Abn logo
Jun 15 2021 @ 14:11PM

కరోనా భయమా... ఇలా ఆలోచిద్దాం

2020తోనే కరోనా పీడ వదిలిపోతుందని అనుకున్నాం!

కానీ ఆ మహమ్మారి మనతో పాటు 2021లోకి కూడా అడుగు పెట్టింది!

అయితేనేం, వ్యాక్సిన్స్‌తో దాని అంతు చూడొచ్చని ఆశపడ్డాం! 

కానీ మనం ఊహించింది వేరు, జరిగింది వేరు! 

వ్యాక్సిన్‌తో రక్ష అంతంతమాత్రంగానే ఉండడం...

కొవిడ్‌ అనుబంధ ఆరోగ్య సమస్యలు, మున్ముందు మూడో వేవ్‌ పొంచి ఉందనే వార్తలు... 

కరోనా గురించిన ఆందోళనను మరింత పెంచి, మానసికంగా నిస్త్రాణకు గురి చేస్తున్నాయి!

అయితే, ఇలా పదే పదే ఆశలు పెట్టుకుంటూ అదే పనిగా నిరాశకు గురయ్యే కంటే....

‘ఎప్పటికైనా కరోనా అంతం అవక మానదు, మంచి రోజులు రాకుండా పోవు’ అనే...

‘స్టాక్‌డేల్‌పారడాక్స్‌’ తరహా దృక్పథాన్ని అలవరుచుకోవడం మేలంటున్నారు మానసిక నిపుణులు!


‘జేమ్స్‌ స్టాక్‌డేల్‌’... ఓ అమెరికా సైనికుడు. వియత్నాం యుద్ధ  సమయంలో శత్రు సేనలకు చిక్కి, యుద్ధఖైదీలుగా మారిన సైనికుల్లో ఇతను ఒకడు. అయితే, జైల్లో ఉన్న సమయంలో, తోటి సైనికులు ‘ఫలానా రోజున విడుదలైపోతాం’ అని ప్రతి ఏడాదీ ఓ కాలపరిమితి పెట్టుకుంటూ ఉండేవారు. తీరా అనుకున్న రోజు వచ్చినా, విడుదల అవకపోయేసరికి నిరాశతో కుంగిపోతూ ఉండేవారు. ఇలా ప్రతిసారీ వాళ్ల ఆశలు నీరుగారిపోతూ ఉండడంతో మానసిక కుంగుబాటుకు లోనై, ఒక్కొక్కరూ మరణించి, చివరకు స్టాక్‌డేల్‌ ఒక్కడే మిగిలిపోయాడు. అతను మాత్రం ఏడున్నరేళ్ల పాటు యుద్ధఖైదీగా జీవితం ముగించి, చివరకు విడుదలై అమెరికా సైన్యంలో కొనసాగి, అడ్మిరల్‌ స్థాయికి ఎదిగాడు. తోటి ఖైదీల మాదిరిగా స్టాక్‌డేల్‌ నిరాశకు లోనై, మరణించకపోవడానికి కారణం, అతను వారిలా ఆలోచించకపోవడమే! వాళ్లలా విడుదలకు కచ్చితమైన కాలపరిమితి పెట్టుకుని, ఆ సమయానికి విడుదల అవుతానని విపరీతమైన ఆశలు పెట్టుకోలేదతను. తాను ఎప్పటికైనా విడుదల అవుతానని మాత్రమే అనుకున్నాడు. తన కథ కచ్చితంగా సుఖాంతం అవుతుందని నమ్మకం పెట్టుకున్నాడు. అదే తేడా! ఇలాంటి స్టాక్‌డేల్‌ తరహా ఆలోచనా విధానం ప్రస్తుత కరోనా కాలానికి అన్వయించుకోదగినది. 


మనలో ఎన్నో వర్గాలు!

సగం నిండిన గ్లాసును అందించినప్పుడు.... గ్లాసు సగం ఖాళీగా ఉందని కొందరికి అనిపిస్తే, గ్లాసు సగం నిండుగా ఉందని ఇంకొందరికి అనిపించవచ్చు. ఇలాంటి ఆశనిరాశలకు లోనవకుండా ఉండాలంటే ‘నాకు గ్లాసు అయితే దక్కింది కదా?... అది చాలు!’ అనుకోగలగాలి. మనలో ఇలాంటి భిన్న వర్గాలకు చెందిన వాళ్లు ఉంటారు. కరోనా అంతం పట్ల వారిలో ఆశలు, అత్యాశలు, నిరాశలు, నిర్లిప్తతలు, సానుకూల దృక్పథాలు... ఇలా భిన్నమైన ఉద్వేగాలు, ఆలోచనలు ఉంటాయి. ఎలాగంటే....


అత్యాశ అనర్ధమే!

