Advertisement
Advertisement
Abn logo
Advertisement

చేయూత కోసం..

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సాయం
మీ సేవ కేంద్రాల వద్ద లబ్ధిదారుల బారులు
ఇప్పటివరకు 2 వేలకుపైగా దరఖాస్తుల దాఖలు
మరణ ధ్రువపత్రాల కోసం ఇక్కట్లు
పత్రాల పరిశీలనకు త్రిసభ్య కమిటీలు


హనుమకొండ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల ఆర్థిక సాయం కోసం ధరఖాస్తులు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మీ సేవ కేంద్రాల ద్వారా 2వేల వరకు దరఖాస్తులు అందాయి. దరఖాస్తులను ఇంకా తీసుకుంటున్నందువల్ల వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. హనుమకొండ జిల్లా నుంచి అత్యధికంగా 784 దరఖాస్తులు దాఖలయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 343, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 165, ములుగు జిల్లాలో 66 అందాయి. మిగతావి వరంగల్‌ జిల్లాలో 500, జనగామ జిల్లాలో 142 వచ్చాయి.  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొవిడ్‌ మహమ్మారితో ఎంతమంది మృతి చెందినది అధికారులు అధికారికంగా వెల్లడించడం లేదు. అనధికారవర్గాల సమాచారం ప్రకారం 2,500లకుపైగానే ఉంటారని అంచనా. అయితే పూర్తిగా దరఖాస్తులు వస్తేగానీ ఎంత మంది కచ్చితంగా తెలియదు.

ఒకరికన్నా ఎక్కువ

ఉమ్మడి జిల్లాలో కరోనా వల్ల ఒక కుటుంబంలో ఒకరికన్న ఎక్కువ మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి పిల్లలు అనాథలయ్యారు. కుటుంబానికి కుటుంబమే  తుడిచి పెట్టుకుపోయిన ఉదంతాలూ ఉన్నాయి. ఇంకా లెక్కకురాని మరణాలు అనేకం. ఆర్థిక సాయం కోసం  బాధిత కుటుంబాలన్నీ మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులను సమర్పిస్తున్నారు. ఇంతకు ముందు కరోనా బాధిత కుటుంబాలు సాయంకోసం బీసీ కార్పొరేషన్‌లో, మరికొంత మంది కలెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులన్నీ మీసేవా కేంద్రాల నుంచి రావాలన్న నిబంధన ఉండడంతో వారంతా కూడా తాజాగా మరో సారి మీసేవ కేంద్రాల నుంచి దాఖలు చేసుకుంటున్నారు.

త్రిసభ్య కమిటీలు
కరోనా మరణాలు కొన్ని రికార్డుల్లోకి ఎక్కలేదు. ఆస్పత్రుల్లో చేరి మృతి చెందినవారి కుటుంబాలు కొన్ని మరణ ఽధ్రువీకరణ పత్రాలను ఆస్పత్రులు, వరంగల్‌ నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల నుంచి తీసుకొని జాగ్రతచేసి పెట్టుకున్నాయి. కొందరు చికిత్స అనంతరం ఇంటి వద్ద మృతి చెందారు. అలాంటి వారి కుటుంబాల్లో చాలావరకు ధ్రువపత్రాలు తీసుకోలేదు. ఇలాంటివారి కోసం కొవిడ్‌ మరణ ధ్రువపత్రం జారీకి వైద్య, ఆరోగ్య శాఖ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థికసాయం మంజూరుకు సిఫార్సు కూడా ఈ కమిటీయే చేస్తుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా వైద్యాధికారి, ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షణాధికారి సభ్యులుగా ఉంటారు. పరిహారం కోసం మృతుల కుటుంబాల సభ్యులు మీసేవ కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలి. అవి కలెక్టర్‌ లాగిన్‌కు వస్తాయి. త్రిసభ్య కమిటీ దరఖాస్తులను పరిశీలించి అర్హుల నివేదికను ఆర్థిక సహాయం కోసం పంపిస్తుంది. విపత్తు నిర్వహణ శాఖ పరిహారాన్ని బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తుంది.

దరఖాస్తు ఇలా..

బాధిత కుటుంబసభ్యులు మీ సేవ కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలి. కరోనా మరణ ధ్రువపత్రం, మృతిచెందిన వారి దరఖాస్తు చేసేవారి ఆధార్‌కార్డులు, బ్యాంకు ఖాతాలతో దరఖాస్తు చేయాలి. వీటిని త్రిసభ్య కమిటీ పరిశీలించి అర్హులను గుర్తించి పరిహారం కోసం ప్రభుత్వానికి  పంపిస్తుంది. దరఖాస్తు చేసిన 30రోజుల్లోగా పరిహారాన్ని రాష్ట్రవిపత్తు నిర్వహణ శాఖ ద్వారా అందిస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినప్పుడు కొందరిక అక్కడే ధ్రువపత్రం ఇచ్చారు. వారు నేరుగా మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా అని నిర్ధారణ అయి హోంఐసోలేషన్‌లో ఉంటూ 30రోజుల్లోపు మృతిచెందిన వారుంటే... ఆ కుటుంబసభ్యులు కొవిడ్‌ పాజిటివ్‌ ధ్రువపత్రంతో సంబంధిత పీహెచ్‌సీల వైద్యాధికారులను  సంప్రదించాలి. వారు పరిశీలించి ధ్రువపత్రం జారీ చేస్తారు. దానితో పంచాయతీ పరిధిలోని వారు కార్యదర్శికి, పురపాలక సంఘ పరిధిలోని వారు ఆ కార్యాలయంలో మరణ ఽధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. కార్యదర్శులు మాన్యువల్‌గా జారీ చేసే ధ్రువపత్రాన్ని అనుమతించరు. కనుక వారి లాగిన్‌ ద్వారా యూబీడీ పోర్టల్‌ నుంచి డిజిటల్‌ మరణ ధ్రువపత్రం జారీ చేయాలి. దాని ద్వారా మీ-సేవాలో ధరఖాస్తు చేసుకోవచ్చు.

వీరు సైతం..

ఈ కేటగిరీల్లోకి రాకుండా కూడా కొవిడ్‌తో మృతి చెందినవారుంటారు. వారికి మరణ ఽధ్రువపత్రంలో కొవిడ్‌ కారణమని నిర్ధారించకపోవచ్చు. అలాంటి వాటి విషయంలో మృతుల కుటుంబసభ్యులు తమ రక్తసంబంధీకుడి మృతికి కరోనానే కారణమని విశ్వసించినట్లయితే సంబంధిత పత్రాలను జత చేస్తూ కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీకి కొవిడ్‌ మరణ ధ్రువపత్రాన్ని జారీ చేయాలని కోరుతూ మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 30రోజుల్లోగా త్రిసభ్య కమిటీ ధ్రువపత్రాన్ని జారీచేయాలి. తిరస్కరిస్తే తగిన కారణాలు వెల్లడించాలి.

ప్రదక్షిణలు
కొవిడ్‌ మరణ ధ్రువపత్రాలు పొందడంలో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి  వస్తోంది. చాలా బాధిత కుటుంబాల వద్ద కొవిడ్‌ మరణమని ధ్రువీకరించే పత్రాలు లేవు. కొందరు తీసుకోలేదు. కొందరు పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాటి అవసరం రావడంతో వాటి కోసం తిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పత్రాల పట్ల సరైన అవగాహన లేదు. దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియడం లేదు. ఇలాంటి వారి కోసం  జిల్లా కేంద్రంలోగానీ, లేదా మండల కేంద్రంలో గానీ హెల్ప్‌డె్‌స్కను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement