జిల్లాను చుట్టేసింది..!

ABN , First Publish Date - 2020-07-12T10:09:46+05:30 IST

మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. జిల్లా మొత్తాన్ని చుట్టేసింది. గ్రామసీమలను సైతం వదల్లేదు.

జిల్లాను చుట్టేసింది..!

15 రోజుల్లో 1,045 మందికి కరోనా

శనివారం ఒక్క రోజే 48 కేసులు

జిల్లాలో 1,831కి చేరిన బాధితులు

కడప నగరంలో కట్టడికాని వైరస్‌

భయం.. భయంగా జన జీవనం


(కడప - ఆంధ్రజ్యోతి): మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. జిల్లా మొత్తాన్ని చుట్టేసింది. గ్రామసీమలను సైతం వదల్లేదు. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. ఏప్రిల్‌1 నుంచి శనివారం నాటికి 102 రోజుల్లో 1,831 కేసులు నమోదైతే... ఈ 15 రోజుల్లోనే 1,045 కేసులు నమోదు కావడం భయం గొలిపే విషయం. అత్యధికంగా కడప నగరంలో 418 మంది కరోనా బారిన పడ్డారు. ప్రతి మండలంలో కరోనా బాధితులున్నారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల పట్టణాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఆ వివరాలు ఇలా.. 


1,831 చేరిన బాధితులు

కరోనా మహమ్మారికి కళ్లెం వేయలేక పోతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో జనం భయం లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. శనివారం ఒక్క రోజే 48 మందికి పాజిటివ్‌ నిర్ధారణయింది. వీటితో కలిపి 1,831కి బాధితులు చేరారు. శనివారం కడప నగరంలో 20 కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరు పట్టణాన్ని దాటి కడపలో బాధితుల సంఖ్య 418కి చేరింది. ప్రొద్దుటూరు 5, రైల్వే కోడూరు, సీకే దిన్నెలో మూడు చొప్పున, రాజంపేట, లక్కిరెడ్డిపల్లి, పెండ్లిమర్రి మండలాల్లో రెండేసి, జమ్మలమడుగు, ఓబులవారిపల్లె, రాయచోటి, వేంపల్లి, సింహాద్రిపురం, బద్వేలు, వీఎన్‌పల్లి, మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట మండలాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. అలాగే.. జిల్లా కోవిద్‌-19 ఆస్పత్రి ఫాతిమా మెడికల్‌ కళాశాలలో చికిత్స పొందుతున్న 63 మంది శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికి రూ.2 వేలు అందజేసినట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


15 రోజుల్లో 1,045 మందికి వ్యాప్తి

మార్చి 22న జనతా కర్ఫ్యూ.. 24వ తేది నుంచి లాక్‌డౌన్‌ విధించారు. ఏప్రిల్‌ 1న జిల్లాలో కరోనా కేసులు వెలుగుచూశాయి. అప్పటి నుంచి 102 రోజుల్లో 1,831 కేసులు నమోదయ్యాయి. జూన్‌ 27వ తేది వరకు 88 రోజుల్లో 786 మంది కరోనా బారిన పడ్డారు. అంటే.. రోజుకు సగటున 9 మందికి కరోనా వ్యాపించింది. జూన్‌ 27వ తేది నుంచి ఈ నెల 11 వరకు 15 రోజుల్లో 1,045 మందికి వ్యాపించింది. ఈ లెక్కన రోజుకు సగటున 70 మంది కరోనా బారిన పడ్డారు. అంటే.. కరోనా కర్కసి జనంపై ఏ స్థాయిలో దాడి చేస్తోందో ఇట్టే తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తమై స్వీయ రక్షణ చర్యలు చేపట్టకపోతే తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.


కోలుకున్న బాధితులు 985 మంది

కరోనాను జయించి ఇప్పటివరకు 985 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. జిల్లా కోవిడ్‌-19 ఆస్పత్రి కడప ఫాతిమా మెడికల్‌ కళాశాల, కోవిడ్‌-19 సెంటర్లు గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంకా 846 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 88,042 శాంపుల్స్‌ తీస్తే.. 83,008 ఫలితాలు రాగా.. 1,831 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అంటే.. 2.20 శాతం మంది వైరస్‌ బారిన పడుతున్నారు. 8 మంది మృత్యుఒడి చేరినట్లు అధికారులు తెలిపారు. బాధితులలో మరణాల సంఖ్య కేవలం 0.43 శాతమే. కరోనా బారిన పడినా 99.57 శాతం వైర్‌సను జయించి ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటున్నారు. జిల్లాలో కడప నగరం, ప్రొద్దుటూరు, పులివెందుల పట్టణాల్లో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. కడపలో 418 మంది, ప్రొద్దుటూరు పట్టణంలో 343 మంది, పులివెందులలో 170 మంది కరోనా బారిన పడ్డారు. మైలవరం మండలం నవాబుపేటలో కరోనా కేసులు వేగంగా వంద దాటినా.. ఆ తరువాత అక్కడ కట్టడిలోకి వచ్చింది. అయితే జిల్లాలోని  ప్రతి మండలంలోనూ కరోనా కేసులు నమోదు అవుతుండడం అందరినీ భయానికి గురిచేస్తోంది.


ఏ నెలలో ఎన్ని కేసులు

నెల కేసులు

ఏప్రిల్‌ 15

మే 121

జూన్‌ 963

జూలై 732 (11వ తేది నాటికి)

మొత్తం 1,831

Updated Date - 2020-07-12T10:09:46+05:30 IST