ఇంటింటా ఎలీసా పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-31T08:05:16+05:30 IST

కరోనా వ్యాప్తిపై అధ్యయనానికి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌)లు నడుంబిగించాయి.

ఇంటింటా ఎలీసా పరీక్షలు

కరోనా సోకినా, లక్షణాలు బయటపడని వారి గుర్తింపే లక్ష్యం

హైదరాబాద్‌లోని 5 కట్టడి ప్రాంతాల్లో రక్త నమూనాల సేకరణ 

ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌ బృందాల నిర్వహణ

నేడు కూడా కొనసాగనున్న ప్రక్రియ 


మియాపూర్‌/హయత్‌నగర్‌/పహాడీషరీ్‌ఫ, మే 30 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తిపై అధ్యయనానికి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌)లు నడుంబిగించాయి. ఈ సంస్థలకు చెందిన నిపుణుల బృందాలు శనివారం మియాపూర్‌ పరిధిలోని ఓల్డ్‌ హఫీజ్‌పేట, సాయినగర్‌.. చందానగర్‌, టప్పా చబూత్రా, బాలాపూర్‌, ఆదిభట్లలోని కట్టడి ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికులకు ఎలీసా టెస్టులు నిర్వహించాయి. తుర్కయాంజల్‌ మునిసిపాలిటీ మన్నెగూడ సంపద హోమ్స్‌, జల్‌పల్లి మునిసిపాలిటీలోని మినార్‌ కాలనీ, అలీనగర్‌లలో ప్రజలకు వైద్య పరీక్షలు చేశాయి. ఒక్కో కట్టడి ప్రాంతం నుంచి 50 మంది చొప్పున.. మొత్తం ఐదుచోట్ల 250 రక్త నమూనాలు సేకరించారు. ఆదివారం మరో 250 సేకరించనున్నారు. దేశంలోని 13 నగరాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నట్లు సీనియర్‌ శాస్త్రవేత్తలు వైఎ్‌సరెడ్డి, జె.జె.బాబు, సుబ్బారావు తెలిపారు.  దీని ద్వారా కరోనా సోకినా, ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయటపడని వారి శాతం ఎంత ఉందనే దానిపై ఓ అంచనాకు రావచ్చన్నారు. ఆ గణాంకాల ఆధారంగా   పటిష్ఠ వ్యూహాలు రూపొందించవచ్చని రాష్ట్ర కొవిడ్‌-19 అధికారి, ఐసీఎంఆర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త ఆవుల లక్ష్మయ్య తెలిపారు. 500 రక్త నమూనాలు సేకరించిన తర్వాత వాటిని చెన్నైలోని ఐసీఎంఆర్‌ ల్యాబ్‌కు పంపుతామన్నారు. తొలివిడతగా ఇంతకుముందే తెలంగాణలోని కామారెడ్డి, జనగాం, నల్లగొండ జిల్లాల్లో శాంపిళ్ల సేకరణ పూర్తయిందని లక్ష్మయ్య తెలిపారు. వాటికి సంబంధించిన ఫలితాలు రెండురోజుల్లో వస్తాయన్నారు. అయితే హైదరాబాద్‌ సహా 13 నగరాల్లో సేకరిస్తున్న శాంపిళ్ల ఫలితాల నివేదికలు రెండు వారాల తర్వాత అందుతాయని వివరించారు. 

Updated Date - 2020-05-31T08:05:16+05:30 IST