3 గురుకులాల్లో 39 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-12-03T14:22:16+05:30 IST

రాష్ట్రంలోని గురుకులాల్లో కరోనా కేసులు వరుసగా వెలుగుచూస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలోని..

3 గురుకులాల్లో 39 మందికి కరోనా

ఇంద్రేశంలో 27 మందికి కొవిడ్‌ 

జగిత్యాల జిల్లాలో 9 మందికి.. 

జూలూరుపాడులో ముగ్గురికి

కొవిడ్‌ బారిన సూర్యాపేట డీఎంహెచ్‌వో కుటుంబం

జర్మనీ నుంచి వచ్చిన కుమారుడు

గత నెలలో కుటుంబం తిరుపతికి

బుధవారం పరీక్షల్లో వైద్యాధికారి ఇంట్లో ఆరుగురికి పాజిటివ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలోని గురుకులాల్లో కరోనా కేసులు వరుసగా వెలుగుచూస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలోని మహత్మా జ్యోతిరావ్‌ ఫూలే బాలికల గురుకుల పాఠశాలలోని 27 మంది విద్యార్థినులకు గురువారం పాజిటివ్‌ వచ్చింది. అనారోగ్యంతో ఉన్న ఒక విద్యార్థినికి బుధవారం పరీక్ష చేయగా వైరస్‌ నిర్ధారణ అయింది. దీందో అదే రోజు 20 మందికి, గురువారం 300 మందికి టెస్టులు చేశారు. మొత్తం 27 మందికి పాజిటివ్‌ వచ్చింది. పాఠశాలలో ఐసొలేట్‌ చేశారు. వీరిలో ఎవరికీ లక్షణాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వచ్చి కలుస్తున్నారని వారిలో ఎవరినుంచైనా కొవిడ్‌ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఏ మాత్రం నలతగా కనిపించినా వెంటనే పరీక్షలు జరిపించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రీ దేవి తెలిపారు. కాగా, ఇదే మండలంలోని ముత్తంగిలోని జ్యోతిరావు ఫూలే బాలికల గురుకులంలో  నాలుగు రోజుల క్రితం 48 మందికి పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది. మరోవైపు జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపెల్లి బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కొంతమంది విద్యార్థినులు ఇటీవలఇళ్లకు వెళ్లి వచ్చారు. వారిలో ఒకరు అస్వస్థతకు గురికాగా మంగళవారం వైద్య పరీక్షలు చేయించారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తరగతిలోని 75 మందికి బుధవారం పరీక్షలు చేశారు. పాజిటివ్‌లందరినీ ఇళ్లకు పంపించారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కస్తూర్బా కళాశాలలో ముగ్గురు విద్యార్థినులకు పాజిటివ్‌ వచ్చింది. గురువారం వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి చెందిన నలుగురు బాలికలు  రెండు రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. ప్రత్యేక అధికారి పద్మజ వారినిప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్ష చేయించారు. వారిలో ముగ్గురు బాలికలకు కరోనా నిర్ధారణ అయింది. 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులు, సిబ్బంది మొత్తం 204 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. కాగా, రాష్ట్రంలో గురువారం 36,833 మందికి పరీక్షలు చేయగా 189 మందికి పాజిటివ్‌ వచ్చింది. మరో ఇద్దరు మృతిచెందారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 77 వచ్చాయి. ఇంకా 3,680 యాక్టివ్‌ కేసులున్నాయి.


వ్యాక్సినేషన్‌లో నిర్లక్ష్యం.. వైద్యుడి సస్పెన్షన్‌

వ్యాక్సినేషన్‌లో నిర్లక్ష్యం వహించినందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండల వైద్యాధికారి డాక్టర్‌ ప్రతాప్‌ చౌహాన్‌ను జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు సస్పెండ్‌ చేశారు. 15 రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం నిర్దేశించగా దానిని అందుకోలేకపోయారు. అదనపు కలెక్టర్‌ నందలాల్‌ పవార్‌ గురువారం ఆకస్మిక తనిఖీకి వెళ్లినపుడు డాక్టర్‌ ప్రతాప్‌ చౌహాన్‌ విధుల్లో లేరు. దీంతో ఆయనను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. 


కరోనా బారిన డీఎంహెచ్‌వో కుటుంబం

సూర్యాపేట డీఎంహెచ్‌వో కోటా చలం, ఆయన కుటుంబం కరోనా బారిన పడింది. ఆయన ఇంట్లో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నెల 1నే వీరికి వైరస్‌ నిర్ధారణ కాగా గురువారం వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌ కోటా చలం చిన్న కుమారుడు జర్మనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 14 రోజుల కిందట స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్‌వో కుటుంబం గత నెల 27న తిరుమల వెళ్లింది. 30న నల్లగొండకు వచ్చారు. అక్కడినుంచి డీఎంహెచ్‌వో స్వగ్రామం వెళ్లారు. ఈ నెల 1న చిన్న కుమారుడికి నలతగా ఉండటంతో కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చింది. మిగతా కుటుంబ సభ్యులు టెస్టులు చేయించుకున్నారు. డీఎంహెచ్‌వో భార్య, పెద్ద కుమారుడు, కోడలు, మనుమడికి పాజిటివ్‌ తేలింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్‌లో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కోటా చలం ఎయిడ్స్‌ నివారణ దినం కార్యక్రమంలో సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. దీంతో వారంతా పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్న జర్మనీ నుంచి డీఎంహెచ్‌వో కుమారుడు రావడం.. అతడికి అక్కడ ఉండగానే వైరస్‌ సోకిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా తిరుపతి ప్రయాణంలో వీరంతా వైరస్‌ బారినపడ్డారా? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-12-03T14:22:16+05:30 IST