కరోనా భయం.. టీకా కోసం బారులు

ABN , First Publish Date - 2022-06-27T08:50:47+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. నాల్గోవేవ్‌కు దారితీస్తుందన్న భయాందోళనలు నెలకొనడంతో ప్రికాషనరీ...

కరోనా భయం.. టీకా కోసం బారులు

59 ఏళ్లలోపు వారు బూస్టర్‌ డోసు కోసం ప్రైవేటుకు

1.8శాతానికి పాజిటివ్‌ రేటు.. కొత్తగా 434 మందికి కరోనా పాజిటివ్‌

కేసుల పెరుగుదలతో వ్యాక్సిన్‌ కేంద్రాలకు జనం.. 25 రోజుల్లో 1.65 లక్షల మందికి టీకా 

ఈ డోసుల వినియోగం రెట్టింపు.. 

ఆక్సిజన్‌, ఐసీయూ రోగుల్లోనూ పెరుగుదల 


హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. నాల్గోవేవ్‌కు దారితీస్తుందన్న భయాందోళనలు నెలకొనడంతో ప్రికాషనరీ డోసు (బూస్టర్‌  డోసు) కోసం టీకా కేంద్రాలకు వస్తున్నారు. ప్రస్తుతం 59 ఏళ్లు పైబడిన వారికే సర్కారీ కేంద్రాల్లో టీకాలిస్తున్నారు. ఆ వయసులోపు వారంతా  ప్రైవేటులోనే ప్రికాషనరీ డోసులను కొనుగోలు చేసి తీసుకుంటున్నారు. దాంతో ప్రైవేటు టీకా కేంద్రాలకు వెళ్లేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. జూన్‌ 1న ప్రికాషనరీ డోసులు తీసుకున్న వారి సంఖ్య 4307. అదే జూన్‌ 25 వచ్చేసరికి అది కాస్త 12379కు పెరిగింది. అంటే కేసులు పెరుగుతుండటంతో ప్రికాషనరీ డోసులు తీసుకునే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. అలాగే ప్రైవేటు టీకా కేంద్రాల్లో జూన్‌ 1న 1242 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. జూన్‌ 15 నాటికి అది కాస్త 2763 కాగా, జూన్‌ 25 నాటికి 8146కు పెరిగింది. కేంద్రం 59 ఏళ్లలోపు వారు ప్రికాషనరీ డోసులను ప్రైవేటులో కొనుగోలు చేసి వేసుకోవాలని స్పష్టం చేసింది. అందుకే 59 ఏళ్లలోపు వారంతా ప్రికాషనరీ డోసుల కోసం ప్రైవేటు వ్యాక్సిన్‌ కేంద్రాలకు వెళ్తున్నారు. పైగా టీకా ఖరీదు కూడా తక్కువగానే ఉంది. ప్రైవేటులో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ ఒక్కో డోసు ధర రూ. 225 ఉంది.  ఒక్కసారి టీకా తీసుకుంటే 9 నెలల పాటు రక్షణ ఉంటుంది. మళ్లీ ఇప్పుడు నాల్గొ వేవ్‌ వచ్చినా ప్రాణాపాయం ఉండదన్న భావనతో ప్రికాషనరీ తీసుకుంటున్నారు. రెండో డోసు తీసుకొని 9 నెలలు గడిస్తే ప్రికాషనరీ తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 


25 రోజుల్లో 1.65 లక్షల మందికి టీకాలు 

 రాష్ట్రంలో రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తి చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారంతా కొవిడ్‌ రిస్కుతో మళ్లీ ప్రికాషనరీ డోసులు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రికాషనరీ డోసును కేవలం మూడు శాతం మందే తీసుకున్నారు. తెలంగాణలో 2.76 కోట్ల మందికి ప్రికాషనరీ డోసులివ్వాలని వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. అందులో ఇప్పటివరకు కేవలం 9.65 లక్షల మందే బూస్టర్‌ డోసు తీసుకున్నారు. జూన్‌ ఒకటి నాటికి బూస్టర్‌ డోసును 8 లక్షల మందే తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌లు పెరుగుతున్నాయి. రోజువారీగా 500 వరకు కేసులొస్తున్నాయి. దీంతో ప్రికాషనరీ డోసులు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దాంతో మళ్లీ టీకా కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం 25 రోజుల వ్యవధిలో 1.65 లక్షల మంది ప్రికాషనరీ డోసును తీసుకున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. 


ఆక్సిజన్‌, ఐసీయూపై పెరుగుతున్న చేరికలు 

కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య 4 వేలకు చేరింది. జూన్‌ ఒకటిన కేవలం 481 యాక్టివ్‌ కేసులే ఉన్నాయి. ఆ రోజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ పడకలపై ఏడుగురు కొవిడ్‌ పేషంట్స్‌ ఉన్నారు. ప్రైవేటులో 12 మంది ఉన్నారు. ఆక్సిజన్‌, ఐసీయూ పడకలపై ఒక్క కొవిడ్‌ పేషంట్‌ కూడా లేరు. జూన్‌ 25 నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ పడకలపై ఏడుగురు, ప్రైవేటులో 13 మంది కొవిడ్‌ రోగులున్నారు. ఆక్సిజన్‌పై సర్కారీ దవాఖానాలో ఐదుగురు, ప్రైవేటులో పది మంది ఉన్నారు.  ఐసీయూ పడకలపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకరు, ప్రైవేటు హస్పిటల్‌లో ఏడుగురు కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. మొత్తం అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటులో కలపి ప్రస్తుతం 43 మంది  కొవిడ్‌ పేషంట్స్‌ చికిత్స పొందుతున్నారు.   ఆస్పత్రుల  చేరికల్లో మెజార్టీ ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులేనని వైద్యులంటున్నారు. 


హైదరాబాద్‌లో కొత్తగా 343 కేసులు

రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ రేటు పెరుగుతోంది. ఆదివారం 1.8 శాతానికి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం 23,979 టెస్టులు చేశారు. అందులో కొత్తగా 434 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 343 కేసులొచ్చాయి. మేడ్చల్‌లో 25, రంగారెడ్డిలో 34 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,762 యాక్టివ్‌ కొవిడ్‌ కేసులున్నాయి. మరో 285 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఆదివారం 10,923 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

Updated Date - 2022-06-27T08:50:47+05:30 IST