో ఒకరికి.. 

బాగ్‌లింగంపల్లి శ్రీరాంనగర్‌లో నివసిస్తున్న వ్యక్తి(40) కరోనా బారిన పడ్డాడు. అతడికి అనారోగ్యంగా ఉండడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది అతడు నివసిస్తున్న ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.  


 ఎయిర్‌ ఇండియా ఉద్యోగికి.. 

ముషీరాబాద్‌ బాకారంలో నివసిస్తూ ఎయిర్‌ ఇండియాలో ఢిల్లీలో పనిచేస్తున్న మహిళా(50) ఉద్యోగికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి శంషాబాద్‌ వచ్చిన ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. ఆమెను తన ఇంట్లోనే హోం క్వారంటైన్‌ చేసినట్లు భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ వైద్యాధికారి కృష్ణమోహన్‌ తెలిపారు. ఆ మహిళకు ఇంటి వద్దనే వైద్య సేవలు అందిస్తున్నారు. 


బాగ్‌లింగంపల్లిలో గృహిణికి.. 

బాగ్‌లింగంపల్లిలో శుక్రవారం మరో కరోనా కేసు నమోదైంది. ఓ గృహిణి(32)కి పాజిటివ్‌ రావడంతో ఆమె నివాసాన్ని అధికారులు కట్టడి చేశారు. ఆమె భర్త లేబర్‌గా పనిచేస్తాడు. 


భార్యాభర్తలకు..

హైదర్‌గూడ సిరిమల్లెకాలనీలో ఉంటున్న మహిళ(52)అపోలో ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటోంది. ఆమెకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆమె భర్త(56)కు కూడా పరీక్షలు చేయగా పాజిటివ్‌ రావడంతో ఇద్దరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


హనుమాన్‌నగర్‌లో యువకుడికి.. 

రాజేంద్రనగర్‌ సమీపంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన యువకుడు(22) కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది.  


సులేమాన్‌నగర్‌లో ఒకరికి..

సులేమాన్‌నగర్‌కు చెందిన వ్యక్తి(58) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  


మహిళా వైద్యురాలికి..

మహేంద్రహిల్స్‌లో నివసిస్తూ నిమ్స్‌లో పనిచేస్తున్న మహిళా వైద్యురాలి(40)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  


కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యాధికారి తండ్రికి.. 

సికింద్రాబాద్‌లో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యాధికారి తండ్రి(91)కి కరోనా సోకింది. వైద్యాధికారికి నాలుగు రోజులక్రితం పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.  


హబీబ్‌నగర్‌ ఎస్‌ఐకి..

సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కరోనా బారిన పడ్డారు. శంషాబాద్‌లో నివసిస్తున్న ఎస్‌ఐ(55) హబీబ్‌నగర్‌ పీఎ్‌సలో పనిచేస్తున్నారు. మూడు రోజుల నుంచి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించిన మెడికల్‌ క్యాంప్‌లో అతడి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. శుక్రవారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో ఎస్‌ఐని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


పీజీ వైద్య విద్యార్థినికి..

పీజీ వైద్య విద్యార్థినికి కరోనా సోకింది. జియాగూడలో ఉంటున్న విద్యార్థిని పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఇటీవల విధులు నిర్వహించింది. ఆమెకు గురువారం కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈఎన్‌టీ ఆస్పత్రిలో పనిచేస్తున్న 60 మందికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరో 60 మంది శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆస్పత్రిలోని శస్త్ర చికిత్సాలయాన్ని మూసివేసినట్లు తెలిపారు. 


మంగళ్‌హాట్‌లో ఏడుగురికి..

మంగళ్‌హాట్‌లో మరో ఏడుగురికి కరోనా సోకింది. ఈనెల 4వ తేదీన శివలాల్‌నగర్‌కు చెందిన గర్భిణి మృతి చెందిన విషయం తెలిసిందే ఆమె తల్లి(53), తమ్ముడు (35), సోదరి(39), సోదరి కుమార్తె(16)కి అనారోగ్యంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించగా శుక్రవారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు.  


హెడ్‌ కానిస్టేబుల్‌కు..

మంగళ్‌హాట్‌లో ఉంటూ హుమాయున్‌నగర్‌ పీఎస్‌ లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌(54)కు రెండు రోజుల క్రితం జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిగా ఉండడంతో రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. శుక్రవారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు.  


మచ్చిపురాలో...

మచ్చిపురాలో ఉంటున్న మహిళ(60)కు కరోనా లక్షణాలు ఉండడంతో రెండు రోజుల క్రితం రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. శుక్రవారం రిపోర్టు రాగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. 


కిరాణాషాప్‌ నిర్వాహకుడికి..

