ఆగస్టు నాటికే..దేశ జనాభాలో 7% మందికి కరోనా

ABN , First Publish Date - 2020-11-28T08:07:08+05:30 IST

దేశ జనాభాలో పదేళ్లు పైబడిన వారిలో 7 శాతం మంది (7.43 కోట్ల మంది)కి ఆగస్టు నాటికే కరోనా సోకిందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) రెండో సీరో సర్వే పేర్కొంది. జన సాంద్రత రీత్యా పట్టణాలు, నగరాల్లో బాధితులు అధికంగా ఉన్నారని..

ఆగస్టు నాటికే..దేశ జనాభాలో 7% మందికి కరోనా

పదేళ్ల వయసు పైబడిన 7.4 కోట్ల మందికి వైరస్‌

మొత్తం 50ు మందికి కొవిడ్‌ సోకే అవకాశం

భారత వైద్య పరిశోధన మండలి రెండో సీరో సర్వే


న్యూఢిల్లీ, నవంబరు 27: దేశ జనాభాలో పదేళ్లు పైబడిన వారిలో 7 శాతం మంది (7.43 కోట్ల మంది)కి ఆగస్టు నాటికే కరోనా సోకిందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) రెండో సీరో సర్వే పేర్కొంది. జన సాంద్రత రీత్యా పట్టణాలు, నగరాల్లో బాధితులు అధికంగా ఉన్నారని.. అందులోనూ ప్రత్యేకించి మురికివాడల్లో ఎక్కువ ఉన్నారని తెలిపింది. లక్షణాలు లేని ప్రతి తొమ్మిది మందిలో ఒకరిలో యాంటీబాడీలు కనిపించాయని.. ఇది దేశంలోని సాధారణ జనాభాలో సీరో కన్వర్షన్‌ (యాంటీబాడీలు ఉత్పత్తయే స్థితి)ను సూచిస్తుందని వివరించింది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ అధ్యయనం వివరాలు లాన్సెన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దేశంలో 10 శాతం కంటే తక్కువగా ఉన్న సీరో ప్రివెలెన్స్‌.. పెద్దఎత్తున జనాభా వైరస్‌ బారినపడే అవకాశం ఉందని సూచిస్తోందని పేర్కొంది. ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేవరకు లేదా టీకా వచ్చేవరకు చాలా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఈ ప్రకారం జనాభాలో 50 శాతం మందికి వైరస్‌ సోకే వీలుంది.


పదేళ్లు పైబడిన వారిలో ప్రతి 15 మందిలో ఒకరు ఆగస్టు నాటికి కరోనా బారినపడ్డారు. యుక్త వయసు వారిలో వైరస్‌ వ్యాప్తి తీవ్రత ఆగస్టు- మే నెలల మధ్యలో పది రెట్లు పెరిగింది’ అని విశ్లేషించింది. పరీక్షలు పెంచడంతో మే నెలలో కంటే ఆగస్టులో ఇన్ఫెక్షన్‌ రేటు తగ్గిందని ఐసీఎంఆర్‌ పేర్కొంది. మే నెలలో ఒకరి ద్వారా 82 నుంచి 131 మందికి వ్యాప్తి ఉండగా.. ఆగస్టుకు వచ్చేసరికి అది 26-32కు తగ్గిందని తెలిపింది. సీరో ప్రివలెన్స్‌ ముంబై మురికివాడల్లో అత్యధికం(57.8శాతం)గా, ఇతర ప్రాంతాల్లో 17.4 శాతం ఉందని వివరించింది. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యాప్తి పెరగనుందని సూచించింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు మధ్య70 జిల్లాల్లో 29,082 మందిపై ఐసీఎంఆర్‌ సీరో సర్వే నిర్వహించగా.. 3,135 మందిలో యాంటీబాడీలున్నట్లు తేలింది. యుక్త వయస్కుల్లో సీరోప్రివలెన్స్‌ మే నెలతో పోలిస్తే ఆగస్టులో పది రెట్లు పెరిగింది. 

Updated Date - 2020-11-28T08:07:08+05:30 IST