కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-04-20T06:08:58+05:30 IST

కరోనా సెకండ్‌వేవ్‌ ఉమ్మడి జిల్లాను వెంటాడి వేటాడుతోంది. ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అపోహలతో వాక్సినేషన్‌ తీసుకోకపోవడంతో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో అర్చక, ఉద్యోగులు 50 మందికి పైగా కరోనా బారిన పడగా, నిత్యం ఇక్కడ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

కరోనా కల్లోలం
నల్లగొండ జిల్లా హాలియా సభకు వచ్చిన సీఎం కేసీఆర్‌ను మాస్క్‌లు ధరించకుండానే కలిసిన పార్టీ నేతలు

ఉమ్మడి జిల్లాలో విజృంభిస్తున్న వైరస్‌

సాగర్‌ ప్రచారంలో పాల్గొన్న  ఆరు రోజులకు సీఎం కేసీఆర్‌కు పాజిటివ్‌

టీఆర్‌ఎస్‌ అభ్యర్థితోపాటు పలువురు నేతలకు సైతం

హోంక్వారంటైన్‌లో నల్లగొండ జిల్లా కలెక్టర్‌

ఉమ్మడి జిల్లాలో ముగ్గురి మృతి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): కరోనా సెకండ్‌వేవ్‌ ఉమ్మడి జిల్లాను వెంటాడి వేటాడుతోంది. ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అపోహలతో వాక్సినేషన్‌ తీసుకోకపోవడంతో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో అర్చక, ఉద్యోగులు 50 మందికి పైగా కరోనా బారిన పడగా, నిత్యం ఇక్కడ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇది మరవకముందే సాగర్‌ ఉప ఎన్నికలో కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ప్రచారం, సభలు, సమావేశాలు నిర్వహించడంతో దీని పర్యవసానం ఇప్పుడు కనిపిస్తోంది. సాగర్‌ ప్రచారంలో పాల్గొన్న నాయకులతోపాటు సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ సైతం కరోనా బారినపడ్డారు. అంతేగాక ఎన్నికల విధుల్లో పాల్గొన్న నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌కు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆయన కొంతకాలంగా హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఇక పోలింగ్‌ విధులు నిర్వహించిన మిర్యాలగూడకు చెందిన ప్రధానోపాధ్యాయుడు శ్వాస సంబంధిత ఇబ్బందితో సోమవారం మృతిచెందాడు. పోచంపల్లికి చెందిన మరొకరు కరోనాతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 రోజుల్లో అధికారికంగా 7,760 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 408 కేసులు నమోదవుతున్నట్టు లెక్క. ఇక అనధికారికంగా ఈ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీన్ని బట్టి కరోనా సెకండ్‌ వేవ్‌ ఉమ్మడి జిల్లాలో ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలుస్తోంది. నలగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రభావంతో అక్కడ కరోనా విజృంభిస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ పాటు కీలక నేతలకు సోమవారం పాజిటివ్‌ వచ్చింది. వచ్చే మూడు రోజుల్లో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని జిల్లా వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోదరుడికి, ఆర్మూరు జడ్పీటీసీకి, మరో నలుగురు ఆర్మూర్‌ నేతలకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మాడ్గులపల్లి మండలంలో ప్రచారంలో ఉన్న వారిని వెనక్కి పంపారు. తాజాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌తోపాటు ఆయన తల్లి, భార్యకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సాగర్‌ టికెట్‌ ఆశించి భంగపడిన టీఆర్‌ఎస్‌ మరో కీలక నేత ఎంసీ.కోటిరెడ్డి, ఇటీవలే బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌ లో చేరిన కడారు అంజయ్యయాదవ్‌కు కరోనా సోకింది. వీరితోపాటు త్రిపురారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జానయ్య, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డ్రైవర్‌, గన్‌మెన్లు సైతం కరోనా బారినపడ్డారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన ఇంటి యజమానులకు కరోనా సోకింది. ఎంసీ.కోటిరెడ్డి గ్రామంలో ముగ్గరు కీలక నేతలకు పాజిటివ్‌ అని తేలింది. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు కరోనా సోకింది. మిర్యాలగూడ పట్టణం శాంతినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంజిత్‌ సింగ్‌ తిరుమలగిరి మండలం రంగుండ్ల తండాలో ఈ నెల 15న ఎన్నికల విధుల్లో పాల్గొనగా, 17వ తేదీన శ్వాస ఆడటం లేదంటూ మిర్యాలగూడలో ఆస్పత్రిలో చేరి; 19వ తేదీన ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ పీజే.పాటిల్‌ కరోనాతో గత కొద్ది రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు. ఎమ్మెల్సీ, సాగర్‌ ఉప ఎన్నిక వరుస విధులతో ఆయన కరోనా బారినపడ్డారు. ఉప ఎన్నికకు ముందు అనుముల పీహెచ్‌సీ పరిధిలో ప్రతి రోజు రెండు లేదా మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవి. తాజాగా ఆ సంఖ్య సోమవారం ఒక్కరోజే 66కు చేరింది. నియోజకవర్గంపరిధిలోని ఐదు మండలాల్లోనే సోమవారం ఒక్క రోజే 160 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. పెద్దవూర మండల పరిధిలో 59, హాలియాలో 66, గుర్రంపోడులో 11, నిడమనూరులో 7, నాగార్జునసాగర్‌లో 17 కేసులు నమోదయ్యాయి. గత 45 రోజుల వ్యవధిలో సాగర్‌ నియోజకవర్గంలో రెండు వేల కేసులు నమోదైనట్లు సమాచారం. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య భారీగా ఉంటుందన్న అంచనాలో వైద్యాధికారులు ఉన్నారు. మిర్యాలగూడ డివిజన్‌లో ఈ ఏడాది మార్పి 6 నుంచి ఏప్రిల్‌ 15 నాటికి 5,210 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వచ్చాయి. సాగర్‌ నియోజకవర్గంలో 45 రోజుల వ్యవధిలో సుమారు 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన నడిగూడెం టీఆర్‌ఎస్‌ నేతలు సోమవారం పరీక్షలు చేయించుకోగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. 