మంగళ్‌హాట్‌ మార్కెట్‌లో కిరాణాషాపు నిర్వహిస్తున్న వ్యక్తి(24)రెండు రోజుల నుంచి దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. 


గాజులరామారం సర్కిల్‌లో ముగ్గురికి.. 

గాజులరామారం సర్కిల్‌ పరిధిలో మరో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జగద్గిరిగుట్ట సంజయ్‌పురికాలనీలో ఉంటున్న వృద్ధురాలు(60), రోడామేస్త్రినగర్‌కు చెందిన ఓ వ్యక్తి (50), గాజులరామారంలో నివసిస్తున్న మరో వ్యక్తి(53)కి పాజిటివ్‌ వచ్చింది.  


ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌లలో ఐదు.. 

ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌లలో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు వైద్యులు, ఒకరు ఇన్‌స్పెక్టర్‌. బండ్లగూడ న్యూనాగోల్‌ పద్మావతికాలనీకి చెందిన  వైద్యురాలు(28) గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. గతనెల 29న ఆమెకు జలుబు, దగ్గు రావడంతో నమూనాలు సేకరించి పరీక్షకు పంపగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


ఆమెకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె తండ్రి(54), తల్లి(48), సోదరి(27), సోదరుడు(26), భర్త(32)ను హోం క్వారంటైన్‌ చేశారు. ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ లింగోజిగూడ విజయపురికాలనీకి చెందిన వైద్యుడు(45) పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అతడి భార్య(40) పోలీసు శాఖలో కమ్యూనికేషన్ల విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నది. వారిరువురు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది.


విద్యుత్‌నగర్‌లో...

సరూర్‌నగర్‌ సర్కిల్‌ చైతన్యపురి విద్యుత్‌నగర్‌కు చెందిన వైద్యురాలు (37) పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.  


ఎన్జీవోస్‌ కాలనీలో వైద్యురాలికి..

వనస్థలిపురం, ఎన్జీవో్‌సకాలనీలో వైద్యురాలికి కరోనా సోకింది. ఆమె(22) పేట్లబురుజు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇటీవల జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. శుక్రవారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె తండ్రి, తల్లి, సోదరిని క్వారంటైన్‌ చేశారు. 


మలక్‌పేటలో.. 

మలక్‌పేటలో వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురికి కరోనా సోకింది. ఆజంపురాలో నివసిస్తూ ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న పీజీ డాక్టర్‌(25)కు కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడి ఇంట్లోని 12 మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ చేశారు. అదే ప్రాంతం మునిసిపల్‌ క్వార్టర్స్‌లో నివసిస్తూ కూకట్‌పల్లి సర్కిల్‌లో బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి(35) ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ డాక్టర్‌ వద్ద వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. గురువారం ఫీవర్‌ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. అతడి కుటుంబంలోని ఐదుగురిని క్వారంటైన్‌కు తరలించారు. 


చంచల్‌గూడ న్యూ రోడ్‌లో ఉంటున్న వృద్ధుడు (65)జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటుండగా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చంచల్‌గూడలో ఉంటూ కరోనా సోకి ఆరు రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి భార్యకు శుక్రవారం పాజిటివ్‌ వచ్చింది. ఆమె ఇద్దరి కుమారులను హోం క్వారంటైన్‌ చేశారు. ఆస్మాన్‌గఢ్‌లో ఉంటూ ఆర్టీసీ దిల్‌సుఖ్‌నగర్‌ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి (40) జ్వరంతో బాధపడుతున్నాడు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. అతడి భార్య, ఇద్దరు పిల్లలను క్వారంటైన్‌ చేశారు. ముసారాంబాగ్‌ శాలివాహననగర్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఉస్మానియా ఆస్పత్రి పీజీ వైద్యుడు అనుమానంతో గురువారం పరీక్షలు చేయించుకున్నాడు. శుక్రవారం వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సైదాబాద్‌లో ఉంటున్న కానిస్టేబుల్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. అతడి ముగ్గురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ చేశారు.


నిమ్స్‌ కార్డియాలజీ టెక్నీషియన్‌కు..

నిమ్స్‌ కార్డియాలజీ విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడు బోడుప్పల్‌ టెలిఫోన్‌ కాలనీలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం అతడికి నిమ్స్‌లోనే చికిత్స అందిస్తున్నారు. అతడి భార్యను హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. 


గర్భిణి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి 

శివలాల్‌నగర్‌లో ఉంటున్న గర్భిణి(33) కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహకారంతో పురానాపూల్‌లో అదేరోజు అర్ధరాత్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆమె కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2020-06-06T11:05:28+05:30 IST