కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2020-12-04T07:50:04+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కరోనా మరణాలు రికార్డు స్థాయికి చేరాయి. బుధవారం ఒక్కరోజే అమెరికాలో కరోనాతో 3,157 మంది చనిపోయారని జాన్స్‌ హాకిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఇది ఏప్రిల్‌ 15న నమోదైన రికార్డు 2603 మరణాల కంటే 20 శాతం అధికం. దీంతో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 2,73,799కి పెరిగింది

కరోనా కల్లోలం

రికార్డుస్థాయిలో అమెరికాలో ఒక్కరోజే 3,157 మంది మృతి

24 గంటల్లో లక్షమందికిపైగా ఆస్పత్రుల్లో చేరిక.. పరిస్థితి విషమిస్తోందన్న నిపుణులు

రానున్న 3 నెలలు కఠిన పరిస్థితులే.. రష్యాలో పది రెట్లు పెరిగిన రోజువారీ కేసులు

కరోనా జాగ్రత్తలను ప్రజలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు

మార్గదర్శకాల అమలులో చిత్తశుద్ధి లేదు: సుప్రీం


వాషింగ్టన్‌, మాస్కో, డిసెంబరు 3: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కరోనా మరణాలు రికార్డు స్థాయికి చేరాయి. బుధవారం ఒక్కరోజే అమెరికాలో కరోనాతో 3,157 మంది చనిపోయారని జాన్స్‌ హాకిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఇది ఏప్రిల్‌ 15న నమోదైన రికార్డు 2603 మరణాల కంటే 20 శాతం అధికం. దీంతో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 2,73,799కి పెరిగింది. అలాగే, అమెరికాలో గత 24 గంటల్లో కొత్తగా 1,95,121 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటీ నలభై లక్షలు దాటింది. బుధవారం ఒక్కరోజే లక్షా 226 మందికి ఆస్పత్రుల్లో చేరడంతో పరిస్థితి చేయిదాటిపోతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, రోజువా రీ మరణాల సంఖ్య 1.5 లక్షలు, 2 లక్షలు, 2.5 లక్షలకు చేరే పరిస్థితి కనిపిస్తోందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పడనుందని పేర్కొన్నారు.


రానున్న మూడు నెలలు కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. లాస్‌ఏంజెలి్‌సలోని ఆస్పత్రుల్లో బెడ్‌లన్నీ రోగులతో నిండిపోయాయి. దీంతో తీవ్ర లక్షణాలు లేని రోగులు ఇళ్ల వద్దే ఉండాలని లాస్‌ ఏంజెలిస్‌ మేయర్‌ ఎరిక్‌ గార్సెట్టి విజ్ఞప్తి చేశారు. కాగా, అత్యవసరంగా టీకా వినియోగంపై చర్చించేందుకు ఈనెల 10న అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ర్టేషన్‌ ప్యానెల్‌ సలహాదారులు సమావేశమవుతున్నారు. రానున్న మూడు నెలల్లో పెద్దల్లో 40 శాతం మందికి టీకా లభించే అవకాశం ఉందని అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


రాష్ర్టాలకు వ్యాక్సిన్‌ పంపిణీ ఈనెలలోనే ప్రారంభించాలనుకుంటున్నామని, ఈ ఏడాది చివరినాటికి 2 కోట్లమంది అమెరికన్లకు టీకా అందించాలనే లక్ష్యంతో ఉన్నామని అమెరికా ఆరోగ్యమంత్రి అలెక్స్‌ అజర్‌ చెప్పారు. మరోవైపు రష్యాలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పదిరెట్లు పెరిగింది. బుధవారం 2,800 కొత్తకేసులు నమోదవగా, గురువారం 28,145  కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 24 లక్షలకు చేరింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన నాలుగో దేశంగా రష్యా నిలిచింది.

Updated Date - 2020-12-04T07:50:04+05:30 IST