కరోనాతో ముగ్గురి మృతి

ఉమ్మడి జిల్లాలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. సాగర్‌ ఉప ఎన్నిక విధులు నిర్వహించిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన మాలి రంజిత్‌ సింగ్‌, యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణం లక్ష్మణ్‌నగర్‌ కాలనీకి చెందిన ఒకరు కరోనాతో హైదరాబాద్‌లో చికిత్స పొం దుతూ సోమవారం మృతి చెందారు. నకిరేకల్‌ పట్టణానికి చెంది న ఫొటోగ్రాఫర్‌ బి.శ్రీనివాస్‌ కరోనాతో ఆదివారం రాత్రి మృతి చెందారు. కాగా ఏప్రిల్‌ 1వ తేదీనుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 13మంది మృతిచెందారు.


వేగంగా పెరుగుతున్న కేసులు

హాలియా పీహెచ్‌సీలో సోమవారం 175 మందికి పరీక్షలు చేయగా 66 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతోపాటు నియోజకవర్గంలోని పెద్దవూర మండలంలో 59, గుర్రంపోడులో 11, నిడమనూరులో 7, నాగార్జునసాగర్‌లో 17 కేసులు, మొత్తం 160 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాయి. ఇందు లో అత్యధికంగా టీఆర్‌ఎస్‌ నేతలే ఉన్నారు. తిరుమలగిరి(సాగర్‌) మండలానికి చెందిన వారు 20 మంది వరకు ఉన్నారు. వేములపల్లి మండలంలో 41మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. చింతపల్లి మండలంలో 20 మందికి, పెద్దఅడిశర్లపల్లిలో 28 మందికి, నాంపల్లి మండలంలో ఐదుగురికి, దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో 182 మందికి పరీక్షలు నిర్వహించగా 31 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నకిరేకల్‌లో 46 మందికి, మర్రిగూడ మండలంలో 17 మందికి, శాలిగౌరారంలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. 

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండల పరిధిలో సోమవారం 21 మందికి కరోనా పాజిటీవ్‌గా వచ్చింది. వీరిలో మండలానికి చెందిన వారు ఐదుగురు, మిగిలిన 16 మంది పట్టణానికి చెందిన ఉన్నారు. ఇటీవల దేవస్థాన ప్రసాదాల తయారీ విభాగంలో విధులు నిర్వహించే పర్మినెంట్‌ ఉద్యోగి, మరో కాంట్రాక్టు ఉద్యోగికి కరోనా రాగా, వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న దేవస్థాన సిబ్బందికి సోమవారం పరీక్షలు నిర్వహించగా, ఎవరికీ పాజిటివ్‌ నిర్ధారణ కాలేదు. గుట్ట పీహెచ్‌సీలో సోమవారం 1333 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. మోత్కూరు పీహెచ్‌సీలో 65 మందికి పరీక్షలు నిర్వహించగా 30మందికి పాజిటివ్‌ వచ్చింది. వలిగొండ మండలంలో 91 మందికి రాపిడ్‌ టెస్టులు చేయగా 25 మందికి పాజిటివ్‌ వచ్చింది. చౌటుప్పల్‌ పీహెచ్‌సీలో 175 మందికి పరీక్షలు నిర్వహించగా 52 మందికి పాజిటివ్‌ వచ్చింది. 1661 మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇచ్చారు. పోచంపల్లి మండలంలో 146 మందికి పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. 504 మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


 వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి

చౌటుప్పల్‌: కొవిడ్‌ నివారణ టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ కోరారు. సోమవారం చౌటుప్పల్‌ ఆస్పత్రిని ఆమె సందర్శించి, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. రోజుకు ఎంత మందికి టీకా ఇస్తున్నారన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, జిల్లా టీకా అధికారి డాక్టర్‌ పరిపూర్ణాచారి, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు సుమన్‌కళ్యాణ్‌, డాక్టర్‌ శిల్పి ఉన్నారు.



వ్యాక్సిన్‌ కోసం ఆస్పత్రుల వద్ద ప్రజల క్యూ

నేరేడుచర్ల, శాలిగౌరారం: కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇంతకాలం వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుకురాని వారు ప్రస్తుతం ఎగబడుతున్నారు. నేరేడుచర్ల ఆస్పత్రికి సోమవారం ఉదయం 7 గంటలకే 300 మం ది వ్యాక్సిన్‌ కోసం వచ్చారు. రద్దీ అధికం కావడంతో వారిని అదుపు చేసేందుకు ఎస్‌ఐ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి టోకెన్ల ప్రకారం వ్యాక్సిన్‌ ఇచ్చి పంపా రు. అదేవిధంగా శాలిగౌరారం పీహెచ్‌సీకి సోమవారం 180 మంది రాగా, అధికారులు 100 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. దీంతో మిగతావా రు ఉసూరుమంటూ వెనుదిరిగారు.


యాదా ద్రి జిల్లాకు చేరిన 30వేల డోసుల వ్యాక్సిన్‌ 

భువనగిరి టౌన్‌: యాదాద్రి భువనగిరి జిల్లాకు మరో 30వేల కరోనా వ్యాక్సిన్‌ డోసులు ఆదివారం అర్ధరాత్రి దాటాక వచ్చాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు 1.50లక్షల డోసులు వచ్చాయి. ఇప్పటి వరకు 1.30లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారు 11వేల వాయిల్స్‌ కొవీషీల్డ్‌, 135 వాయిల్స్‌ కోవ్యాక్సిన్‌-20, 2వేల వాయిల్స్‌ కోవ్యాక్సిన్‌-10ను వినియోగించారు. ప్రస్తుతం జిల్లాలో మరో రెండు మూడు రోజులకు సరిపడా సుమారు 25వేల డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.



రద్దీ అధికమైతే టోకెన్‌ విధానం

రిజిస్ట్రేషన్ల శాఖకు సర్క్యులర్‌ జారీ చేసిన ప్రభుత్వం

నల్లగొండ: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగించాలని, రద్దీ అధికమైతే టోకెన్‌ విధానాన్ని పాటించాలని ప్రభుత్వం సోమవారం ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. మాస్క్‌ ధరిస్తేనే ఆస్తుల క్రయ, విక్రయదారులను కార్యాలయంలోనికి అనుమతించాలని,  కేవలం ముగ్గురు మాత్రమే ఉండేలా చూడాలని ఆదేశించింది. శానిటైజర్‌ వినియోగించాకే వేలి ముద్రలు తీసుకోవాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది.


కరోనా హెల్త్‌ బులిటెన్‌ నిలిపివేత

నల్లగొండ అర్బన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా హెల్త్‌ బులిటెన్‌ను సోమవారం నుంచి నిలిపివేసింది. దీంతో జిల్లాలో కరోనా కేసులు, పాజిటివ్‌ల మృతుల వివరాలు ఇక నుంచి తెలిసే అవకాశం లేదు.


 ప్రజల దీవెనలే సీఎంకు శ్రీరామరక్ష : మంత్రి జగదీష్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ ప్రజల దీవెనలే కాపాడతాయి. కేసీఆర్‌కున్న ధైర్యం, ఆత్మస్థైర్యమే కరోనాపై విజయం సాధింపజేస్తుంది. త్వరలోనే సీఎం కోలుకుంటారు.


పండుగలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలి : సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ 

సూర్యాపేట(కలెక్టరేట్‌): కరోనా వైరస్‌ రెం డోదశ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు 69 ప్రకారం ప్రజలు పండుగలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న జరిగే శ్రీరామ నవమి పం డుగను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని సూచించారు.ఈనెల 30వ తేదీ వరకు ఎలాంటి బహిరంగ సభలు,ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొన్నారు.

Updated Date - 2021-04-20T06:08:58+05:30 IST