ఆర్టీసీ బోల్తా.. బస్సుకు లాక్‌డౌన్‌ దెబ్బ

ABN , First Publish Date - 2020-08-04T21:47:37+05:30 IST

ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ)కు లాక్‌డౌన్‌ శాపంగా పరిణమించింది. అసలే నష్టాల్లో ఉన్న బస్సు చక్రాలకు కరోనా బ్రేక్‌ వేసింది. గడిచిన మూడు నెలల సగటు చూసినప్పుడు ఆక్యుపెన్సీ రేషియో సగటున 40 శాతానికి మించలేదు.

ఆర్టీసీ బోల్తా.. బస్సుకు లాక్‌డౌన్‌ దెబ్బ

40 శాతం మించని ఆక్యుపెన్సీ

రూ.40 కోట్ల నుంచి రూ.1.5 కోట్లకు పడిపోయిన ఆదాయం


ఏలూరు (ఆంధ్రజ్యోతి) : ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ)కు లాక్‌డౌన్‌ శాపంగా పరిణమించింది. అసలే నష్టాల్లో ఉన్న బస్సు చక్రాలకు కరోనా బ్రేక్‌ వేసింది. గడిచిన మూడు నెలల సగటు చూసినప్పుడు ఆక్యుపెన్సీ రేషియో సగటున 40 శాతానికి మించలేదు. నెలకు రూ.40 కోట్లు రావలసిన ఆదాయం రూ.1.5 కోట్లకు పడిపోయింది. లాక్‌డౌన్‌ సర్వీసులు నిలిపివేసిన సర్వీసులు మేలో పునరుద్ధరించారు. ప్రారంభంలో ఇబ్బంది పడినా చివరి పది రోజులు కొంచెం మెరుగుపడిన ఓఆర్‌ జూన్‌లో పూర్తిగా క్షీణించింది. జిల్లా వ్యాప్తంగా మే నెలలో 130 బస్సు సర్వీసులు నడపగా జూన్‌ మొదటి వారానికి 214 సర్వీసులకు పెంచారు. జూలై 1 నాటికి 191, జూలై 13 నాటికి వాటి సంఖ్య 124 సర్వీసులకు పడిపోయింది.


ఖర్చులకు కూడా కష్టమే..!

ప్రస్తుతం పీటీడీ బస్సుల నిర్వహణకు తగిన ఆదాయం కూడా రానిపరిస్థితి. సాధారణ రోజుల్లో కిలో మీటర్‌కు రూ.40 నుంచి రూ.45 ఆదాయం రావలసి ఉండగా ప్రస్తుతం కిలో మీటర్‌కు రూ.15 మాత్రమే వస్తుంది. మేలో ఇది కొంచెం పర్వాలేదని పించినా జూన్‌లో 17 శాతానికి, జూలైలో 15 శాతానికి తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు ప్రతీరోజు రూ.70లక్షల ఆదాయం రాగా ప్రస్తుతం అది రూ.4 లక్షల నుంచి రూ.5లక్షలకు పరిమితమైంది. నెలకు రూ.20కోట్లు ఆదాయం రావలసి ఉండగా రూ.1.50కోట్లకు పడిపోయింది. ప్రతీ నెల ఉద్యోగులు, కార్మికులకు రూ.8కోట్లు వేతనాలుగా చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడంతో ఆ భారం ప్రభుత్వమే భరించడం కొంత ఊరట.


కరోనా భయం..

లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలిస్తున్నప్పటికీ ప్రజలు ప్రయాణాలకు ఆసక్తి చూపడం లేదు. కరోన మహమ్మారి జిల్లాను చుట్టుముట్టేయడంతో ప్రజలు దాదాపు ప్రయాణాలు మానుకున్నారు. జూలై 13న మరోసారి లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం కావడంతో బస్సు సర్వీసులు భారీగా తగ్గించుకోవలసి వచ్చింది. ప్రస్తుతం సర్వీసులు పునరుద్ధరిసస్తే ఆదాయం మెరుగుపడుతుందని ఆర్‌ఎం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-04T21:47:37+05:30 IST