ఆర్టీసీ ఆదాయంపై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2022-01-18T05:59:17+05:30 IST

శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆర్టీసీ అదనపు ఆదాయాన్ని భారీగా దెబ్బతీశాయి. పండుగ ముందు, ఆ తరువా త వచ్చిన సెలవుల కారణంగా ఆర్టీసీ అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి.

ఆర్టీసీ ఆదాయంపై కరోనా ఎఫెక్ట్‌

స్పెషల్‌ బస్సులు రద్దు 

పెరగని పండుగ కలెక్షన్‌    

హైవేలపైన తగ్గిన రద్దీ


నల్లగొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆర్టీసీ అదనపు ఆదాయాన్ని భారీగా దెబ్బతీశాయి. పండుగ ముందు, ఆ తరువా త వచ్చిన సెలవుల కారణంగా ఆర్టీసీ అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. చార్జీ లు పెంచకపోయినా, కరోనా నిబంధనలు పాటించినా, హైదరాబాద్‌లోని కళాశాలల వద్ద కే ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినా, సాధారణ రోజులకు మించి ఆదాయం రాలేదు.


ఆదాయంపై ప్రభావం

ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ నల్లగొండ రీజియన్‌ పరిధిలో ఏడు డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో సాధారణ రోజుల్లో 735 బస్సుల ద్వారా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అదనపు బస్సులు నడిపి ఆదాయా న్ని పెంచుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించే లా చార్జీలు సైతం పెంచలేదు. సాధారణంగా పండుగల సందర్భంగా స్పెషల్‌ బస్సులు నడిపి అధికంగా చార్జీ వసూలు చేసేవారు. ఈ ఏడాది సంక్రాంతికి స్పెషల్‌ బస్సులు నడిపినా చార్జీలు మాత్రం పెంచలేదు. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులను శానిటైజ్‌ చేయడం, మాస్‌ ధరించాలన్న నిబంధనను కఠినతరం చేశారు. 30మంది ఉంటే చాలు వారి వద్దకే ఆర్టీసీ బస్సు పంపేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ హైస్కూళ్లు, జూనియర్‌ కళాశాలల్లో జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నేరుగా బడా కళాశాలల ముంగిటకే ప్రత్యేక బస్సులు పంపారు. పండుగ పూట రూ.1.20కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆశించినా రూ.95లక్షలకే పరిమితమైంది. ఇది సాధారణ రోజుల్లో ఆర్టీసీ ఆర్జించే ఆదాయం కావడం గమనార్హం. ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులు ఏర్పాటు చేసినా స్పందన లేదు. దీంతో పండుగ స్పెషల్‌గా ఉమ్మడి జిల్లాలో కేటాయించిన 304 బస్సుల్లో సగం సర్వీసులను అధికారులు ముందే రద్దు చేశారు. ఆదాయం సాధారణ రోజులకు పడిపోవడానికి కారణాలు అధికారులు విశ్లేషించారు. కరోనా కారణంగా చాలామంది ద్విచక్ర వాహనాలతో పాటు సొంత కార్లలోనే ప్రయాణానికి ప్రజలు మొగ్గుచూపినట్టు తేలింది. అంతేగాక సంక్రాంతి పండుగ ఈ నెల 14న కాగా, 8వ తేదీ నుంచే సెలవులు ప్రారంభమయ్యాయి. ఆరోజు నుంచే క్రమంగా ప్రయాణికులు సొంత గ్రామాలకు వెళ్లడం ప్రారంభించడంతో పండుగ వేళలో ఆశించిన ఆదాయం దక్కలేదు. దీనికి తోడు ఒమైక్రాన్‌ విజృంభిస్తుండటంతో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇచ్చిన సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం 16న మధ్యాహ్నం సమయంలో ప్రకటించింది. దీంతో సొంత గ్రామాలకు వెళ్లిన వారు అక్కడే మరికొద్ది రోజులు ఉండాలని భావించడంతో పండుగ ముగిసిన మరుసటి రోజు ఆశించిన ఆదాయం కనిపించలేదని అధికారులు గుర్తించారు. దీనికి తోడు పండుగ ముందురోజు మొదలు పండుగ ముగిసిన ఈనెల 16వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా అంతటా ముసురు, చలిగాలి, మబ్బులు కమ్మడంతో పండుగకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణానికి సుముఖత చూపలేదు. ఇది ఆర్టీసీ ఆదాయంపై ప్రభావంపై చూపినట్టుగా అధికారులు భావిస్తున్నారు.


కరోనాతో తగ్గిన ప్రయాణాలు

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య రెండేళ్లుగా తగ్గింది. కరోనాకు ముందు 2020 సంక్రాంతి పండుగ ముందురోజుల్లో పంతంగి టోల్‌గేటు మీదుగా ఒక్కరోజే సుమారు 50వేల వాహనాలు విజయవాడ వైపు వెళ్లాయి. కరోనా కారణంగా 2021, 2022లో వీటి సంఖ్య 40వేలకు పడిపోయిందని జీఎంఆర్‌ టోల్‌గేట్‌ జీఎం శ్రీధర్‌రెడ్డి తెలిపారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ సౌకర్యం అందుబాటులోకి రావడం, పండుగతో సంబంధం లేకుండా చాలామంది హైదరాబాద్‌ నుంచి ముందుగానే సొంత గ్రామాలకు వెళ్లిపోవడంతో హైవేపై రద్దీ తగ్గింది. కరోనా భయంతో చాలామంది సొంతూళ్లకు ప్రయాణాలను రద్దుచేసుకొని ఉన్నచోటనే పండుగను కానిచ్చేశారు. దీనికి తోడు ప్రభుత్వం ఈనెల 30 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో హైదరాబాద్‌ రావల్సినవారు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. 2020 జనవరిలో ఫాస్ట్‌ ట్యాగ్‌ అమల్లోకి రాకముందు పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేది. ఫాస్ట్‌ట్యాగ్‌ ఆచరణలోకి రావడంతోపాటు, పోలీసులు, జీఎంఆర్‌ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టడంతో ఈ ఏడాది ట్రాఫిక్‌ జామ్‌, రోడ్డు ప్రమాదాలు తగ్గాయి.


ఒమైక్రాన్‌ భయంతోనే ఆశించిన ఆదాయం  రాలేదు : రాజేంద్రప్రసాద్‌, నల్లగొండ రీజియన్‌ ఆర్టీసీ ఆర్‌ఎం

ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన కనిపించింది. అంతేగాక నాలుగు రోజులుగా వాతావరణం పూర్తిగా మారి వర్షాలు ఇబ్బంది పెట్టాయి. ఈనెల 30 వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ఆర్టీసీ పండుగ ఆదాయంపై ప్రభావం చూపాయి. ఆశించిన ఆక్యుపెన్సీ రేషియో(ఏఆర్‌) లేకపోవడంతో స్పెషల్‌ బస్సుల్లో సగం రద్దు చేశాం. కరోనా కారణంగా రెండేళ్లుగా పండుగ వేళల్లో సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయమే ఆర్టీసీకి దక్కింది. అదనపు ఆదాయం లేదు.


Updated Date - 2022-01-18T05:59:17+05:30 IST