17 మంది వలస కూలీలకు కరోనా

ABN , First Publish Date - 2020-05-21T11:05:05+05:30 IST

ఉపాధి కోసం మహారా ష్ట్రకు వెళ్లి తిరిగి వచ్చిన 17 మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు రావడంతో స్థానికులు

17 మంది వలస కూలీలకు కరోనా

భయాందోళనలో పెనుకొండవాసులు


పెనుకొండ టౌన్‌, మే 20 :  ఉపాధి కోసం మహారా ష్ట్రకు వెళ్లి తిరిగి వచ్చిన 17 మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సోమందేపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు మహారాష్ట్రలో జీవనోపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరిలో 40 మంది మూడు రోజుల కిందట సోమందేపల్లికి చేరుకున్నారు. 20 మందిని సోమందేపల్లిలో.. మరో 20 మందిని పెనుకొండ క్వారంటైన్‌లో ఉంచారు. వైద్య పరీక్షల్లో తొలుత ముగ్గురు మహిళలకు పాజిటివ్‌ రాగా బుధవారం మరో 14 మందికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలినట్లు సమాచారం. వీరిలో ఎనిమిది మంది పురుషులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. 11 మంది సోమందేపల్లి మండలవాసులు, ఐదుగురు గోనిపేట, ఒకరు చిలమత్తూరు గ్రామానికి చెందిన వారున్నారు.


క్వారంటైన్‌ వైద్యులు రెండోసారి కరోనా పరీక్షలకు వారి శాంపిళ్లను అనంతపురం, బత్తలపల్లికి పంపారు. ఇప్పటికే గృహాల మధ్య ఉన్న క్వారంటైన్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలని మంగళవారం అర్ధరాత్రి పాత జాతీయ రహదారిపై స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. సీఐ శ్రీహరి, తహసీల్దార్‌ నాగరాజు సర్దిచెప్పి సమస్యను పరిష్కరించారు.  వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నాయని తెలిసినప్పటి నుంచి సేఫ్‌జోన్‌లో ఉన్న పెనుకొండవాసులు భయాందోళన చెందుతున్నారు.  

Updated Date - 2020-05-21T11:05:05+05:30 IST