ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వల్లే 8 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-03-29T09:10:29+05:30 IST

ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్లే రాష్ట్రంలో 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మతపరమైన కార్యక్రమాలను ఇంటికే పరిమితం

ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వల్లే 8 మందికి కరోనా

  • మత కార్యక్రమాలు ఇంట్లోనే  చేసుకోవాలి
  • క్వారంటైన్‌ వారు బయటికొస్తేచర్యలు
  • హైదరాబాద్‌లో రెడ్‌ జోన్లు ప్రకటించలేదు
  • 10 మంది కోలుకున్నారు:  మంత్రి ఈటల

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్లే రాష్ట్రంలో 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మతపరమైన కార్యక్రమాలను ఇంటికే పరిమితం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నమోదైన 6 కేసులకు ట్రావెల్‌ హిస్టరీ ఉందని, ఎలా వచ్చిందో చెప్పలేని పరిస్థితేమీ కాదన్నారు. రాష్ట్రంలో ఓ వృద్ధుడు (74) కరోనాతో మృతి చెందాడని, నగరానికి చెందిన ఆయన ఈనెల 14న ఢిల్లీలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లారని, తిరిగి 17న హైదరాబాద్‌ వచ్చారని, 20న ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో గ్లోబల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారని, అక్కడే చికిత్స పొందుతూ మరణించాడని వెల్లడించారు. సైఫాబాద్‌ పోలీసుల సాయంతో మృతదేహాన్ని గాంధీకి తరలించారని, అక్కడ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు.


ప్రస్తుతం అతడి భార్య, కుమారుడిని క్వారంటైన్‌లో ఉంచామన్నారు. తాజా పరిణా మం దృష్ట్యా అన్ని ఆస్పత్రుల్లో చనిపోయిన వారి వివరాలివ్వాలని ఆదేశించామన్నారు. ఇక, ప్రస్తుతం చికిత్స పొందుతున్న 65 మంది రోగుల్లో 10 మంది కోలుకున్నారని, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఎలాంటి రెడ్‌ జోన్లు ప్రకటించలేదని స్పష్టం చేశారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు బయట తిరిగితే పోలీసు కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో 13 వేల మంది ఉంటే.. వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. అనంతరం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యులు తాడూరి గంగాధర్‌, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డితో మంత్రి ఈటల సమావేశమై, తదుపరి కార్యాచరణపై సమీక్ష జరిపారు. 

Updated Date - 2020-03-29T09:10:29+05:30 IST