సీఆర్డీయే ఉద్యోగుల్లో కరోనా భయం!

ABN , First Publish Date - 2020-05-26T08:47:09+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 2మాసాలపాటు కళావిహీనంగా కనిపించిన సీఆర్డీయే 5 రోజుల క్రితం నుంచి తిరిగి అధికారులు..

సీఆర్డీయే ఉద్యోగుల్లో కరోనా భయం!

(ఆంధ్రజ్యోతి, అమరావతి): కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 2మాసాలపాటు కళావిహీనంగా కనిపించిన సీఆర్డీయే 5 రోజుల క్రితం నుంచి తిరిగి అధికారులు, ఉద్యోగులతో కళకళలాడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ గత గురువారం నుంచి పూర్తిస్థాయిలో పని చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను పురస్కరించుకుని, విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రతి ఉద్యోగీ కార్యాలయానికి రావాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో సిబ్బంది అందరూ విధులకు హాజరవుతున్నారు. అనూహ్యంగా వచ్చిన దీర్ఘకాల విరామానంతరం ప్రధాన కార్యాలయంలో వీరందరి హాజరుతో సందడి నెలకొంది. అయితే భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లను ఉన్నతాధికారులు చేయకపోవడం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా కుర్చీల మధ్య దూరం లేకుండా, దగ్గరగానే కూర్చుని పనిచేయాల్సి ఉండటం వాళ్లలో భయాందోళన కనిపిస్తోంది. 


అయితే కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగుల శరీర ఉష్ణోగ్రతను థర్మల్‌ స్కానర్‌ ద్వారా తెలుసుకుని, నిర్ణీత ఉష్ణోగ్రతలోపు ఉన్నవారిని మాత్రమే లోనికి పంపటం, చేతులను శానిటైజర్‌ ద్వారా శుభ్రపరచుకునేందుకు ఏర్పాట్లను చేయడం, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లను ధరించేందుకు అవసరమయ్యే ఏర్పాట్లను ఉన్నతాధికారులు చేశారు. సందర్శకులు కూడా ఈ జాగ్రత్తలను పాటించేలా చూస్తున్నారు. 


అంతవరకూ బాగానే ఉన్నా ఉద్యోగుల కుర్చీల మధ్య తగినంత ఖాళీలుండేలా జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో చాలా విభాగాల్లో 6 అడుగుల నిర్ణీత ఎడం కాదు కదా కనీసం 3 అడుగులన్నా ఖాళీ లేకుండా పోయింది. సిబ్బంది ఎక్కువగా ఉండే ఇంజనీరింగ్‌, డెవలప్‌మెంట్‌ ప్రమోషన్‌, ప్లానింగ్‌ తదితర విభాగాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దాదాపు 2 నెలలుగా కరోనా బారిన పడకుండా అన్ని రక్షణ ఏర్పాట్లు తీసుకుంటూ, సురక్షితంగా ఉన్న ఉద్యోగులు ఈ సీటింగ్‌ కారణంగా కరోనా బారిన పడే అవకాశాలున్నాయని వాపోతున్నారు. మధ్యాహ్న భోజనం చేసేందుకు కూడా అనువైన ఏర్పాట్లను సైతం చేయకపోవడమూ వారిని మరింతగా కలవరపరుస్తోంది. 


కరోనా వచ్చింది కదాని ఇప్పటికి ఇప్పుడు ఆఫీస్‌ స్పేస్‌ను అమాంతం పెంచేసి, కుర్చీల మధ్య ఖాళీ ఉండేలా చూడడం సాధ్యమయ్యే పని కాదు. వైరస్‌ నియంత్రణలోకి వచ్చేవరకు కొన్ని నెలలైనా రక్షణ చర్యలను పాటించాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో సీటింగ్‌ ఏర్పాట్లను చేయడం తప్పనిసరైంది. 


అదృష్టవశాత్తు సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో అదనపు స్పేస్‌ ఉంది. కొన్నేళ్లుగా 3వ అంతస్తు నిరుపయో గంగానే ఉంది. దీనిని అభివృద్ధి పరచి, కొన్ని విభాగాలను తరలించాలని గతంలో కొందరు ఉన్నతాధికారులు యోచించారు. కానీ ఎందువల్లనో కార్యరూపం దాల్చలేదు. 


ఇప్పటి వరకూ పరిస్థితెలా ఉన్నా, ప్రస్తుత సమయంలో ఉద్యోగుల కుర్చీలు, టేబుళ్ల మధ్య తగినంత ఎడం ఉండడం అందరికీ శ్రేయస్కరం. ఈ దృష్ట్యా సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీ నరసింహం సాధ్యమైనంత త్వరగా 3వ అంతస్తును వినియోగంలోకి తేవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2020-05-26T08:47:09+05:30 IST