జనరల్‌ ఆస్పత్రిలో కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2022-01-18T04:59:45+05:30 IST

కరోనా వైరస్‌ జనరల్‌ ఆస్పత్రిలో కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగు తున్నాయి.

జనరల్‌ ఆస్పత్రిలో కరోనా కల్లోలం
కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్న గర్భిణులు

- 20 మంది వైద్యులు, 18 మంది

     వైద్య సిబ్బందికి పాజిటివ్‌

- ప్రసూతి విభాగానికి అంటుకున్న వైరస్‌

- ఉమ్మడి జిల్లాల నుంచి

    రెఫర్‌ అవుతున్న కేసులు

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) జనవరి 17: కరోనా వైరస్‌ జనరల్‌ ఆస్పత్రిలో కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగు తున్నాయి. రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆస్పత్రిలో పనిచేసే 20మంది డాక్టర్లు, 18 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. ముఖ్యంగా ప్ర సూతి విభాగానికి వైరస్‌ సెగ అంటుకుంది. కాన్పు కోసం వచ్చే గర్భిణులకు పరీక్షలు చేయగా అందులో పాజిటివ్‌ చాలా మందికి తేలుతోంది. ఈ వారం రోజుల్లో దాదాపు 22మంది గర్భిణులకు వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అయితే చాలా వరకు కేసులు ఉమ్మడి జిల్లాల నుంచి జనరల్‌ ఆసుపత్రికి రెఫర్‌ అవుతున్నాయి. 

 ఆస్పత్రిలో పెరుగుతున్న కేసులు..

ఆరునెలలుగా ప్రశాంతంగా ఉన్న జనరల్‌ ఆస్పత్రి 10రోజుల నుంచి పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం తో ఆందోళన కలిగిస్తోంది.  150 పడకలతో గత రెండేళ్ల క్రితం ప్రారంభించిన కొవిడ్‌ వార్డుకు కరోనా రోగుల రాక ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 70మందికిపైగా చికిత్సపొందుతున్నారు. అందులో 43 మంది పాజిటివ్‌ ఉండగా.. మిగతా మంది లక్షణాల తో అడ్మిట్‌ అయ్యారు.

 వైద్యులు, వైద్య సిబ్బందికి వైరస్‌..

జనరల్‌ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ వారం రో జుల్లో 20మంది వైద్యులకు పాజిటివ్‌ వచ్చింది. అందులో 17 మంది హౌస్‌ సర్జన్లు ఉండగా, మిగతా ముగ్గురు రెగ్యులర్‌ డాక్టర్లు ఉన్నారు. అంతేకాకుండా మరో 18మంది వైద్య సిబ్బందికి కూడా కరోనా పా జిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఇందులో 14 మంది స్టాఫు నర్సులు ఉండగా, మిగతా ల్యాబ్‌, పరిపాలన విభాగం సిబ్బంది ఉన్నారు.  జనరల్‌ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వైరస్‌ అంటుకుంది. ఇందులో పనిచేసే ముగ్గురు గైనకాలజిస్టులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంతే కాకుండా మరో ఎనిమిదిమంది హౌజ్‌ సర్జన్లకు కూడా నిర్ధారణ అయ్యింది. దీంతో పాటు కాన్పు కోసం వచ్చే గర్భిణులకు చాలా మందికి పాజిటివ్‌ వస్తోంది. జనవరి 5నుంచి ఇప్పటి వరకు దాదాపు 22 మంది గర్భిణులకు వైరస్‌ అంటుకుంది. ప్రస్తుతం 13 మంది గర్భిణులు, బాలింతలు కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు.

 జిల్లాల నుంచి కేసులు 

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి వచ్చే కొవిడ్‌ కేసులు దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లాల నుంచి రెఫర్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ నిర్ధారణ అయిన గర్భిణులను కాన్పు కోసం జనరల్‌ ఆసుపత్రికి పంపిస్తున్నారు. వారం రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి దాదాపు 11మంది కొవిడ్‌ ఉన్న గర్భిణులను రెఫర్‌ చేశారు. అన్ని జిల్లాలల్లో కొవిడ్‌కు సంబందించి ప్రత్యేక విభాగాలున్నప్పటికి అన్ని కేసులను జనరల్‌ ఆసుపత్రికి పంపించడంతో ఇతర రోగులు, డాక్టర్లు వైరస్‌ బారిన పడుతున్నారు.

Updated Date - 2022-01-18T04:59:45+05:30 IST