కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజల జీవనస్థితిగతులు తలకిందులయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా గత యేడాది మార్చి ఆఖరులో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ ప్రభావం ప్రతి ఒక్కరిపైనా, ప్రతి రంగంపైనా తీవ్రంగా పడింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ కోలుకోలేని విధంగా నష్టపోయింది. ఆ తర్వాత కరోనా అన్‌లాక్‌లో భాగంగా సినిమా షూటింగులకు, థియేటర్లను తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత యేడాది డిసెంబరు మూడో వారం నుంచి థియేటర్లు 50 శాతం ప్రేక్షకుల సామర్థ్యంతో తెరుచుకున్నాయి. జనవరిలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించారు. కానీ, పెద్ద హీరోల సినిమాల విడుదల సమయంలోనే థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. చిన్న హీరోలు, చిన్న బడ్జెట్ చిత్రాల విడుదల సమయంలో థియేటర్ వైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడటం లేదు.
అదే సమయంలో పలు మల్టీప్లెక్స్‌లలో ఉన్న పెద్ద థియేటర్లు ఇప్పటికీ తెరుచుకోలేదు. దీనికి కారణం.. పెద్ద హీరోల చిత్రాలు విడుదలకు నోచుకోకపోవడం, ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడమే. చెన్నై నగరంలో ప్రముఖ మల్టీ కాంప్లెక్స్‌గా పేరొందిన థియేటర్లు, మాల్స్‌లోని ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన థియేటర్లలో బొమ్మ పడటం లేదని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఒక వేళ కొన్ని మల్టీప్లెక్స్‌లలో సినిమాలు ప్రదర్శించినా ప్రేక్షకుల సంఖ్య వందకు మించడం లేదు. దీంతో థియేటర్ యజమానులు మల్టీప్లెక్స్‌లలోని తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లలోనే సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదని సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.