ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో విస్తరిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-18T04:47:32+05:30 IST

జిల్లాలో కరోనా చాపకింద నీరులా ఏజెన్సీ మండలాల్లో విస్తృతంగా వ్యాపించింది.

ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో విస్తరిస్తున్న కరోనా

- లింగాపూర్‌లో సంపూర్ణంగా, వాంకిడిలో పాక్షికంగా లాక్‌డౌన్‌

- ప్రమాదకరంగా మారిన సెకండ్‌వేవ్‌

- జిల్లాలో నమోదైన తాజాకేసుల్లో అత్యధికం ఏజెన్సీల్లోనే

- పరీక్షలు ముమ్మరం చేసిన వైద్య ఆరోగ్యశాఖ

- స్వీయ నియంత్రణ లేకుంటే అదుపు కష్టమంటున్న నిపుణులు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లాలో కరోనా చాపకింద నీరులా ఏజెన్సీ మండలాల్లో విస్తృతంగా వ్యాపించింది. ఇందుకు పక్షం రోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్యే నిదర్శనం. కేవలం పదిరోజుల వ్యవధిలో పాజిటివ్‌ కేసులు 1200 నమోదుకావడం పరిస్థితి తీవ్ర తకు అద్దం పడుతోంది. ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో కరోనా ప్రభావం తక్కువే అని సంబరపడుతున్న వేళ కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ విశ్వరూపం చూపుతుండడంతో జిల్లాలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసిఫాబాద్‌, కెరమెరి, వాంకిడి, జైనూర్‌, లింగాపూర్‌ ,తిర్యాణి వంటి ఆరు ఏజెన్సీ మండలాలతో పాటు రెబ్బెన, కాగజ్‌నగర్‌ వంటి మైదాన ప్రాంత మండలాల్లోనూ కేసుల సంఖ్య అధికంగా నమోదవుతుండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.  గతేడాది మార్చి నుంచి నిన్నమొన్నటి వరకు అడపాదడపా కేసులు మాత్రమే నమోదు కాగా మార్చి 28 తరువాత ఒక్కసారిగా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతూ వస్తోంది.

పెరుగుతున్న కేసుల సంఖ్య..

 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అటు వైద్య ఆరోగ్యశాఖ కూడా పరీక్షల సంఖ్యను పెంచింది. జిల్లావ్యాప్తంగా సగటున రోజుకు 1100నుంచి 1400మధ్య పరీక్షలు జరుపుతుండగా 80 నుంచి 100 పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. గతంలో విధించినట్లుగానే కఠినమైన కొవిడ్‌ నిబంధనలను పాటించేలా అధికారులకు ఆదేశాలిచ్చింది. గతంలో మాదిరి ప్రస్తుతం ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ విధించే పరిస్థితి లేకపోవడంతో రోగ నిర్ధారణ తర్వాత బాధితులను సొంత ఇళ్లలోనే ఐసోలేట్‌ చేస్తున్నారు. వారి కదలికలపై ప్రభుత్వ పరంగా ఎలాంటి పర్యవేక్షణ లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సదరు బాధితులు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. 

ఏజెన్సీలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌..

లింగాపూర్‌ మండలంలో మోతీపటార్‌ ఉత్సవాల నేపథ్యంలో విస్తృతంగా కొవిడ్‌ వ్యాప్తి చెందడంతో ఏజెన్సీ అంతటా కరోనా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని ఆదివాసీ గ్రామాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. ఇందులో లింగాపూర్‌ మండలం సంపూర్ణ లాక్‌డౌన్‌ పాటిస్తుండగా, జైనూర్‌, వాంకిడి, ఆసిఫాబాద్‌ ఏజెన్సీ గ్రామాలు పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. ఉదయం7 నుంచి రాత్రి 7వరకు మాత్రమే దుఖాణాలు తెరుస్తున్నారు. లింగాపూర్‌ మండలంలో కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో గ్రామాలకు బయటనుంచి రాకపోకలను నియంత్రించి కంటైన్‌మెంట్‌ జోన్‌గా ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం గతేడాది లాగే ప్రస్తుతం కూగా కఠినంగా వ్యవహరిస్తేనే కరోనా వ్యాప్తిని అదుపు చేయడం సాధ్యమవుతుందనే అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజలు బయటకు వచ్చే సందర్భాల్లో కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ స్వీయ రక్షణ చర్యలు చేపడితేనే తిరగనివ్వాలని మండలాలకు చెందిన అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన  వారికి భారీ జరిమానాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులందరూ వ్యాక్సినేషన్‌ చేయించుకునేలా అవగాహన కల్పించడం కోసం చర్యలు ముమ్మరం చేశారు.

ఆందోళనకరస్థాయిలో పాజిటివ్‌లు..

ఈ ఏడాది మార్చి28 నాటికి కేవలం 2580పాజిటివ్‌ కేసులు ఉండగా, నాటినుంచి నేటివరకు అదనంగా కేవలం 18రోజుల వ్యవధిలో 1295 కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు కొన్ని మండలాల్లో 100పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం ఒక లింగాపూర్‌ మండలంలోనే 418 మంది బాధితులు కొవిడ్‌ బారిన పడ్డారు. ఇందులో గ్రామాల వారీగా పరిశీలించినప్పుడు, కొత్తపల్లిలో 137, మోతిపటార్‌లో 97 పిక్లాతండాలో 55, వంకామద్దెలో24, వంకమద్ది-2లో 26, లింగాపూర్‌ మండల కేంద్రంలో 40, పట్కాల్‌ మంగీలో14, నడుగుడలో13, కేసుల చొప్పున నమోదయ్యాయి. ఆ తరువాత రెబ్బెన, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మండలాల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి జిల్లాలో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే మొత్తం 3875 పాజిటివ్‌ కేసులకుగాను 2580మంది కోలుకోగా 1288మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాతపడ్డారు.

Updated Date - 2021-04-18T04:47:32+05:30 IST