ఉపాధి పనులపై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2021-05-09T05:53:41+05:30 IST

వలసలను నివారించి గ్రామాల్లోనే కూలీలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఉపాధిహామీ పథకానికి అల్లాదుర్గం మండలంలో కరోనాతో అడ్డంకులు తప్పడంలేదు. మండలంలో 16 గ్రామ పంచాయతీలుండగా ఐదారు గ్రామాల్లో మాత్రమే ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌ వేగంగా విస్తరిస్తుండడంతో కూలీలు పనిచేయడానికి జంకుతున్నారు.

ఉపాధి పనులపై కరోనా ఎఫెక్ట్‌
గడిపెద్దాపూర్‌లో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలు (ఫైల్‌)

ఏప్రిల్‌లో పనులకు 3వేల మంది హాజరు

ప్రస్తుతం పనిచేస్తున్నది వెయ్యి మంది మాత్రమే


అల్లాదుర్గం, మే 8: వలసలను నివారించి గ్రామాల్లోనే కూలీలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఉపాధిహామీ పథకానికి అల్లాదుర్గం మండలంలో కరోనాతో అడ్డంకులు తప్పడంలేదు. మండలంలో 16 గ్రామ పంచాయతీలుండగా ఐదారు గ్రామాల్లో మాత్రమే ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌ వేగంగా విస్తరిస్తుండడంతో కూలీలు పనిచేయడానికి జంకుతున్నారు. మండలంలో పలు గ్రామాల్లో వైరస్‌ విజృంభిస్తున్నది. కరోనాతో పలువురు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికే పదిమంది వరకు మృత్యువాతపడ్డారు. దీంతో ప్రజలు బయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రభావం ఉపాధిహామీ పనులపై పడింది. ఏప్రిల్‌ నెల చివరి వరకు మూడువేల పైచిలుకు కూలీలు ఉపాధి పనులు చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యి దాటడం లేదంటే కరోనా ప్రభావం ఎలా ఉందో స్పష్టమవుతున్నది. 


స్వచ్ఛంద లాక్‌డౌన్‌ల ప్రభావం

మండలంలోని పలు గ్రామాల్లో కరోనా కేసులు అధికంగా నమోదుకావటం, పలువురు మరణించటంతో ఆ గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు సైతం నిలిచిపోయాయి. ఉపాధి పనులు చేపట్టాలని అధికారుల అవగాహన కల్పిస్తున్నా కూలీలు మాత్రం పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మరో పదిహేను రోజులైతే వానాకాలం పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో  ప్రభుత్వం చేపట్టే ఉపాధిహామీ పనులు ఈ సంవత్సరం నామమాత్రంగానే ముగియనున్నట్టు తెలుస్తున్నది. చేపట్టిన పనులు కూడా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2021-05-09T05:53:41+05:30 IST