కరోనాకు వన్‌ టైమ్‌ మెడిసిన్‌ వచ్చేస్తుందనీ, ఒక్క దెబ్బతో మహమ్మారి మెడలు విరిచే వ్యాక్సిన్‌ వస్తుందనీ, ఆనందయ్య మందులాగా హఠాత్తుగా ఏదో అద్భుత ఔషధం తయారవుతుందనీ నమ్ముతూ, వాటి కోసం నిరంతరం ఎదురు చూసేవాళ్లు ఉన్నారు. అనుకున్నట్టే వ్యాక్సిన్‌ వచ్చింది. మందులూ వచ్చాయి. అయితే వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కరోనా సోకుతోంది, మందులు వాడినా ఇన్‌ఫెక్షన్‌ అదుపు తప్పుతోంది. కొన్నిసార్లు అందుబాటులో ఉన్న మందులు కూడా సకాలంలో దొరకని పరిస్థితి, ఒకవేళ మందులు వాడినా అవి పనిచేయని దుస్థితి.... ఇలా ఊహించిన దానికి పూర్తి భిన్నమైన వాస్తవిక పరిస్థితి ఎదురైనప్పుడు తీవ్రమైన మానసిక కుంగుబాటు చోటుచేసుకుంటుంది. చిన్న విషయాలకే కుంగిపోయే వ్యక్తులు, చిన్నపాటి అపజయాలకే నీరసించిపోయి, ఆశలు కోల్పోయే వ్యక్తులు, ఆందోళనకు లోనవుతూ ఒత్తిడితో జీవించే వ్యక్తులు ఈ వర్గానికి చెందుతారు. 


భరోసా నుంచి భయం!

ముందు నుంచీ ఆశలు పెట్టుకుని, ఆ తర్వాత ఎదురైన పరిస్థితులతో ఆశలు పెట్టుకోవడమే వ్యర్థం అనే... అతి వృష్ఠి, అనావృష్ఠి కోవకు చెందిన వాళ్లు ఉంటారు. ‘మనది వేడి దేశం కాబట్టి కరోనా మన జోలికి రాదు’ అనుకుని భంగపడిన వ్యక్తులు వీళ్లు. అలాంటి అవసరానికి మించిన ఆత్మవిశ్వాసంతో నడుచుకునే సమయంలో కరోనా విజృంభించడంతో, ఆ సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ కాస్త తగ్గి, కరోనాను అంతం చేసే మందు వస్తుందనే ‘ఆశ’ వీళ్లలో మొదలవుతుంది. ఆ ఆశ కూడా అడుగంటడంతో చివరకు ‘కరోనా నాకే సోకుతుందేమో, నా పరిస్థితే విషమిస్తుందేమో’ అనే అపనమ్మకం మొదలవుతంది.


ఒకవేళ కరోనాకు సంబంధించి ఏదైనా జరకూడనిది జరిగితే, వీళ్లలోని ఆ ఆశ కాస్తా పూర్తిగా అంతరిస్తుంది. అప్పటి నుంచి అదే పనిగా నెగటివ్‌ ఆలోచనలు మొదలుపెడతారు. ‘ఇక నన్నెవరూ కాపాడలేరు’ అనే హోప్‌లె్‌సనెస్‌, ‘ఇక నా చేతుల్లో ఏమీ లేదు’ అనే హెల్ప్‌లె్‌సనెస్‌, ‘అన్ని కష్టాలూ నాకే’ అనే నిస్సహాయతలు అలవరుచుకుంటారు. ఇదే ఆలోచనా విధానం 4 వారాలకు మించి, నిరంతరంగా కొనసాగితే మానసిక కుంగుబాటులో కూరుకుపోతారు. 


స్టాక్‌డేల్‌ పారడాక్స్‌ వర్గం!

ఈ వర్గానికి సంబంధించిన వ్యక్తులు సమాజంలో ఎంతో తక్కువ. నిజానికి ఈ తత్వం ప్రస్తుత కరోనా కాలానికి ఎంతో అవసరం. ‘జరిగేది జరగక మానదు. అన్ని మహమ్మారుల్లాగే కరోనా కూడా ఓ సమయానికి అంతం అవుతుంది. అప్పటివరకూ దాని గురించి చింతిస్తూ కూర్చోకుండా, జాగ్రత్తతో మసలుకోవాలి’ అని బలంగా నమ్మే వర్గం ఇది. ఈ కోవకు చెందిన వాళ్లు కరోనా వార్తలు, మరణాలు రేటు చూసి బెదిరిపోరు. సామాజిక మాధ్యమాల్లో సంచరించే పుకార్లు, అపోహలు, అవాస్తవిక సమాచారాలను పట్టించుకోరు. కరోనా గురించి అవగాహన ఏర్పరుచుకుని, దానికి తగ్గట్టు నడుచుకుంటూ ఆశావహ దృక్పథంతో జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. 


కుంగుబాటుతో కరోనా...

