ప్రైవేటు ఆస్పత్రులూ సిద్ధం!

ABN , First Publish Date - 2020-03-31T09:20:50+05:30 IST

కరోనా కట్టడి కోసం ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రులను, ప్రైవేటు ఆస్పత్రుల సేవలనూ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సోమవారం ఆరోగ్య శాఖ

ప్రైవేటు ఆస్పత్రులూ సిద్ధం!

  • కరోనా కట్టడిలో భాగం కావాలి
  • మధ్యాహ్నం 1 గంట వరకు వ్యవసాయోత్పత్తుల రవాణా
  • మరిన్ని చర్యలు తీసుకున్న సర్కారు


అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి కోసం ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రులను, ప్రైవేటు ఆస్పత్రుల సేవలనూ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సోమవారం ఆరోగ్య శాఖ నుంచి కలెక్టర్లకు  ఆదేశాలు వెళ్లాయి. ‘‘ప్రైవేటు ఆస్పత్రుల పరిధిలో  అన్ని రకాల పరికరాలు, పడకలు, ల్యాబ్స్‌, వెంటిలేటర్లతోపాటు సిబ్బందిని కూడా సమాయత్తం చేయాలి. విపత్తు కాలంలో సూచనలు,  సలహాలు ఇవ్వడానికి వైద్య నిపుణులు, కన్సల్టెంట్లను సిద్ధంగా ఉంచాలి. ప్రభుత్వానికి అవసరమైన అతి కీలకమైన సదుపాయాలను ఆయా ఆస్పత్రులే ఏర్పాటు చేసుకోవాలి. ప్రైవేటు, ఎన్జీవో సంస్థలు ఎలాంటి తారతమ్యాలు చూపించకుండా తమ సేవలను కొనసాగించాలి’’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసరం అనుకుంటే ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీవోల పరిధిలోని ఆస్పత్రుల్లో, వైద్యాలయాల్లోని స్పెషలిస్ట్‌ డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బందితోపాటు పారా మెడికల్‌ సిబ్బందిని విపత్తు సేవలకు వాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో... జిల్లా కలెక్టర్‌/నిర్దేశిత అధికారి ఇచ్చే ఆదేశాలు, ఉత్తర్వులను ప్రైవేటు ఆస్పత్రులు పాటించి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయన్నారు.


బాధ్యత కలెక్టర్లదే: మంత్రి కన్నబాబు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన బాధితులను ఆసుపత్రుల్లో చేర్పించి, వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వ్యవసాయ రవాణాకు అనుమతిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులందరూ పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు.

Updated Date - 2020-03-31T09:20:50+05:30 IST