మానసిక కుంగుబాటు హైపోథలామస్‌ న్యూరో ఎండోక్రైన్‌ యాక్సెస్‌ను మలుపు తిప్పుతుంది. అంటే మానసిక కుంగుబాటు చిన్నమెదడు, నాడులు, గ్రంథుల మీద ప్రభావం చూపుతుంది. కరోనా గురించిన ఒత్తిడికి లోనయినప్పుడు చిన్న మెదడులో ఉత్పత్తయ్యే హార్మోన్లలో హెచ్చుతగ్గులు జరిగి, నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థలు ఒడిదొడుకులకు లోనవుతాయి. దాంతో వ్యాధినిరోధక వ్యవస్థ కూడా దిగజారుతుంది. ఫలితంగా కరోనా వైరస్‌ సోకే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ‘కరోనా సోకితే నా పరిస్థితి ఏంటి? వ్యాపారం/ఉద్యోగం పోతే ఎలా బ్రతకడం? ఈమ్‌ఐలు కట్టేదెలా? ఇలా ఎవరైతే విపరీతంగా ఆలోచిస్తూ, ఒత్తిడికి లోనవుతారో... వాళ్లే కరోనా బారిన పడే అవకాశాలను చేజేతులా కొనితెచ్చుకున్న వాళ్లవుతారు. కాబట్టి అనవసరపు భయాలు, ఆందోళనలు వదిలించుకోవాలి. కరోనా పట్ల అవగాహన ఏర్పరుచుకుని జాగ్రత్తగా నడుచుకోవాలి. 

ఆశలకు హద్దులు!

ఊహకూ, వాస్తవానికీ మధ్య వ్యత్యాసం పెరిగితే ఆ ప్రభావం మనసు మీద పడుతుంది. ఇలా జరుగుతుంది అని బలంగా నమ్ముతూ, ఎదురు చూస్తున్నప్పుడు అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటే, ఆ ప్రభావం ఆత్మన్యూనతకూ, నిస్పృహకూ, మానసిక కుంగుబాటుకూ, ఫోబియాకూ దారి తీస్తుంది. కరోనా అంతమైపోతుందనే ఆశ పెట్టుకోవడం మంచిదే! అయితే అలాంటి ఆశ వల్ల, నిరాశ నిస్పృహలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ‘కరోనా అంతం అవుతుందని నువ్వు పెట్టుకున్న ఆశ సరైంది కాదు. అది మళ్లీ రావచ్చు’ అంటూ వాస్తవికంగా ఆలోచించేలా మనల్ని నిరంతరం పురిగొల్పే అంతర్గత స్పృహ కలిగి ఉండాలి. ఆశ పెట్టుకున్నా, దానికి కాల పరిమితి విధించుకోకుండా, ‘ఎప్పటికైనా నా ఆశ నెరవేరుతుంది’ అనే ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇదే స్టాక్‌డేల్‌ పారడాక్స్‌! 

దీర్ఘకాలిక ఆశలు మేలు!

కరోనా అంతం అవుతుందని కాకుండా ఎప్పటికైనా అంతం అవుతుందనే దీర్ఘకాలిక ఆశలు పెట్టుకోవాలి. స్టాక్‌డేల్‌ పారడాక్స్‌ నుంచి మనం నేర్చుకోవలసింది ఇదే! తక్కువ సమయాలకు ఆశలను పరిమితం చేసి, నిరాశకు లోనయ్యే బదులు, దీర్ఘకాలిక ఆశలు ఏర్పరుచుకోవాలి. జరగవలసింది జరగవలసిన సమయానికి కచ్చితంగా జరుగుతుంది. అయితే అది ఫలానారోజు జరుగుతుంది? అని సమయం పెట్టుకుని ఎదురుచూస్తూ కూర్చుంటే చివరకు నిరాశ, దాన్నుంచి కుంగుబాటు మిగులుతాయి. కాబట్టి కాలపరిమితి పెట్టుకోకుండా ధైర్యంతో ముందుకు సాగాలి. ఇలాంటి ధోరణితో ఇమ్యూనిటీ మరింత పెరిగి, కరోనా కంటే పెద్ద ఉపద్రవం వచ్చినా తట్టుకుని నిలబడగలిగేటంత శక్తి సమకూరుతుంది. శారీరకంగా, మానసికంగా రెండు రకాల ఇమ్యూనిటీలు ఇలాంటి పాజిటివ్‌ థింకింగ్‌తో సాధ్యపడతాయి. వైరస్‌ నుంచి రక్షణ అందించే శరీర సంబంధ ఇమ్యూనిటీతో పాటు, కుంగుబాటుకు లోను కాకుండా చేసే మానసిక ఇమ్యూనిటీ కూడా సొంతమవుతాయి.


డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి,

క్లినికల్‌ సైకియాట్రిస్ట్‌, 

ల్యూసిడ్‌ డయాగ్నొస్టిక్స్‌, హైదరాబాద్‌.